Phobias: స్కూలంటే భయం.. చదువంటే భయం.. పిల్లల్లో ఈ ఫోబియాలకు కారణాలివే..

Phobias: స్కూలంటే భయం.. చదువంటే భయం.. పిల్లల్లో ఈ ఫోబియాలకు కారణాలివే..

Update: 2024-09-27 06:41 GMT

దిశ, ఫీచర్స్: పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే మొదట్లో భయపడతారు. కొన్ని రోజుల తర్వాత అలవాటు పడతారు. అప్పుడు సహజంగానే వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఎంతకాలమైనా.. ప్రతీరోజు వెళ్లమంటూ మారాం చేస్తుంటే మాత్రం అది మానసిక రుగ్మత కావచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ‘ఫోబియా’లు కూడా పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు దారితీస్తాయని చెప్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డిడాస్కలీనో ఫోబియా

పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటేనే భయపడి ఏడ్చేసే పరిస్థితి ఏర్పడిందంటే వారు డిడాస్కలీనో ఫోబియాకు గురై ఉంటారని అనుమానించాలి. మొదటిసారి బడికి వెళ్లినప్పడు, ఆ తర్వాత కూడా ఒక నెలో, రెండు నెలలో పాఠశాలకు వెళ్లాలంటే పిల్లలు సహజంగానే భయపడుతుంటారు. కానీ ఎప్పుడూ అదే కొనసాగితే ఆ భయం మరింత ఎక్కువైపోతుంటే మాత్రం వారిలో డిడాస్కలీనో ఫోబియా (Didascalino phobia) డెవలప్ అయి ఉండవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. చిన్న పిల్లలకు అర్థం అయ్యేలా నచ్చ జెప్పడం, ప్రేమగా మందలించడం, మరీ ఎక్కువగా భయపెట్టకుండా డీల్ చేయడం వంటివి చేస్తే పర్లేదు. కానీ కొందరు పేరెంట్స్, స్కూళ్లల్లో టీచర్లు చిన్న పిల్లలను డీల్ చేసే విధానం సరిగ్గా ఉండదు. దీంతో డిడాస్కలీనో ఫోబియా తలెత్తుంది. ఫలితంగా స్కూల్‌కు వెళ్లాలంటేనే భయపడిపోతారు.

సోఫో ఫోబియా

చిన్న పిల్లల మనస్తత్వం తెల్లకాగితం లాంటిది అంటారు. నిజానికి చిన్నప్పుడు ఏ విషయమైనా ఇట్టే గ్రహించడం, గుర్తు పెట్టుకోవడం వీరిలో కనిపించే సహజ లక్షణం. అలాంటప్పుడు చదువు కూడా వారికి ఈజీగానే వస్తుంది. కాకపోతే బాగా చదవాలని అధిక ఒత్తిడికి గురిచేయడం, ఎక్కువగా దండించడం వంటి కారణాలతో భయం వల్ల కూడా పిల్లల్లో తడబాటు, చదివింది గుర్తుకు లేకపోవడం, నేర్చుకునే సామర్థ్యం దెబ్బతినడం వంటివి జరగవచ్చు. ఈ కారణంగా చదువులో రాణించకపోవడాన్నే సోఫో ఫోబియాగా (Sophophobia) నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత చదివినా బుర్రకెక్కదు. మ్యాథ్స్ అంటే భయపడుతుంటారు. దీని నుంచి బయటపడాలంటే పేరెంట్స్, టీచర్స్ పిల్లలతో ప్రేమగా ఉంటూ వారిని డీల్ చేయాలి. సబ్జెక్ట్ పట్ల అవగాహన పెంచాలి. కఠినంగా చెప్పడమో, దండిచడమో కాకుండా సింపుల్‌గా చెప్పాలి.

అటెలో ఫోభియా

కొందరు పిల్లలు హోమ్ వర్క్ చేయడంలో ఇబ్బంది పడతారు. భయం కారణంగా పూర్తి చేయలేకపోతారు. దీంతో మరింత ఆందోళన చెందుతుంటారు. వర్క్ పూర్తి చేయలేదని, పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేదని బాధపడుతుంటారు. దీనినే అటెలో ఫోబియాగా (Atelophobia) మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే అనేక విషయాల్లో ‘ఎస్కేప్’ అవ్వాలనే ధోరణి పిల్లల్లో పెరిగిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు గ్రహించి పిల్లలకు నచ్చజెప్పాలి. వారిలో ఆందోళనకు గల కారణాలు తెలుసుకొని నివారించాలి. అవసరమైతే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.

టెస్టో ఫోబియా

పరీక్షలంటేనే ఏదో భయం వెంటాడుతుంది. టెన్షన్‌కు గురవుతుంటారు. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వారు టెస్టో ఫోబియా(Testophobia)కు లోనయ్యారని అర్థం. ఈ పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల్లో సరిగ్గా పరీక్షల సమయంలో జ్వరం రావడం, పరీక్ష హాల్లోకి వెళ్తే ఒళ్లంతా చెమటలు పట్టి కంగారు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే పిల్లలు పెద్దయ్యాక కూడా ఈ ఫోబియా కొనసాగే అవకాశం లేకపోలేదు. అప్పుడు వర్క్ ప్లేస్‌లలో ఆందోళనకు గురవుతుంటారు. కాబట్టి మొదట్లోనే పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా దీనిని పోగొట్టాలి.

నోమో ఫోబియా

ఇటీవల చాలామంది పిల్లల్లో నోమో ఫోబియా (Nomophobia) కనిపిస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ మానసిక స్థితిలో ఉన్న పిల్లలు ఫోన్ లేకుండా చదవడానికి ఇష్టపడరు. ఆన్‌లైన్ క్లాస్‌లని, ప్రాజెక్ట్స్‌లో డౌట్స్ ఉన్నాయని తరచుగా ఫోన్లు తీసుకుంటారు. మ్యాథ్స్ చేయడానికి కూడా ఫోన్ ఉపయోగిస్తుంటారు. చిన్న చిన్న డౌట్స్ ఉన్నా ఫోన్‌లో గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. దీంతో క్రమంగా ఫోన్ వాడటం వాళ్లల్లో వ్యసనానికి దారితీస్తుంది. చివరికి ఫోన్ లేదని గానీ, ఇవ్వమని గానీ చెప్తే వీరు ఆందోళనకు గురవుతారు. ఆ రోజు హోమ్ వర్క్ చేయరు. సరిగ్గా చదవరు. ఈ ఫోబియా పిల్లల్లో చాలా డేంజర్. వారిలో అనారోగ్యాలకు, గాడ్జెట్స్ వ్యసనాలకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక కచ్చితమైన అవసరం ఉంటే తప్ప స్కూల్ పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా ఉండటమే బెటర్ అంటున్నారు నిపుణులు. అయితే ఈ విషయంలో వారిని చక్కగా డీల్ చేయడం ద్వారా ఒప్పించే ప్రయత్నం చేయాలి. 


Similar News