Personalty Test: మాట తీరును బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో చెప్పొచ్చు..! గుర్తించదగ్గ లక్షణాలివే..

Personalty Test: మాట తీరును బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో చెప్పొచ్చు..! గుర్తించదగ్గ లక్షణాలివే..

Update: 2024-09-24 13:27 GMT

దిశ, ఫీచర్స్ : మాట తీరు మనిషిలో ఆనందాన్ని కలిగిస్తుంది.. ఆవేశాన్నీ రగిలిస్తుంది. మాట తీరు మనిషిలో మంచిని సూచిస్తుంది. చెడునూ పెంపొందిస్తుంది. అందుకే మాట విలువైనది. మాట తీరు ముఖ్యమైనది అంటారు పెద్దలు. అయితే ఆ మాటలే మనిషిలోని అసలు నైజాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా తెలుపుతాయని, మాట్లాడే తీరును బట్టి సదరు వ్యక్తులు ఎలాంటివారో చెప్పవచ్చునని, ఇది వందశాతం కరెక్టు కాకపోయినా దాదాపు చాలామందిలో ఇటువంటి లక్షణాలు, వ్యక్తిత్వాలు కనిపిస్తుంటాయని హీలింగ్ అండ్ పర్సనాలిటీ స్కిల్స్ నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం.

* బిగ్గరగా మాట్లాడేవారు : సాధారణంకంటే బిగ్గరగా మాట్లాడుతుంటారు కొందరు. ఒక్కోసారి అరచినట్లు కూడా మాట్లాడతారు. ఇలాంటి వారిలో నాయకత్వ లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువ. ఏ విషయంలోనైనా ఇతరులను ఓడించాలని భావిస్తారట. అంతేకాకుండా వీరు మాట్లాడుతున్నప్పుడు వేరొకరు మాట్లాడటాన్ని అస్సలు ఇష్టపడరు. ఇతరులను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు పొరపాట్లు చేయడంవల్ల ఇబ్బందుల్లో పడతారు.

* వేగంగా మాట్లాడేవారు : వీరు ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల పలు సందర్భాల్లో వివాదాల్లో కూడా చిక్కుకుంటారు.

* నత్తిగా మాట్లాడేవారు : నత్తిగా మాట్లాడేవారిపై సరదాగా కొందరు సెటైర్లు వేస్తుంటారు. కానీ వీరు చాలా తెలివైన వారిగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. పైగా ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. చిన్న చిన్న విషయాల్లోనూ కేర్ తీసుకుంటారు. అయితే న్యూనతాభావం, భయం, ఆందోళన, సిగ్గు వంటి లక్షణాలు నత్తిగా మాట్లాడే వ్యక్తుల్లో కనిపిస్తాయి.

* మధ్యలో కలుగ జేసుకొని మాట్లాడేవారు : కొందరు ఇతరులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో కలుగజేసుకొని మరీ మాట్లాడేస్తుంటారు. ఈ ధోరణి గలవారిలో మొండితనం ఎక్కువగా ఉంటుందట. అయితే మంచి ఆలోచనలతో వీరు అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే తమ మాటలకు ఎదుటివారు స్పందించకుంటే, సమాధానం చెప్పకపోతే అలగడం, కోపగించుకోవడం కూడా ఈ తరహా వ్యక్తుల లక్షణాల్లో ఒకటి.

* నిదానంగా మాట్లాడేవారు : బిగ్గరగా, వేగంగా మాట్లాడేవారు పలు విషయాల్లో ఆకట్టుకుంటారు. కానీ వారికంటే స్లోగా మాట్లాడేవారు తెలివైన వారిగా, సృజనాత్మకత, ఆత్మ విశ్వాసం కలిగిన వారిగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వారు చాలా వరకు అంతర్ముఖులై ఉంటారు. ఏ విషయాన్నీ, ఎవరినీ అంత ఈజీగా నమ్మరు. ప్రతీ విషయంలో క్లారిటీ కోరుకుంటారు. జాగ్రత్తగా ఉండాలని భావిస్తారు. సహనం ఎక్కువే అయినా.. కొన్నిసార్లు చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవడంవల్ల ఇబ్బందుల్లో కూడా పడుతుంటారు.

* అరుస్తూ మాట్లాడేవారు : వీరు తమ మాటతీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులను మెప్పించడంలో ఫెయిల్ అవుతారు. అలాగే వీరు పిరికి వారిగా ఉంటారని, ఆత్మ విశ్వాసం కూడా తక్కువేనని నిపుణులు చెప్తుంటారు. అభద్రత, డిపెండెన్సీ, నిలకడలేని మనస్తత్వం కలిగి ఉంటారు.

*మృదువైన మాట తీరు : వీరు ఓపెన్ మైండెడ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మానసికంగాను, శారీరకంగాను బలంగా, నమ్మకంగా ఉంటారు. ఇతరులను తమవైపు ఆకర్షించడంలో దిట్ట, వీరి మాటలకు ఇతరులు ఆకర్షితులవుతారు. ప్రభావితం చేయడంలో, ఇతరులను మెప్పించడంలో వీరు ఎక్కువగా సక్సెస్ అవుతుంటారు. వివాద రహితులుగా ఉంటారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News