ప్రాణాంతకంగా మారుతున్న నోటి క్యాన్సర్.. ఎందుకు వస్తుంది?.. ఎలా నివారించాలి?

క్యాన్సర్లు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కలిగిన వ్యాధుల్లో ఇవి ప్రముఖంగా ఉంటున్నాయి. కొలన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ప్రొస్టేట్, బ్రెయిన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్.. ఇలా పలు రకాల క్యాన్సర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.

Update: 2024-04-03 08:36 GMT

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్లు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కలిగిన వ్యాధుల్లో ఇవి ప్రముఖంగా ఉంటున్నాయి. కొలన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ప్రొస్టేట్, బ్రెయిన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్.. ఇలా పలు రకాల క్యాన్సర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. మారుతున్న జీవన శైలి, పర్యావరణ ప్రభావాలు, ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ వ్యాధులు రావడానికి కారణం అవుతున్నాయి. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నాయి.

ఏటా 77 వేల కొత్త కేసులు

అధికారిక లెక్కల ప్రకారం భారత దేశంలో సంభవిస్తున్న మొత్తం క్యాన్సర్లలో 30% వరకు నోటి క్యాన్సర్లే ఉంటున్నాయి. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే ఓరల్ క్యాన్సర్లలో భారత్ రెండవస్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం ఇండియాలో 77 వేల కొత్త నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 51 వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్లన్నింటిలో నోటి క్యాన్సర్‌ను చాలా సెన్సిటివ్ అంశంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఎందుకంటే చాలా మంది దీనిని వచ్చే దాకా గుర్తించడం లేదు. వచ్చాక కూడా లక్షణాల గురించి తెలియక ఏదో ఇతర ఇన్ఫెక్షన్లు అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. తీరా వ్యాధి ముదిరిపోయాక ప్రాణాంతకంగా మారే అవకాశాలు పెరుగుతున్నాయి.

ఎందుకు వస్తుంది?

నోటి క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలలో పొగాకు గుట్కా, పొగాకు వంటివి నమలడం, సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం, దీర్ఘకాలంపాటు నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఉంటున్నాయి. ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) శరీరంలో నోటి క్యాన్సర్‌కు కారణం అవుతుంది. ఇది డెవలప్ అవుతున్నప్పుడు కణ విభజన అదుపు తప్పి తీవ్రమైన క్యాన్సర్‌గా మారుతుంది. డబ్ల్యుహెచ్‌ఓ రిపోర్ట్ ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు.

లక్షణాలు

ఓరల్ లేదా నోటి క్యాన్సర్ వచ్చే ముందు నోటి లోపలి భాగంలో తెల్లటి మచ్చలు కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా దంతాలు వదులుగా అనిపించడం, నోటి లోపల గడ్డలు అవ్వడం, చిగుళ్లలో వాపు, చెవుల్లో నొప్పి, దవడ భాగంలో వాపు, పుండ్లు, స్వరంలో మార్పులు వంటివి నోటి క్యాన్సర్ ఎర్లీ సింప్టమ్స్‌గా నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితివల్ల బాధితుల్లో నమలడం, మింగడం, మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది.

ఎలా నివారించాలి?

నోటి క్యాన్సర్‌ రావడానికి గల ప్రధాన కారణాల్లో గుట్కాలు, పొగాకు ఉత్పత్తులే ఉంటున్నాయి. కాబట్టి వాటిని వాడకూడదు. ఆరోగ్య కరమైన జీవనశైలి అలవర్చుకోవడంతోపాటు హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. నోటి పరిశుభ్రతలో భాగంగా డైలీ రెండు సార్లు ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం బెటర్. అలాగే గ్రీన్ వెజిటేబుల్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. ఇక నోటిలో తెల్లటి మచ్చలు, నొప్పి, దవడల్లో వాపు వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. క్యాన్సర్లు ప్రాణాంతకంగా మారడానికి గల ముఖ్య కారణం వాటిని త్వరగా గుర్తించకపోవడమే. రెగ్యులర్ చెకప్‌లో ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చు.


Similar News