అదిరిపోయే చికెన్ కీమా మసాలా తయారీ విధానం.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ కర్రీ ఉండాల్సిందే
దిశ, ఫీచర్స్: ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ కర్రీ ఉండాల్సిందే. అమ్మలు వండాల్సిందే. లేకపోతే ఆ రోజు ముద్దే దిగదనుకోండి. రుచిలో కాకుండా చికెన్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతూనే ఉంటారు. కానీ లిమిట్ లో తీసుకుంటే బెటర్. చికెన్ మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్‌ను అందిస్తుంది.
అయితే చిన్న నుంచి పెద్ద వరకు తినే చికెన్ తో కొత్తగా ఈ రోజు చికెన్ కీమా మసాలా ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. నాన్ వెజ్ ప్రియులకు ఈ చికెన్ అంటే చాలా ఇష్టం. సాధారణ చికెన్ గ్రేవీ లేదా మసాలా చేయడానికి బదులుగా చికెన్ కీమా మసాలా తయారు చేయండి. దీన్ని పూరీ, చపాతీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంతకు ముందెన్నడూ చికెన్ కీమా తయారు చేయకపోతే.. నేడు ఈ కింద చెప్పిన విధంగా ట్రై చేయండి. కొత్త రెసిపీ, కొత్త రుచి వస్తుంది. చికెన్ కీమా మసాలా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ కీమాకు కావాల్సిన పదార్థాలు..
నూనె - 2 టేబుల్ స్పూన్లు, సోంపు - 1/4 టీస్పూన్, ఉల్లిపాయ - 2 (సన్నగా తరిగినవి), దాల్చిన చెక్క - 1 ముక్క, పచ్చిమిర్చి - 2, కొన్ని కరివేపాకు ఆకులు, సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, టమాటా -2, పసుపు - 1/4 టీస్పూన్, బెల్లం పొడి - 2 టీస్పూన్లు, చికెన్ మసాలా - 3/4 టీ స్పూన్, కారం పొడి - 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి - 1/4 టీ స్పూన్, మిరియాల పొడి - 1/4 టీ స్పూన్, గరం మసాలా - 1/2 టీస్పూన్, చికెన్ కీమా- అర్ధ కిలో, సరిపడా వెల్లుల్లి, చిటికెడు యాలకుల పొడి, నీరు - కావలసినంత, వెన్న - 1/2 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా తీసుకోవాలి.
చికెన్ కీమా తయారీ విధానం..
ముందుగా కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోయాలి. వేడయ్యాక దాల్చిన చెక్క, ఇంగువ వేసి మసాలా చేసుకోవాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.
తర్వాత తురిమిన టొమాటోలు వేయాలి. వెంటనే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, మిరియాల పొడి వేసి.. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిసి.. 5 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం చికెన్ కీమా మసాలాతో పాటు యాలకుల పొడి వేసి బాగా బాగా తిప్పుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికాక, వాటర్, సరిపడా మసాలా, ఉప్పు వేసి గ్యాస్ సిమ్ లో పెట్టి.. 10 నిమిషాలు ఉంచాలి. అంతే మూత తెరిచి దానిపై కొత్తిమీర చల్లితే చికెన్ కీమా మసాలా రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.