జర్నీలో ఫోన్ తదేకంగా చూస్తే అంతే సంగతులు..

ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైన ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకుండా ఉండటమనేది దాదాపు అసాధ్యం.

Update: 2023-01-08 12:52 GMT

దిశ, ఫీచర్స్ : ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైన ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకుండా ఉండటమనేది దాదాపు అసాధ్యం. అయితే తరచూ వాడటంవల్ల, వాడకూడని సందర్భాల్లో, ప్రదేశాల్లో వాడటం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే అటువంటి చోట్ల మినహాయించడం మేలు అంటున్నారు కంటి వైద్య నిపుణులు. మొబైల్ ఎక్కడ? ఎప్పుడు? ఎలా వాడకూడదు? అనే విషయంలో కొన్ని సలహాలిస్తున్నారు.

తరచూ వాడితే జరిగేది ఇదే..

మొబైల్ ఫోన్‌ను నిరంతరం అదే పనిగా వాడటం, ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తూ గడపడం అనేది క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అందులోనూ చాలామంది జర్నీలోనో, ఎక్కడైనా బయటకు వెళ్లినప్పుడో తరచూ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటారు. అయితే ఎండలో, వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తరచూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల కంటిచూపు మందగించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ అలవాటు క్రమంగా అంధత్వానికి దారి తీస్తుందని చెప్తున్నారు. ఇటీవల టెక్నాలజీ నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో పగటిపూట, అధిక ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వలన ఒక మహిళ కంటిచూపు కోల్పోయినట్లు కనుగొన్నారు. అందుకే అలా చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో మొబైల్ ఫోన్, టాబ్లెట్ వాడటంవల్ల వాటి స్క్రీన్‌పై సూర్యుని కిరణాలు పడినప్పుడు పరావర్తనం చెంది.. ఆ ఫోన్ చూస్తున్న వ్యక్తి కళ్లపై ప్రభావం పడుతుంది. దీనివల్ల రెటీనా దెబ్బతినే అవకాశం అధికంగా ఉందనేది పరిశీలనలో తేలిన అంశం. అంతేకాదు సోలార్ మాక్యులోపతి, మాక్యులార్ డీజనరేషన్ అనే వ్యాధులు కూడా సంభవిస్తాయట. కంటిలోని రెటీనా వెనుక భాగంలో ఉండే మాక్యులా ప్రభావితం కావడంతో కంటిచూపు సమస్యలు తప్పవు.

పరిశోధనలేం చెప్తున్నాయి?

తరచూ మొబైల్ ఫోన్, టాబ్లెట్ వాడటం, స్క్రీన్స్ చూడటం అనే విషయాల ఆధారంగా నిపుణులు పరిశోధనలు జరిపారు. 20 ఏళ్ల వయసుగల ఒక యువతి, 30 ఏళ్ల వయసు గల మరో మహిళను ఒక బీచ్‌ ఒడ్డున ఎండలో కూర్చుని గంటల తరబడి మొబైల్, టాబ్లెట్ వాడటాన్ని నిపుణలు పరిశీలించారు. చివరకు వారు సోలార్ మాక్యులోపతి సమస్యను ఎదుర్కొన్నట్టు గుర్తించారు. అలాగే ఏవైనా సూర్య కిరణాలు ప్రతిబింబించే స్క్రీన్‌లను, లేదా ఇంటిలో సినిమాలు చూడటానికి ఉపయోగించే స్క్రీన్‌లను తదేకంగా చూస్తూ ఉంటే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు. కొంతకాలం ఇదే కొనసాగితే అంధత్వం వస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాగే మూడు గంటల పాటు తమ మొబైల్ ఫోన్‌ను వాడుతున్న వ్యక్తులను కూడా పరిశోధకులు పరిశీలించి అది కంటిచూపు సమస్యపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఎక్కువసేపు ఎండలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కూడా సూర్యకిరణాలు మన కళ్లపై పడితే కంటిచూపు మందగించే అవకాశం ఉంది. అందుకే సన్ గ్లాసెస్ వాడాలని చెప్తుంటారు.

Tags:    

Similar News