Only one : జీవితాంతం ఒంటరిగానే అలా..!!
Only one : జీవితాంతం ఒంటరిగానే అలా..!!
దిశ, ఫీచర్స్ : ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో మీరొక్కరే ఉంటే ఎలా ఫీల్ అవుతారు..? కాసేపు సరదాకోసం, ప్రశాంతత కోస అయితే సంతోషంగానే భావిస్తారు. కానీ జీవితాంతం ఒంటరిగానే ఉండాల్సి వస్తే.. వామ్మో వినడానికే భయంగా ఉందంటారు కొందరైతే.. కానీ అమెజాన్ ఫారెస్ట్‌లో ఓ వ్యక్తి మాత్రం లైఫ్ లాంగ్ ఒంటరిగానే బతికాడు. ఇంకా తమ జాతి అంతరించిపోవడంతో ప్రపంచంలోనే ఒంటరి జీవితాన్ని గడిపి తనువు చాలించిన జంతువులు చాలానే ఉన్నాయి. సమాజానికి దూరంగా ఉంటున్న ఆకర్షణీయమైన ఒంటరి ప్రదేశాలు, ఒంటరి చెట్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం.
‘మ్యాన్ ఆఫ్ ది హోల్ ’
బ్రెజిల్ భూ భాగం పరిధిలోకి వచ్చే అమెజాన్ ఫారెస్ట్‌లో దాదాపు 22 సంవత్సరాలుగా ఓ వ్యక్తి ఒంటరిగా జీవించాడు. ప్రపంచంలోనే ఒంటరిగా గడిపి వ్యక్తిగా అతన్ని పేర్కొంటారు. అడవిలోని గోతుల్లో, గుహల్లో దాక్కోవడం, జంతువులను ట్రాప్ చేయడం వంటివి చేయడంవల్ల ఇతనికి ‘మ్యాన్ ఆఫ్ ది హోల్’గా పేరు వచ్చింది. కాగా 80ల నుంచి రైతులు, ఇతరులు భూ ఆక్రమణల సందర్భంగా రోండోనియాలోని భూభాగాన్ని ఆక్రమించి, అక్కడి వారిని ఊచకోత కోసినందున మిగిలిన ఒకే ఒక వ్యక్తిగా ఈ ‘మ్యాన్ ఆఫ్ ది హోల్’గా భావిస్తారు. కానీ నిజానికి అతను మాట్లాడే భాష, అతని నిజమైన తెగ ఏది? అనేది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. కాగా బ్రెజిల్ విదేశీ వ్యవహారాల విభాగానికి చెందిన ఫన్నె (FUNAI) పేరుగల సంస్థకు చెందిన అధికారులు ఫారెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ది హోల్ నివసించే భూ భాగాన్ని సంరక్షించింది. 2018లో అడవిలో అర్ధనగ్నంగా తిరుగుతున్న అతని అరుదైన వీడియో ఫుటేజీని కూడా ప్రపంచానికి చూపించింది. కానీ దురదృష్టవశాత్తు ‘మ్యాన్ ఆఫ్ ది హోల్ ’ 2022లో గొడ్డలి గాయం తగిలి మరణించాడు.
లోన్సమ్ జార్జ్ తాబేలు
ఒంటరి తనం ఎలా ఉంటుందో ఆధునిక మానవులకు సుపరిచితమే. మనుషుల మధ్య సంబంధాలు బలహీన పడినప్పుడు అందరూ ఉన్నా ఒంటరి తనాన్ని అనుభవించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. మనుషులే కాదు, ప్రపంచంలో వివిధ జంతువులు, వృక్షాలు కూడా ఒంటరి తనాన్ని అనుభవించాయి. కొన్ని ప్రాంతాలు, చెట్లు ఒంటరిగా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో గాలాపాగోస్‌లోని పింటా ఐలాండ్‌లో గల లోన్సమ్ జార్జ్ (చెలోనోయిడిస్ అబింగ్డోని) అనే తాబేలు కూడా ఒకటి. ఇది బతికినంత కాలం ఒంటరిగానే జీవించింది. ఎందుకంటే ఈ జాతి తాబేళ్లన్నీ అప్పటికే అంతరించిపోయాయి. కాగా 19వ శతాబ్దంలో లోన్సమ్ జార్జ్ తాబేలు జాతి పూర్తిగా కనుమరుగై పోయిందనుకున్నారు. కానీ1972లో ఒకానొక్క తాబేలు ఉన్నట్లు కనుగొనబడింది. దీంతో దానిని జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు. కానీ 2012లో మరణించింది.
52 బ్లూ తిమింగలం
ప్రపంచంలో ఒక నిర్దిష్ట భాష మాత్రమే మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మీరే అనుకోండి. అప్పుడెలా ఉంటుంది. ఇతరులెవరికీ మీ భాష అర్థం కాదు. కాబట్టి ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తారు. సరిగ్గా ప్రపంచంలోనే అలాంటి పరిస్థితిని అనుభవించిన ఏకైక తిమింగలం ‘52 Blue’. ఈ నీలం రంగు తిమింగలాలు 10-39 Hz ఫ్రీక్వెన్సీతో కమ్యూనికేట్ చేస్తాయి. అంటే సేమ్ జాతివి తప్ప మిగతా తిమింగలాలు ఏవీ దీని భాషను వినలేవు లేదా అర్థం చేసుకోలేవు. అలా సువిశాలమైన సముద్రంలో తిరుగుతూ ఒంటరి జీవితాన్ని గపుతున్న ఈ 52 బ్లూ తిమింగలం 1980లో కనుగొనబడింది. ప్రపంచంలోని ఒంటరి జీవులలో ఇదొకటి.
టఫీ ఫ్రాగ్
టఫీ లేదా కఠినమైన కప్ప (Toughie the frog) అనేది ప్రపంచంలోని చివరి కప్ప జాతిలో ఒకటిగా చెప్తారు. ఈ అరుదైన జాతి సాధారణంగా పనామాలోని రెయిన్ ఫారెస్ట్‌లో ఉండేదట. ఈ కప్పలు ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి పాకేవి. ఒక విస్తృతమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ కప్ప జాతి అంతరించిపోవడంతో మిగిలిన ఒకే ఒక కప్పను సంరక్షించే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు తీసుకురాగా ఒంటరిగానే ఏడేళ్లు గడిపిన ఈ కప్ప గతేడాది ప్రాణం వదిలింది.
క్యూరియాసిటీ రోవర్
భూమి నుంచి చాలా కాంతి సంవత్సరాల దూరంలో మార్స్ గ్రహంపై దాదాపు ఏడేండ్లు ఒంటరిగా ఉన్న వస్తువుగా క్యూరియాసిటీ రోవర్‌ను కూడా పేర్కొంటారు. పైగా ఈ క్యూరియాసిటీ రోవర్ మార్టిన్ ల్యాండింగ్ వార్షికోత్సవం సందర్భంగా తనకు తాను ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పుకుందట. గెలాక్సీలో ఒంటరిగా పుట్టిన రోజును జరుపుకున్న ఏకైక రోబోగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
సుడాన్ ది రైనో
సుడాన్ ది వైట్ రైనో : ఉత్తర సుడాన్‌లో ఉండే తెల్లని ఖడ్గ మృగం ఇది. కాగా దీని జాతి అంతరిపోయింది అనుకుంటుండగా 2009లో కెన్యాలోని ఓ అటవీ ప్రాంతంలో ఒక మగ, రెండు ఆడ ఖడ్గ మృగాలు కనిపించాయి. అవి వేట నుంచి తప్పించుకున్నాయని భావించిన జంతు సంరక్షణ నిపుణులు వాటిని తీసుకొచ్చి జూలో పోషించారు. కానీ ఆడ తెల్ల ఖడ్గ మృగాలు కొన్ని రోజుల తర్వాత చనిపోయాయి. ఇక మిగిలి ఉన్న ఏకైక మగ తెల్ల ఖడ్గ మృగం 2014లో అనారోగ్యం పాలైంది. దాని వెనుక కాళ్లు బలహీన పడ్డాయి. ఒంటరి జీవితాన్ని గడుపుతూ చివరికి 2018లో అది చనిపోయింది.
ట్రీ ఆఫ్ టెనెరే
సహారా ఏడారిలో దశాబ్దాల వరకు కనిపించిన ఒకే ఒక చెట్టు ట్రీ ఆఫ్ టెనెరే. ఈ చెట్టు 400 కి.మీ (250 మైళ్లు ) వరకు విస్తరించి ఉండేది. 1938లో ఈ వృక్షజాతికి సంబంధించిన చెట్లు అక్కడ ఏవీ కనిపించలేదు. ఇదొక్కటే ఉండగా.. 1973లో ఒక వాహన దారుడు దానిని ఢీకొట్టడంతో చనిపోయింది. ప్రస్తుతం ఆ చెట్టు స్థానంలో ఒక ఐరన్ స్తంభం ఉంది.
ట్రిస్టన్ డా కున్హా ద్వీపం
ప్రపంచంలో ఇతర సమాజాలతో, దేశాలతో, మనుషులతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్న ఏకైక ద్వీపం ట్రిస్టన్ డా కున్హా. ఈ అసాధారణమైన ద్వీపం బ్రెజిల్ అండ్ దక్షణాఫ్రికా రెండింటి తీరాలను నుంచి వేల కిలోమీటర్ల దూరంలో దక్షిణ అట్లాంటిక్‌లో ఉంది. కాగా ఇక్కడ ఇప్పుడు 250 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ట్రిస్టన్ దాటి, బయటి ప్రపంచంలోకి రావాలంటే.. ఆరు రోజుల పడవ ప్రయాణం చేయాల్సి వస్తుందట. అయినప్పటికీ అక్కడి ప్రజలు దీనిని ఇష్టపడుతున్నారు. తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఒంటరి ద్వీపంగా ప్రసిద్ధి చెందింది.