రాణి మరణంతో కోహినూర్‌పై చర్చ.. ఇండియాకు తేవాలని డిమాండ్
Netizens trend 'Kohinoor' on Twitter, ask India's jewel back after Queen Elizabeth II's demise
దిశ, ఫీచర్స్ : బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి, క్వీన్ ఎలిజబెత్ II మరణం ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని విషాదంలోకి నెట్టింది. ఇదే క్రమంలో కొన్ని పాత డిమాండ్లను కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఆమె మరణంతో ప్రస్తుతం చాలా మంది దేశీయ ట్విట్టర్ యూజర్లు భారత్‌కు చెందిన కోహినూర్ వజ్రాన్ని తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
105.6 క్యారెట్లతో కూడిన అద్భుతమైన కోహినూర్ వజ్రం 14వ శతాబ్దంలో భారత్‌లోని గోల్కొండ గనుల్లో కనుగొనబడింది. దీనిని 1849లో బ్రిటిష్ వారు ఇంగ్లండ్‌కు తీసుకెళ్లగా.. తిరిగివ్వాలని భారత్ నుంచి పంపిన అనేక అభ్యర్థనలను అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది. అయితే క్వీన్ ఎలిజబెత్ మరణాన్ని ప్రకటించిన వెంటనే ట్విట్టర్ యూజర్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే డిమాండ్లను ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు. మీమ్స్, కామెడీ పోస్ట్‌లతో హోరెత్తిస్తున్నారు. ఈ మేరకు 'ధూమ్ 2' చిత్రం నుంచి డైమండ్ రాబరీ సీన్‌ను షేర్ చేసిన ఒక యూజర్.. రిటర్న్ జర్నీలో కోహినూర్ డైమండ్‌ను ఇండియాకు తీసుకురమ్మంటూ పోస్టు చేశాడు.
ఇదిలా ఉంటే చాలా మంది వినియోగదారులు భారతదేశం సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి ట్రిలియన్ల విలువైన వస్తువులను దోచుకున్నందుకు బ్రిటన్‌ను, రాణిని విమర్శించారు. ఇక మహారాణి కిరీటంలో పొదిగిన 2,800 వజ్రాల్లో కోహినూర్ వజ్రం ఒకటి కాగా.. ప్రస్తుతం ఈ కిరీటాన్ని కింగ్ చార్లెస్ III భార్య క్వీన్ కెమిల్లాకు అందజేయనున్నారు.