Fact Check: సబ్బు నురగతో పుట్టిబోయే బిడ్డ ఆడ, మగ అనేది తెలుస్తుందా..?
గర్భం ధరించిన తరువాత పుట్టబోయేది మగ పిల్లాడా లేదా ఆడపిల్లా అనే విషయం తెలుసుకోవాలనే కోరిక చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది
దిశ, ఫీచర్స్: గర్భం ధరించిన తరువాత పుట్టబోయేది మగ పిల్లాడా లేదా ఆడపిల్లా అనే విషయం తెలుసుకోవాలనే కోరిక చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. పుట్టబోయే బిడ్డపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. దీని కోసం చాలామంది ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. ఒకప్పుడు పుట్టబోయేది ఏ బిడ్డ అనేది తెలుసుకునేవారు. కానీ, కొందరు ఆడపిల్ల పుడుతుందంటే గర్భస్రావం చేయించుకునే వారు ఉన్నారు. దీని కారణంగానే లింగ నిర్ధారణపై నిషేధం విదించింది. ఇక, అప్పటి నుంచి పుట్టబోయే బిడ్డ ఎవరనేది రకరకాల చిట్కాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో ఒకటి ఈ సబ్బు నురగతో చేసే ప్రయోగం.
ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఈ సబ్బు నురగ ప్రయోగం వైరల్ అవుతుంది. ఇందులో గర్భం ధరించిన స్త్రీ మూత్రాన్ని సేకరించి, దానిని ప్లాస్టిక్ గ్లాసులో ఉంచుతారు. అందులో సబ్బు ముక్క వేసి కలుపుతారు. 30 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేస్తారు. అందులో సబ్బు కరిగి నురగలాగా కనిపిస్తే మగపిల్లాడు అని, కరగకుండా అలాగే ముక్క ఉంటే ఆడపిల్ల పుడుతుందని చెబుతున్నారు. అయితే, చాలా చోట్ల ఇటువంటి పద్ధతి ద్వారా పరీక్షించుకునే వారు కూడా ఉన్నారు. అసలు ఈ సబ్బు నురగ ద్వారా ఎవరు పుడతారో తెలుస్తుందా..? అసలు ఇది ఎంతవరకు నిజమో నిపుణులు తెలియజేశారు.
ఇలా తెలిసే చాన్స్ లేదు:
పుట్టబోయేది ఏ బిడ్డ అనేది కేవలం వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా బిడ్డ జననాంగాల ఆకారాన్ని బట్టి ఎవరు పుడతారో వైద్యులు మాత్రమే తెలుసుకుంటారు. అయినా ఆ విషయాన్ని వారు బయటపెట్టరు. సాధారణంగా స్త్రీ మూత్రాన్ని బట్టి లింగ నిర్ధారణను వైద్యులు కూడా చేయలేరు. ఇలా కేవలం రక్త పరీక్ష లేదా ఆల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారానే తెలుస్తుంది. అయితే, ఏ బిడ్డ పుడుతుందా అనే విషయంపై చాలామంది ఇంటి చిట్కాలతో పరీక్షలు చేసి తెలుసుకుంటారు. కానీ, నిజానికి ఇలా ఎప్పుడూ తెలియదు. సబ్బు మూత్రంతో లింగ నిర్ధారణ పరీక్షకు పనికిరావని, ఇది కేవలం వారి అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.