కండరపుష్టిని పెంచే మితమైన డంబుల్ వర్క్‌వుట్!
దిశ, ఫీచర్స్ : వ్యాయామమే 'సకల రోగ నివారిణి' అని వైద్యులు తరుచుగా చెబుతుంటారు. చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌తోపాటు వాకింగ్ చేయడం వలన అనారోగ్యం దరిచేరదని నిపుణులు సూచిస్తుంటారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : వ్యాయామమే 'సకల రోగ నివారిణి' అని వైద్యులు తరుచుగా చెబుతుంటారు. చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌తోపాటు వాకింగ్ చేయడం వలన అనారోగ్యం దరిచేరదని నిపుణులు సూచిస్తుంటారు. అయినా సరే బిజీ షెడ్యూల్స్‌తో చాలా మంది వర్క్‌వుట్‌కు దూరంగా ఉంటుండగా.. కాస్త టైమ్‌లోనే చేసే డంబెల్ వర్క్‌వుట్ కండరాల బలాన్ని గణనీయంగా పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
క్రమం తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగానే కాక మానసికంగానూ ప్రయోజనకరంగా ఉంటుందని తెలిసిన విషయమే. అయితే తీరికలేని జీవితాల్లో కేవలం ఐదు నుంచి పది నిమిషాల పాటు డంబుల్ వర్క్‌వుట్ చేసినా మెరుగైన కండర ద్రవ్యరాశి సొంతమవుతుందని ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాయామాలు చాలా విలువైనవిగా ఉంటాయనే ఆలోచనను ఈ అధ్యయనం నొక్కి చెబుతుండగా.. కొత్త పరిశోధన ఆసక్తికరమైన అంతర్దృష్టులను అందించింది.
నిజానికి చాలామంది వర్క్‌వుట్స్ విషయంలో సందిగ్ధత వ్యక్తం చేస్తుంటారు. ఈ మేరకు ప్రతిరోజూ కొంచెం వ్యాయామం చేయాలా? లేదా వీకెండ్స్‌లో సుదీర్ఘమైన, శక్తివంతమైన వ్యాయామం చేయడం మంచిదా? అని సందేహపడుతుంటారు. అయితే బల్క్ అప్ చేయడమే లక్ష్యమైతే, వారం మొత్తం డంబుల్ వర్కవుట్ మంచి విధానమని వెల్లడించింది సరికొత్త అధ్యయనం. ఇందుకోసం వాలంటీర్లను మూడు గ్రూపులుగా విభజించి భిన్నస్థాయిలో డంబుల్ వర్క్‌వుట్స్ చేయించారు. ఇందులో ఒక గ్రూప్ వారానికి ఒక్క రోజు మాత్రమే ఆరు డంబుల్ వర్క్‌వుట్స్ చేసింది. మరొక గ్రూప్ వారానికి ఐదు రోజుల పాటు రోజుకు ఆరు డంబుల్ వర్క్‌వుట్స్ ప్రదర్శించింది. చివరి గ్రూప్ ఒకే రోజులో 30 డంబుల్ వర్క్‌వుట్ చేసింది. మొత్తంగా నాలుగు వారాల వ్యవధి తర్వాత, వారానికి ఒకసారి ఆరు వర్క్‌వుట్స్ మాత్రమే చేసే సమూహంలోని వ్యక్తుల కండరాల బలం పెరుగుదలను ప్రదర్శించలేదు. ఒకే రోజులో 30 చేసిన సమూహ కండరాల బలం పెరగలేదు, కానీ మజిల్ థిక్‌నెస్ 5.8% పెరిగింది. వారానికి ఐదు సార్లు రోజుకు ఆరు మాత్రమే చేసిన సమూహం మజిల్ థిక్‌నెస్‌లోనూ అదే విధమైన పెరుగుదలను చూసింది. కండరబలంలో గణనీయంగా 10% పెరుగుదల ఉందని నిర్ధారించారు పరిశోధకులు.
'జిమ్‌లో ప్రతీ వ్యాయామాన్ని సుదీర్ఘ సెషన్ చేయాలని ప్రజలు అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు. రోజుకు ఒకసారి లేదా ఆరు సార్లు భారీ డంబెల్ వర్క్‌వుట్ చేయడం సరిపోతుంది. అంతేకాదు వారానికి ఒకసారి వ్యాయామం చేసేందుకు గంటలు గంటలు గడపడం కంటే, ప్రతిరోజూ తక్కువ మొత్తంలో వ్యాయామం చేయడం వల్ల సానుకూల ఫలితం లభిస్తుందని మా అధ్యయనం తెలియజేస్తుంది. ఇలా చేయడం వల్లే ప్రతి కండరాల బలం గణించబడుతుందని మనం తెలుసుకోవాలి. మీరు వాటిని ఎంత క్రమం తప్పకుండా నిర్వహిస్తారనే దానిపైనే ఇది ఆధారపడుతుంది' అని అధ్యయన రచయిత ప్రొఫెసర్ కెన్ నోసాకా పేర్కొన్నారు.