Beetroot: ఎక్కువగా బీట్ రూట్ తింటున్నారా..? ఈ సమస్యలు వచ్చే చాన్స్!
చాలామంది శరీరంలో రక్తం కోసం, ఐరన్ లోపంను తగ్గించుకోవడానికి బీట్ రూట్ తింటారు.
దిశ, ఫీచర్స్: చాలామంది శరీరంలో రక్తం కోసం, ఐరన్ లోపంను తగ్గించుకోవడానికి బీట్ రూట్ తింటారు. ఇది బీట్ రూట్ అనేది రక్తహీనత ఉన్న వారికి మేలు చేస్తుంది. ప్రతి రోజూ దీనిని జ్యూస్ చేసుకుని తాగితే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచడంలో సహాయపడుతుంది. అయితే, దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నా సరే, అతిగా దీనిని తినడం లేదా తాగడం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బీట్ రూట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికి తెలుసు. కానీ, అతిగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో నైట్రేట్ అధిక మొత్తంలో ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కొంతమందికి ఈ జ్యూస్ తాగిన తరువాత కడుపులో నొప్పి కూడా వస్తుంది. గర్భిణీ స్త్రీలు బీట్ రూట్‌ని వైద్యల సలహా తీసుకుని తినడం మంచిది.
కిడ్నీ సమస్య: బీట్ రూట్లో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఉన్న వారిపై బీట్ రూట్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యల ఉన్నా లేదా అప్పటికే సమస్యతో బాధపడుతున్నవారు అయినా వీటిని తినడం వల్ల ఆ రాళ్లు మరింత ఎక్కువ అవుతాయి. ఇది మూత్రంలో ఆక్సలేట్ విసర్జనను పెంచుతుంది.
అలెర్జీ: అలెర్జీ సమస్యలు ఉన్న వారు బీట్ రూట్ తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మంపై దురద, గొంతు సమస్య, వాపు వంటి సమస్యలు వస్తాయి. దుంపలు తింటే అలర్జీ వచ్చే వాళ్లు దీనిని తినకపోవడమే మంచిది.
జీర్ణసమస్య: చాలామంది దీనిని కూరలు, సలాడ్‌లో కాకుండా జ్యూస్‌గా తీసుకుంటారు. దీని వల్ల ఆరోగ్యం బాగుందని అనుకుంటారు. కానీ, జీర్ణసమస్యలు ఉన్న వారు ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపులో నొప్పి, డయేరియా, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే చాన్స్ ఉంది.
కాలేయం సమస్య: బీట్ రూట్లో ఎక్కువగా కాపర్, ఐరన్ వంటివి ఉంటాయి. దీనిని అధికంగా తినడం వల్ల కాలేయ సమస్యలకు కారణం అవుతుంది. షుగర్ అధికంగా ఉన్న వారు దీనిని తినకపోవడమే మంచిది. ఒకవేళ దీనిని ఎక్కువగా తిన్నట్లైతే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.