తీవ్రమైన తలనొప్పి వేధిస్తోందా?.. బ్రెయిన్ ట్యూమర్ కూడా కావచ్చు !
ముందస్తుగా గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారే అరుదైన ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఉన్నాయని న్యూరో ఇంటర్వెన్షనల్ నిపుణులు అంటున్నారు.
దిశ, ఫీచర్స్: ముందస్తుగా గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారే అరుదైన ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఉన్నాయని న్యూరో ఇంటర్వెన్షనల్ నిపుణులు అంటున్నారు. మెదడులో ఏర్పడిన కణితి పరిమాణం, దాని స్థానం, ఇతర అవయవాలపై పడే ప్రభావాన్ని బట్టి నివారణ పద్ధతులు, మెడికేషన్స్, ట్రీట్మెంట్ వంటివి ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతం యువతలో కూడా మెదడు కణుతుల సమస్యలు తలెత్తుతున్నాయని పలు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. లక్షణాలను ముందస్తుగా గుర్తించడంవల్ల మెరుగైన చికిత్స అందించడం సాధ్యం అవుతుందని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని నిపుణులు సూచిస్తున్నారు.
సింప్టమ్స్-ట్రీట్మెంట్
మెదడు కణితులు ఏర్పడిన వ్యక్తుల్లో తరచుగా తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, దృష్టిలో మార్పులు వంటివి కనిపిస్తాయి. అకస్మాత్తుగా కండరాలు పట్టేయడం, స్పృహ కోల్పోవడం, కదలికల్లో ఇబ్బంది. అప్పుడప్పుడూ మాటలు తడబడటం, మూర్ఛలు రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతోపాటు శరీరం బ్యాలెన్స తప్పడం, నడకలో మార్పు, కాళ్లు చేతులు తిమ్మిరి పట్టడం, జ్ఞాపశక్తి బాగా తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం, చిరాకు, మానసిక కల్లోలం, ప్రవర్తనలో అస్థిరత్వం వంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. అయితే ఇతర అనారోగ్యాలవల్ల కూడా కొన్ని సందర్భా్ల్లో అరుదుగా ఇటువంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపించగానే అవి బ్రెయిన్ ట్యూమర్ వల్ల అయి ఉంటుందని ఫిక్స్ అవ్వకూడదు. ఇతర కారణాలవల్ల, మెదడు కణుతులవల్ల ఏర్పడే లక్షణాల్లో కొంతైనా తేడా ఉంటుంది.
బ్రెయిన్ ట్యూమర్‌వల్ల తలెత్తే సమస్యలు తీవ్రంగా ఉండటంతోపాటు అవి క్రమంగా పెరుగుతుంటాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్ధారణ పరీక్షల ద్వారానే నివృత్తి చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుస్తుగా గుర్తించడంవల్ల మందుల ద్వారా తగ్గే అవకాశాలు ఉంటాయి. చూద్దాం లే అనుకుంటూ సమస్య తీవ్రమయ్యే వరకు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. ఆలస్యం కారణంగా చికిత్స కూడా రిస్కుతో కూడి ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు. కొన్ని మెదడు కణితులు వంశపారంపర్యంగా జన్యుసంబంధిత అంశాలతో ముడిపడి ఉంటాయి. అందుకే ఆయా వ్యక్తుల్లో ఏర్పడే బ్రెయిన్ ట్యూమర్స్ ఏ కోవకు చెందినవో తెలుసుకునేందుకు వేర్వేరు నిర్ధారణ పరీక్షలు, వేర్వేరు చికిత్సలు ఉంటాయిన వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వైట్ పాయిజన్.. లిస్ట్‌లో రిఫైన్డ్ షుగర్, సాల్ట్, బియ్యం, పిండి