వర్షాకాలంలో ఇమ్యూనిటీ బూస్టింగ్.. వీటిని ఆహారంగా, పానీయాలుగా తీసుకుంటే సీజనల్ రోగాలు పరార్!

మిగతా సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో దోమల పెరుగుదల, రోగాల వ్యాప్తి ఎక్కువ. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ప్రజలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

Update: 2024-07-01 13:14 GMT

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో దోమల పెరుగుదల, రోగాల వ్యాప్తి ఎక్కువ. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ప్రజలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సందర్భంలో వైద్య నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. అలాగే మనం ఇంట్లో పాటించే కొన్ని చిట్కాలు, తీసుకునే ఆహారాలు కూడా ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పర్చి సీజనల్ వ్యాధుల బారిన పడకుంటా చేస్తాయి. అవేమిటో చూద్దాం.

పసుపు‌

భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా కనిపించే వాటిలో పసుపు (Turmeric) ఒకటి. ఇందులో పోషక గుణాలు ఫుల్లుగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల గాయాలు, నొప్పి వంటివి త్వరగా తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టింగ్ గుణాలు కలిగి ఉండటంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పసుపులో ఉండే బయోయాక్టివ్ కెమికల్ పదార్థంగా పేర్కొనే ‘కర్కుమిన్’ హెల్త్‌కి చాలా మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

జీలకర్ర, మిరియాలు

మన ఇండ్లల్లోనే తరచుగా వాడే మరో ఔషధాల గని జీలకర్ర. ఇందులో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మెటబాలిజం పనితీరును మెరుగు పర్చడంలో జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. అందుకు అవసరమైన ఎంజైములను రిలీజ్ చేస్తుంది. లివర్ నుంచి రిలీజ్ అయ్యే పైత్య రసాలను నియంత్రిస్తుంది. ఇక పోతే మిరియాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటంవల్ల వంటకాల్లో, వివిధ ఆహారాల్లో భాగంగా వర్షాకాలంలో వీటిని సాధారణ సీజన్లకంటే కాస్త ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చిన్న పేగుల్లో పేరుకుపోయిన కలుషిత పదార్థాలు క్లీన్ అవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, నొప్పి నివారణ గుణాలు ఉండటంవల్ల ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతాయి.

సోంపు, ఇంగువ

అత్యంత సహజంగా భారతీయ కుటుంబాల్లో వాడే సుగంధ ద్రవ్యాల్లో సోంపు, ఇంగువ కూడా ఉంటాయి. చాలా మంది భోజనం తర్వాత సోంపు తింటుంటారు. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సోంపులోని యాక్టివేటెడ్ కెమికల్స్ మెటబాలిజం పనితీరును మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరాన్ని, మంటను, అజీర్తిని దూరం చేస్తాయి. ఇక ఇంగువ విషయానికి వస్తే ఇది వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు ఔషధంగానూ పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉండటంవల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

అల్లం, కొత్తిమీర

సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనానికి, వాంతులు, విరేచనాలు తగ్గించడంలో అల్లం, కొత్తిమీర కీలకంగా పనిచేస్తాయి. జలుబు వల్ల కలిగే గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి వంటి తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పైగా వీటిని ఆయుర్వేదిక్ నిపుణులు కూడా నేచురల్ కఫం నివారణ ఔషధంగా పరిగణిస్తారు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే విష పదార్థాలు బయటకు పోవడంలో అల్లం సహాయపడుతుంది. ఇక కొత్తి మీర గురించి చెప్పుకుంటే ఇది అత్యంత సహజంగా వాడే ఆకు కూర. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని బయోయాక్టివ్ కెమికల్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. కాబట్టి ఆహారంలో భాగంగా తరచుగా తీసుకోవాలి. 

Similar News