మండే ఎండల్లో పసిపిల్లల విషయంలో తల్లులు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
వేసవి కాలం వచ్చేసింది. దీంతో ఎండలు బాగా మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
దిశ, ఫీచర్స్: వేసవి కాలం వచ్చేసింది. దీంతో ఎండలు బాగా మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో చాలా మందికి అప్పుడే డిహైడ్రేషన్ సమస్య మొదలైపోయింది. అయితే మండే ఎండలకు పెద్దలు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇక పసిపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తల్లులు చిన్నారుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వారు వేసవి మొత్తం పలు ఇబ్బందులు ఎదుర్కోవడం తో పాటు ఆసుపత్రి పాలవడం జరుగుతుంది. కాబట్టి ఎండాకాలం పోయేవరకు తల్లులు పసి పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం బిడ్డకు మంచిదని నిపుణులు సలహాలిస్తున్నారు.
*ఎండ వేడి వల్ల చెమటలు ఎక్కువగా వచ్చి పిల్లలకు చెమటకాయలు అవుతాయి. ఛాతి, మెడ, వీపు భాగాలపై అవడంతో పిల్లలు తమ బాధను చెప్పుకోలేక పదే పదే ఏడుస్తుంటారు. కాబట్టి పిల్లలకు చెమటకాయలు కాకుండా ఎప్పటికప్పుడు స్నానం చేయిస్తూ శుభ్రంగా ఉంచాలి. స్నానం చేయించేటప్పుడు నీటిలో వేపనూనె వేస్తే శరీరంపై ఉండే క్రీములు నాశనమై అలర్జీలు రాకుండా ఉంటాయి. అలాగే ఎండలు తగ్గే వరకు కాటన్ క్లాతులను మాత్రమే వాడాలి. పిల్లలకు కాటన్ దుస్తులు వేయడం వల్ల అవి చెమటను పీల్చుకొని చెమటకాయలు కాకుండా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.
* ఈ ఎండలకు చాలా మంది శరీరం డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంది. దీంతో వైద్యులు నీరు ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. నీరు పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా అవసరం. కాబట్టి తల్లులు పదే పదే నీరు లేదా పాలు పట్టిస్తూ ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్‌కు గురై బిడ్డ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కోసారి కదలకుండా అలాగే ఉండిపోతారు. తల్లులు వారి చుట్టుపక్కలే ఉంటూ గమనిస్తూ ఉండాలి. అయితే కొందరు వేడికి పిల్లలను ఏసీ గదుల్లో పడుకోబెట్టి ఇతర పనులు చేసుకుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
*కొందరు ఎండను పట్టించుకోకుండా పసిపిల్లలకు టవల్ కప్పుకొని మరీ ప్రయాణాలు చేస్తుంటారు. ఎండాకాలం పూర్తిగా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. అలాగే తల్లులు బయట కనిపించే జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్, పుల్లఐస్ వంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీంతో బిడ్డకు కూడా అవి సోకడంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలా కాకుండా ఉండాలంటే కేవలం కొబ్బరి బొండాలు మాత్రమే తాగడం మంచిది.
* ఎండాకాలం పోయేదాక పిల్లలకు వేడి చేసేవి తినకుండా ఆహారం తీసుకునే విషయంలోనూ తల్లులు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.