పదేపదే ఫేస్ వాష్ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలిస్తే షాక్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

సీజన్‎తో పని లేకుండా అందంగా కనిపించడం కోసం కొందరు పూట పూటకు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు.

Update: 2024-06-22 09:31 GMT

దిశ, ఫీచర్స్: సీజన్‎తో పని లేకుండా అందంగా కనిపించడం కోసం కొందరు పూట పూటకు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై బ్యాక్టీరియా, క్రిములు నశించి బాగా అందంగా ముఖం తయారవుతుందని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ రోజులో నాలుగు లేదా అయిదు సార్లు ముఖం కడగడం వల్ల ప్రయోజనాల కంటే కూడా దుష్ప్రభావాలు అధికంగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.

అవసరమైతే తప్ప ముఖాన్ని రెండు లేదా మూడు సార్లకు మించి ఫేస్ వాష్ చేయకూడదు అని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే తేమ తగ్గిపోతుంది. తద్వారా ముఖం పొడిబారిపోతుంది. ఫలితంగా ముఖంపై తెల్లటి పొక్కులు, చర్మం పగిలినట్లు కనిపించడం లాంటివి జరుగుతాయి.

ఫేస్ వాష్ చేసేటప్పుడు మార్కెట్లో లభించే వివిధ రకాల చర్మ సౌందర్య సాధనాలను కూడా వాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరిది జిడ్డు చర్మ మైతే, మరికొందరిది పొడిగా ఉంటుంది. ఇంకొందరు సాధారణ చర్మ తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే చర్మ తత్వాన్ని బట్టే రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.

ఈ క్రమంలో సాధారణ చర్మ తత్వం గల వారు రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే చాలు. అలాగే జిడ్డు చర్మతత్వం ఉన్నట్లయితే రెండుమూడుసార్లు ఫేస్‌వాష్ చేసుకున్నా.. ఆ తర్వాత టోనర్‌ని ఉపయోగిస్తే ఎక్కువ సమయం తాజాగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక పొడి చర్మం ఉన్నవారు ఒకటి లేదా రెండు సార్లు ముఖం కడుక్కొని.. వెంటనే మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

చర్మం తేమ కోల్పోకుండా ఉండాలంటే.. స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి, శరీరానికి బాగా పట్టించాలి. అలా గంట పాటు వదిలేస్తే చర్మ పోషణకు అవసరమయ్యే పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. త్వరగా పొడిబారకుండా ఉండేలా చేస్తుంది. మరీ అంతగా ఫేస్‌వాష్ చేసుకోవాలనిపిస్తే నీటితో ముఖం కడుక్కోవడానికి బదులుగా.. ఒక్కోసారి తడిగా ఉండే వైప్స్‌ని ఉపయోగించచ్చు. అందులో కూడా వివిధ రకాల ఫ్లవర్స్‎ అందుబాటులో ఉంటాయి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News