పట్టణీకరణతో ప్రకృతికి నష్టం.. పరిశోధనలో తేలిన అసలు నిజాలు..!
ఎప్పటికప్పుడు పెరుగుతున్న పట్టణీకరణ జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యగా మారింది.
దిశ, ఫీచర్స్: ఎప్పటికప్పుడు పెరుగుతున్న పట్టణీకరణ జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యగా మారింది. ఈ పట్టణీకరణ అనేది నగరం యొక్క ప్రకృతి, జల దృశ్యాలను మార్చడమే కాకుండా పర్యావరణ క్షీణతకు కూడా ఓ కారణమని తాజా పరిశోధనలో తేలింది. ఖడక్‌వల్సా అండ్ బండ్ గార్డెన్ మధ్య ఉన్న ముథా నది పొడువునా (22 కి.మీ విస్తీర్ణంలో) వృక్ష వైవిధ్యంపై పరిశోధకులు సర్వే నిర్వహించారు. ఇందులో 243 వక్ష జాతులను కనుకొన్నారు. అయితే.. 1958వ సంవత్సరంలో జరిపిన ఇదే సర్వేలో విఠల్‌వాడి అండ్ ఎరవాడ మధ్య నది పొడవునా (12 కి.మీ విస్తీర్ణంలో) కనీసం 400 వృక్ష జాతులు ఉన్నట్లు నమోదు చేయబడ్డాయి.
అంటే ఇప్పుడు చేసిన సర్వే ఆధారంగా చూసుకున్నట్లయితే.. గత 66 ఏళ్లలో ముథా నది ఒడ్డు 200లకు పైగా వృక్ష జాతులను కోల్పోయిందని.. వాడిటో ఎక్కువ భాగం దేశీయ మొక్కలేనని సర్వే అధ్యయనాలు తెలిపాయి. వీటిలో నజాడేసి, మొలుజినేసి, కాంపానులేసి, జెంటియానేసి, నైక్టాజినేసి, చెనోపోడియాసి, ఆర్కిడేసి, అమరిల్లిడేసి వంటి కుటుంబాలకు చెందిన అనేక వృక్ష జాతులు అదృశ్యమైనట్లు వెల్లడైంది. అంతే కాకుండా.. ఈ పట్టణీ కరణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నదులు, జలాశయాలపై కూడా ఇలాంటి ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
దీనిపై పరిశోధకులు ఉమా కలంకర్ మాట్లాడుతూ.. ‘నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణ జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యగా మారింది. మైక్రోహాబిటాట్ నష్టం, ఫ్రాగ్మెంటేషన్, క్షీణత, నివాస పరివర్తన, డంపింగ్, మురుగు కాలుష్యం ఈ పట్టణ పర్యావరణ క్షీణతకు ప్రధాన సూచికలు. ఇటీవల కాలంలో పూణె నగరాని సంబంధించిన నదుల్లో అనేక మార్పులు ఏర్పడ్డాయి. వరద మైదానంలో నిర్మాణాలు, నదుల కాలువలీకరణ, శిధిలాలను డంపింగ్ చేయడం, వాటిని శుద్ధి చేయకుండా మురుగునీటిని విడుదల చేయడం వంటివి జరిగాయి. ఇవి సహజమైన నదీ నీటి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాగే మైక్రోహాబిటాట్‌లను చాలా వరకు నాశనం చేస్తాయి’ అని ఆయన తెలిపారు.
ముథానది వద్ద మొక్కలను పెంపొందించేందుకు సూచనలు..
* చెట్లు నరికివేత, చెత్త డంపింగ్, నిర్మాణ శిధిలాల డంపింగ్ వంటివి జరగకుండా మనుషులను కంట్రోల్ చేయాలి.
* సహజ పునరుత్పత్తిని సులభతరం చేయడానికి, మైక్రోహాబిటాట్ వైవిధ్యాన్ని నిర్వహించడానికి రివర్ ఫ్రంట్ యొక్క పర్యావరణ ప్రణాళికను సిద్ధం చేయాలి.
* నది పొడవునా మురుగునీటిని శుద్ధి చేసే కేంద్రాల ఏర్పాటు చేయాలి. నదీతీర సూక్ష్మజీవులను నాశనం చేసే సిమెంట్ పదార్థాల వాడకాన్ని నివారించాలి.
* స్థానిక చెట్లు, గడ్డి, చిత్తడి నేల మొక్కల జాతులు వంటి వృక్షసంపదను అభివృద్ధి చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
* అప్ స్ట్రీమ్ అటవీ విస్తీర్ణాన్ని పరిరక్షించడం దిగువ ప్రాంతాలలో వృక్షసంపదను సంరక్షించడానికి సహాయపడుతుంది.