ఇంట్లోనే హోలీ రంగుల తయారీ.. ఎలాగో చూడండి..

హోలీ పండుగ రంగులు లేకుండా అసంపూర్తిగా ఉంటుంది.

Update: 2024-03-21 15:16 GMT

దిశ, ఫీచర్స్ : హోలీ పండుగ రంగులు లేకుండా అసంపూర్తిగా ఉంటుంది. కానీ మార్కెట్‌లో లభించే రంగులలో ఉండే రసాయనాలు చర్మం, జుట్టుకు హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఈ రసాయన రంగుల ద్వారా చర్మం ఎరుపు బటడం, దురద, వాపు, చర్మం సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాక చర్మం పొడిబారడం, జుట్టు పొడిబారటం వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే హోలీ ఆడుతూ చర్మాన్ని, జుట్టును కాపాడుకోవాలంటే సహజసిద్ధమైన రంగులతో హోలీ ఆడడం మంచిదంటున్నారు నిపుణులు.

సహజంగా హోలీ రంగులను పూలు, కూరగాయలతో ఇంట్లో నుంచే తయారు చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ఎలాంటి హాని కలగదు. అలాగే రంగులను శుభ్రం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో రంగులు ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గులాబీ పువ్వు నుండి..

పొడి గులాబీ రేకులను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీని తర్వాత రోజ్ ఫ్లవర్ పేస్ట్, గంధం, పొడి పిండిని ఒక గిన్నెలో బాగా కలపాలి. పింక్ కలర్ హోలీ ఆడటానికి సిద్ధంగా ఉంది.

పసుపు నుండి..

పసుపు చర్మానికి మేలు చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ హోలీ రోజున చర్మాన్ని సంరక్షించుకోవడానికి దాని నుండి రంగును ఎందుకు తయారు చేయకూడదు. దీని కోసం పసుపు కొమ్మును తీసుకుని అందులో శనగపిండిని కలపండి. ఈ విధంగా పసుపు రంగును తయారు చేసుకోవచ్చు.

బచ్చలికూర నుంచి ఆకుపచ్చ రంగు..

హోలీ ఆడుకోవడానికి గ్రీన్ కలర్ చేసుకోవాలంటే ఎండు బచ్చలికూర, కొత్తిమీర తరుగు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. కావాలంటే వేప ఆకులను కూడా వాడుకోవచ్చు. ఇలా ఆర్గానిక్ గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు.

నారింజ రంగు..

ఇంట్లోనే ఆరెంజ్ కలర్ చేయడానికి ఎండిన బంతి పువ్వులను మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. కావాలంటే ఆరెంజ్ తొక్కలను ఎండలో ఆరబెట్టి గ్రైండ్ చేసి కూడా ఆరెంజ్ కలర్ చేసుకోవచ్చు.

బీట్రూట్ నుండి ఎరుపు రంగు..

చాలా మందికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే రెడ్ కలర్ తయారు చేసుకోవాలంటే బీట్ రూట్ ను బాగా కడిగి ఆరిన తర్వాత గ్రైండ్ చేసి కలర్ తయారు చేసుకోవచ్చు.

Tags:    

Similar News