Nightmares : తరచుగా పీడ కలలు వస్తున్నాయా..? ఏం జరుగుతుందో తెలుసా?
Nightmares : తరచుగా పీడ కలలు వస్తున్నాయా..? అవి దేనికి సంకేతమంటే..
దిశ, ఫీచర్స్ : ఆకాశంలో ఎగురుతున్నట్లు, అందమైన పార్కులో విహరిస్తున్నట్లు కలవస్తే ఎవరైనా ఆనందంగా ఫీలవుతారు. అదే ఎవరైనా చనిపోయినట్లు లేదా మీకు గానీ, మీ ప్రియమైన వారికి గానీ ఏదో ఆపద సంభవించినట్లు కలవస్తే.. ఆందోళన చెందుతారు. కొందరైతే ఏం జరుగుతుందోనని భయపడతారు. కలలు నిజం అవుతాయని నమ్మే వారైతే మరింత ఎక్కువగా ఆందోళన చెందుతారు. అయితే కలలు అనేవి ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. కాగా కొందరికి తరచుగా ఆందోళనకు, భయానికి గురిచేసే పీడకలలే వస్తుంటాయి. ఇలా రావడం అపశకునంగానో, రాబోయే ప్రమాద సంకేతంగానో నమ్ముతుంటారు. కానీ పీడకలలు రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఇక కలలో వచ్చింది లేదా తెల్లవారు జామున కలగన్నది నిజం అవుతుందని కొందరు నమ్ముతుంటారు. అయితే ఇది కేవలం అపోహ లేదా మూఢనమ్మకంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కలలు నిజం అవుతాయని నిరూపించగలిగే శాస్త్రీయ ఆధారాలేవీ ఇప్పటి వరకైతే లేవు. శాస్త్రవేత్తల ప్రకారం రోజువారీ జీవితంలో మనిషి ఎదుర్కొనే అనుభవాలు, జ్ఞాపకాలు వారి మెదడు మెమోరీలో నిక్షిప్తం అవుతుంటాయి.
ప్రశాంతంగా నిద్రించే సమయంలో బ్రెయిన్‌లోని రైట్ ఫ్రంటల్ లోబ్‌లో అనుభవాలు, జ్ఞాపకాల తాలూకు న్యూరోడీజనరేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ పరిస్థితివల్ల మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన లేదా భావోద్వేగానికి గురిచేసిన సంఘటనలు, సమస్యలు, జ్ఞాపకాలు వంటివి రీ ప్రాసెస్ పొందుతుంటాయి. దీంతో అవి మెదడు భాగాన్ని ప్రేరేపిస్తూ కలల రూపంలో వ్యక్తం అవుతాయని, పీడకలలు రావడానికి కూడా ఇదే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఏదైనా మానసిక సమస్య ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన రిస్క్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.
మానసిక ఒత్తిడి అధికమైనప్పుడు, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లేదా బైపోలార్ డిజార్డర్ వంటి రుగ్మతల బారిన పడినప్పుడు కూడా పీడకలలు వచ్చే చాన్సెస్ అధికంగా ఉంటాయి. ఎవరో వెంటాడుతున్నట్లు, సూసైడ్ చేసుకున్నట్లు, దెయ్యాలు తరుముతున్నట్లు, ఆత్మీయులు చనిపోయినట్లు కలలు వస్తుంటాయి. ఇలాంటి భయానక లేదా బాధను కలిగించే వాటినే ప్రజలు పీడకలలుగా పేర్కొంటారు. ఇవి సాధారణంగా రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM), అంటే నిద్ర దశలోనే సంభవిస్తాయి. వాటికిగల మరికొన్ని సైంటిఫిక్ రీజన్స్‌ను పరిశీలిద్దాం.
* బ్రెయిన్ యాక్టివిటీ: రాపిడ్ ఐ మూవ్‌మెంట్ అనే పరిస్థితి నిద్రలో ఉన్నప్పటికీ మెలకువగా ఉన్నట్లే మెదడు కార్యకలాపాలు పెరగడం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది భావోద్వేగాలు, జ్ఞాపకాలు, అనుభవాల ప్రాసెసింగ్ అండ్ ఏకీకరణకు దారితీస్తుంది. ఇదే పీడకలలు రూపంలో వ్యక్తం అవుతుంది.
* స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ : అధికస్థాయి ఒత్తిడి, ఆందోళనలు కూడా పీడకలలు రావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే మెదడు రాపిడ్ ఐ మూవ్‌మెంట్ నిద్రలో భావోద్వేగాలను ప్రాసెస్ చేసి వాటిని విడుదల చేస్తుంది. అలాగే మెమరీ కన్సాలిడేషన్ ప్రాసెస్ కూడా బాధాకరమైన అనుభవాలను, భావోద్వేగాలను ప్లే చేయడానికి దారితీస్తుంది.
* న్యూరో ట్రాన్స్‌మిటర్లు : సెరోటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ (norepinephrine) అండ్ ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లలో అసమతుల్యతకు దోహదం చేస్తుంది. ఈ కెమికల్స్ మానసిక స్థితి, భావోద్వేగాలు, నిద్రను నియంత్రిస్తాయి.
* స్లీప్ స్టేజ్ : పీడకలలు సాధారణంగా అర్ధరాత్రిపూట లేదా నిద్ర తీవ్రంగా ఉన్నప్పుడు సంభవిస్తాయి. జన్యుపరమైన కారణాలవల్ల కూడా కొందరికి పీడకలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
* స్లీప్ డిజార్డర్స్ : స్లీప్ అప్నియా, ఇన్‌సోమ్నియా(insomnia), రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి రుగ్మతలు పీడకలల ఫ్రీక్వెన్సీని పెంచుతాయి. అలాగే మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, యాంటీ డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు కూడా పీడకలలను ప్రేరేపిస్తాయి. గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమం లేదా రుతువిరతి సందర్భాలు కూడా మహిళల్లో పీడకలలకు కారణం అవుతాయి. నిద్రలేమి, నిరాశ, ఆందోళన వంటి మానసిక పరిస్థితులు, కెఫిన్, నికోటిన్, టొబాకో వంటి పదార్థాలు తీసుకోవడం, అధిక మద్యపానం వంటివి కూడా పీడకలల ఫ్రీక్వెన్సీని పెంచే అవకాశం ఎక్కువ.
పరిష్కారం ఏమిటి?
పీడకలలు తరచుగా వస్తుంటే మరింత ఆందోళనకు, భయానికి గురవుతుంటారు కొందరు. ఈ పరిస్థితిని నివారించాలంటే ముందు కలలు నిజం అవుతాయనే అపోహలను, అపశకునం అనే నమ్మకాలను తొలగించాలి. కలల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పాలి. దీంతో బాధితులు సగం రిలాక్స్ అవుతారు. అలాగే స్థిరమైన, నాణ్యమైన స్లీప్ షెడ్యూల్స్ పాటించడం, నిద్రకు ముందు స్క్రీన్లకు దూరంగా ఉండటం, వ్యాయామాలు, యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయడం వంటివి పీడకలలను నివారిస్తాయి. ఇవి కాకుండా మీరు ప్రత్యేకించి అంతర్లీన సమస్యలు ఏమైనా ఎదుర్కొంటుంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.