జైసల్మేర్ - చారిత్రక స్వర్ణ నగరం
జైసల్మేర్‌లో హోటలు గదిలోకి ప్రవేశం మధ్యాహ్నం పన్నెండు గంటలకు. కానీ మయూర్ ట్రావెల్ మేనేజర్ వైష్ణవ్ చొరవతో మాకు ఉదయమే గదులు ఏర్పాటు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : జైసల్మేర్‌లో హోటలు గదిలోకి ప్రవేశం మధ్యాహ్నం పన్నెండు గంటలకు. కానీ మయూర్ ట్రావెల్ మేనేజర్ వైష్ణవ్ చొరవతో మాకు ఉదయమే గదులు ఏర్పాటు చేశారు. మేము తయారై కిందకు వచ్చేసరికి గైడు కూడా సిద్ధంగా ఉన్నాడు. జైసల్మేర్ పట్టణంలో భవనాలన్నీ బంగారపు రంగులో చాలా అందంగా ఉన్నాయి. అందుకే దానిని Golden city అని కూడా అంటారు. కొత్తగా నిర్మించే భవనాలకు కూడా బయట వైపు అదే పసుపురంగు ఇసుక రాయిని వాడాలనే ఖచ్చితమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని గైడ్ చెప్పాడు. అది యునెస్కో గుర్తించిన చారిత్రాత్మక నగరం. ప్రస్తుత నగర జనాభా ఒక మిలియన్. అందులో దాదాపు నాలుగైదు వేల ప్రజలు కోట లోపల నివసిస్తున్నారట. ఆ రోజుల్లోనే వివిధ వర్గాల ప్రజలు కోటలోపల నివసించేవారు. ఆయా కుటుంబాల వారికి అది వారసత్వంగా రావడం, నేటికీ వాళ్ళు అక్కడే నివసిస్తున్నారట. అలా నగరాన్ని చూస్తూ కోటను చేరుకున్నాము.
ప్రపంచంలోనే ప్రాచీనమైన ఎడారి కోట
బంగారు రంగు ఇసుక కొండపై ఉన్న జైసల్మేర్ కోట కేవలం ఒక చారిత్రాత్మకమైన కోట మాత్రమే కాదు. నివాస గృహాలు, దేవాలయాలు, దుకాణాలు, రెస్టారెంట్లతో కూడిన చిన్న పట్టణం. అది ప్రపంచంలోనే ప్రాచీనమైన ఎడారి కోట. రాజస్థాన్ లో పురాతనమైన కోటలలో రెండవది. రాజ్ పుత్ భాటియా వంశానికి చెందిన రావల్ జైసల్ అనే రాజు 1155 AD లో ఆ కోటను నిర్మించాడు. మేర్ అంటే కోట, పర్వతం, శిఖరం అనే అర్థాలు ఉన్నాయి. జైసల్ పేరు మీదుగా దానికి జైసల్మేర్ అనే పేరు స్థిరపడింది. పసుపు రంగు ఇసుక రాయితో నిర్మించడం వలన దానిని Golden fort, సోనార్ ఖిల్లా అని కూడా పిలుస్తారు. కోట చుట్టూ నగరం విస్తరించి ఉన్నది. 1500 అడుగుల పొడవు, 750 అడుగుల వెడల్పుతో చాలా విశాలంగా ఉన్నది. ఎత్తు 250 అడుగులు.
12 కిలోమీటర్ల కోటగోడ... చెక్కుచెదరని బురుజులు
కోట పైనుంచి నగరం మొత్తం బంగారపు రంగులో ఎంతో అందంగా కనిపిస్తుంది. కోట పైన అప్పటి ఫిరంగి ఉన్నది. కోట పైకి ఎక్కడానికి ఎత్తైన చిన్న మెట్లు ఉన్నాయి. పైకి ఎక్కడం కొంచం కష్టంతో కూడిన పనే... రాజవంశీయులు ప్రస్తుతం కోట బయట నివసిస్తున్నారు. ఆ భవనాన్ని కోట పైనుంచి స్పష్టంగా చూడవచ్చు. కోట చుట్టూ 30 అడుగుల ఎత్తుతో 97 బురుజులతో పొడవైన ప్రహరీగోడ ఉన్నది. వాటిలో 92 బురుజులు 1633-1647 మధ్య కాలంలో నిర్మించబడ్డాయి. 93 బురుజులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం.
రాజస్తానీ సంస్కృతికి ప్రతిబింబం
కోటలోపలికి వెళ్ళడానికి అఖై, గణేశ, సూరజ్ పోల్, హవ అనే నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. ముఖ్యమైన వ్యాపారాలకు అనువుగా పురాతన సిల్కు రోడ్డు కూడలి వద్ద ఉండడం వలన కాబోలు లోపలికి వెళ్ళగానే నాకు ఉజ్బెకిస్తాన్ దేశంలోని బుఖరా నగరం గుర్తుకొచ్చింది. కోట నిర్మాణం ఇస్లామిక్, రాజ్ పుత్ శైలులను మేళవించి ఉన్నది. కోట లోపల ఇరుకైన దారులలో హస్తకళలు, వస్త్రాలు, నగలు మొదలైన రాజస్థానీ సాంప్రదాయ వస్తువులను అమ్మే దుకాణాలతో వాళ్ళ సంస్కృతిని కళ్ళ ముందు ఉంచుతుంది. నత్మల్ హవేలి ప్రధాన వ్యాపార కూడలి. అప్పటి రాజాస్థానంలో ప్రధానమంత్రి అయిన నత్మల్ పేరు మీద ఆ హవేలీకి నత్మల్ హవేలి అనే పేరు వచ్చింది.
ఇందిరా గాంధీ ఔదార్యం
ఏడు అంతస్తులలో ఉండే ఆనాటి భవన సముదాయంలో 367 షాపులున్నాయి. అందులో రెండంతస్తులు స్థానికేతరులకు అమ్మకానికి పెట్టినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వాటిని కొని అక్కడి స్థానికులకు ఇచ్చారని, అందువల్ల ఇప్పుడు అక్కడ స్థానికులే ఉండగలుగుతున్నారని గైడ్ చెప్పాడు. ఆ భవనంలోకి ప్రవేశ రుసుము 52 రూపాయలు. అందులో మ్యూజియం కూడా ఉన్నది. ఆనాటి రాజులు వాడిన ఆయుధాలు, వస్త్రాలు, ఫర్నిచర్ అలంకరణ వస్తువులు, తూనిక రాళ్లు, సంగీత వాయిద్యాలతో పాటు ఆ భవన కళాకృతులు తీర్చిదిద్దిన పనిముట్లు కూడా ఉండడం ప్రత్యేకత.
వర్ణించలేని శిల్పకళా ప్రావీణ్యం
జైసల్మేర్ కోటను సంపూర్ణంగా, పరిశీలనాత్మకంగా తిరిగి చూడాలంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది. కోట లోపల మహారాజుకు, మహారాణికి వేరు వేరు భవనాలున్నాయి. ఏడు జైన మందిరాలు, లక్ష్మీనాథ్ ఆలయం, ఇతర హిందూ దేవాలయాలున్నాయి. ఇక అక్కడి శిల్పకళను వర్ణించడానికి భాష చాలదు. ఆ ప్రదేశంలో తిరగడం అంటే గత వైభవ ఆనవాళ్ళను జ్ఞప్తికి తెచ్చుకోవడమే.....
గడీసాగర్‌లో పడవ షికారు
చారిత్రాత్మకమైన గడీసాగర్ సరస్సులో సాయంకాలం పడవ షికారు ఒక మధురానుభూతి. దానికి సంబంధించి గైడ్ చెప్పిన కథలకు చారిత్రక ఆధారాలు లేవు. జైసల్మేర్‌ను నిర్మించినప్పుడే ఆ సరస్సు నిర్మాణం కూడా జరిగింది. అంటే అది ఒక కృత్రిమ సరస్సు. తరువాత 1367లో గాడ్సీసింగ్ భాటి దానిని పునర్నిర్మించాడు. అప్పటినుంచి దానికి గడీసాగర్ అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఆ సరస్సు నగరం మొత్తానికి నీటిని అందించేదని స్థానికులు చెప్పారు.
గిరిజ పైడి మర్రి
ట్రావెలర్
9949443414