ఆనందాన్ని ఆస్వాదిద్దాం.. మార్పును స్వాగతిద్దాం!!
నూతన సంవత్సరం.. సరికొత్త ఆలోచనలకు ఊపిరిపోస్తుంది. గత అనుభవ పాఠాల నుంచి అందమైన భవిష్యత్తును స్వాగతించాలని సూచిస్తుంది..
దిశ, ఫీచర్స్: నూతన సంవత్సరం.. సరికొత్త ఆలోచనలకు ఊపిరిపోస్తుంది. గత అనుభవ పాఠాల నుంచి అందమైన భవిష్యత్తును స్వాగతించాలని సూచిస్తుంది. నిరాశను వదిలేసి ఆశతో ముందుకు సాగమని.. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుని సరైన దారిలో నడవమని మార్గం చూపిస్తుంది. కొంగొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకుని.. దాన్ని సాధించే దిశగా అడుగులేయాలని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే 2022 ఇచ్చిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. 2023లోకి అడుగుపెడుతున్న ప్రతీ ఒక్కరికీ 'హ్యాపీ న్యూ ఇయర్' విషెస్ అందిస్తోంది దిశ. నూతనోత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది.
న్యూ ఇయర్‌లోకి అడుగు పెట్టే క్రమంలో డిసెంబర్ 31 రోజు ఏం చేయాలని అనుకుంటున్నారు? జనవరి ఫస్ట్ రోజున ఎలా గడపాలని భావిస్తున్నారు? అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేద్దామా? ముందుగా ఎవరికి విష్ చేద్దాం? ఈ ఏడాది లైఫ్‌లో స్పెషల్‌గా మారిన వ్యక్తి ఎవరు? వీడియో కాల్స్ చేద్దామా? ఫ్రెండ్స్‌తో కలిసి బయట తిరిగేద్దామా? ఇలాంటి ప్రశ్నలకు సమాధనం ఇప్పటికే మీ మైండ్‌లో ఫిక్సయి ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేయాలన్న ఎగ్జయిట్మెంట్ ఇప్పటికే మీలో హుషారెత్తిస్తుంటుంది. గతంలో జరిగిందేదో జరిగింది. ఈ సంవత్సరం మాత్రం ఫుల్ టు బిందాస్ ఎంజాయ్ చేయాలని, మనతో పాటు అందరూ బాగుండాలని కోరుకునేవాళ్లే అందరూ.
ఇలా గడిపేద్దాం..
న్యూ ఇయర్‌లో మొదటి రోజు ఎలా గడిస్తే ఆ ఏడాదంతా అలాగే ఉంటుందని అనుకునేవారు లేకపోలేదు. అందుకే ఫస్ట్ రోజు తాము సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. జనవరి ఫస్ట్ ఉదయం ఎన్ని గంటలకు లేవాలి? ఎంత సేపు చదవాలి? ఎన్ని గంటలకు జిమ్‌కు వెళ్లాలి? వాకింగ్ ఎంత సేపు చేయాలి? ఫ్రెండ్స్‌తో, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలి? అనేది నిర్ణయించుకుని 2023కు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు చాలామంది.
'మొదటి రోజే లేటుగా లేశామంటే.. ఇక ఆ సంవత్సరమంతా బద్దకస్తులుగా మారతామేమో అందుకే అలాంటి పనిమాత్రం చేయను' అంటున్నాడు డిగ్రీ చదువుతున్న భరత్ కుమార్. సొంత ఆలోచనకు పదును పెట్టి, జీవితాన్ని ఆనందమయం చేసే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాడు. ముఖ్యంగా న్యూ ఇయర్ రోజు ఎటువంటి తప్పులు, పొరపాట్లకు, తప్పుడు ఆలోచనలకు అవకాశం ఇవ్వొద్దనే నిర్ణయంతో ఉన్నట్లు తెలిపాడు.
వీటికి దూరంగా..
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలను ఆ రోజు దూరం పెట్టండి. అటువంటి కార్యక్రమాలను రద్దు చేసుకోండి. మీ మనసును బాధించే జ్ఞాపకాలను గుర్తుచేసుకోవద్దు. మీ మీద మీరు నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో ఉండాలి. మీకు నచ్చిన విధంగా ఆనందంగా గడపాలి. ఆ రోజును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంజాయ్ చేయాలి.
సోషల్ మీడియాతో జాగ్రత్త
న్యూ ఇయర్ సందర్భంగా మీరు ఇతరులకు విషెస్ చెప్తూనే పోస్టులు పెడితే పర్లేదు. కానీ ఆరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పోస్టులు ఎవరైనా పెట్టే అవకాశం ఉందేమో ఆలోచించుకోండి. సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు మిమ్మల్ని నిరాశకు గురి చేయవచ్చు. కాబట్టి అవసరమైతేనే తప్ప ఆ రోజు సోషల్ మీడియా లోతుల్లోకి వెళ్లి వెతక్కండి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అక్కడ మీ మూడ్ ఆఫ్ చేసే పోస్టు ఏదైనా ఉంటే మనసు కలత చెందుతుంది. కొత్త సంవత్సరం రోజు బాధ పడటం, అదే తలుచుకుని మనసు కలత చెందడంతో డిప్రెషన్‌కు గురయ్యే చాన్స్ ఉందంటున్నారు.
ఉన్నతంగా రాణించేందుకు అడుగులు పడాలి..
డిసెంబర్ 31, లేదా జనవరి ఫస్ట్‌న బోరింగ్ లైఫ్ గడపడం అస్సలు ఇష్టం ఉండదు అంటున్నారు యువతీ యువకులు. విద్యార్థులైతే చదువులో మరింత రాణించేందుకు ఆసక్తి చూపుతామంటున్నారు. ఉద్యోగులైతే తమ వృత్తిలో మరింత మెరుగుదల దిశగా అడుగేస్తామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా తమ తమ ప్రొఫెషన్ల గురించి, ఫైనాన్షియల్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకునే పనిలో అందరూ బిజీ అయిపోయారు.
విషెస్ చెప్పండిలా..
ఒకప్పుడు న్యూ ఇయర్‌కు వారం రోజుల ముందే శుభాకాంక్షలు చెప్తూ లెటర్లు రాసేవాళ్లమని పలువురు పెద్ద మనుషుల నోట తరచూ వింటుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉండగా లేఖలు రాసేందుకు ఈ జనరేషన్ ఇష్టపడటం లేదని రిటైర్ ఉద్యోగి వెంకట రమణ చెప్తున్నారు. నిజమే మరి! ఈతరం స్టయిలే వేరు. ఆ రోజుల్లో మాదిరి ఉత్తరాలు రాయడం, పుష్ప గుచ్ఛాలు ఇవ్వడం జాన్తానై అంటోంది యూత్. 'అందమైన డిజైన్‌ను క్రియేట్ చేసి వాట్సాప్‌లో విషెస్ చెప్పేస్తాం. లేదంటే తమ స్టయిల్‌లో మెసేజ్ పంపుతాం' అని కొందరంటుంటే.. వీడియో కాల్ చేసి శుభాకాంక్షలు తెలుపుకోవడంలోనే అసలైన మజా ఉందంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా నయాసాల్ మస్త్ జోష్ అంటూ హాప్పీగా సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ రెడీ అవుతున్నారు.
న్యూ ఇయర్ వేళ.. ఇలా చేద్దాం!!
* 31 ఫస్ట్ నైట్ లేదా న్యూ ఇయర్ రోజుఅపసవ్య ఆలోచనలకు స్వస్తి చెప్పండి.
* అతి ఆలోచనలకు తావివ్వకూడదు. మైండ్ ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోండి.
* టైమ్ వేస్ట్ చేయవద్దు.
* మీ పట్ల ఎవరైనా అయిష్టత ప్రకటించినా పట్టించుకోకండి.
* ప్రేమను, ఆనందాన్ని ఆస్వాదించే క్షణాలను వదులుకోకండి.
* మీ ఆరోగ్యంపట్ల శ్రద్ధగా ఉండండి.
* స్నేహితులు, పేరెంట్స్, ఆత్మీయులతో సంతోషంగా మాట్లాడండి. రెట్టింపు ఉత్సాహంతో విషెస్ చెప్పండి.
l