Bridal makeup : పెళ్లి కూతురు మెరిసిపోవాలంతే.. బ్రైడల్ మేకప్‌పై పెరుగుతున్న ఆసక్తి!
Bridal makeup : పెళ్లి కూతురు మెరిసిపోవాలంతే.. బ్రైడల్ మేకప్‌పై పెరుగుతున్న ఆసక్తి!
దిశ, ఫీచర్స్ : పెళ్లంటే తప్పట్లూ తాళాలు మాత్రమే కాదు, ఈ రోజుల్లో అది ఫ్యాషన్లు, డ్రెస్సింగ్‌లు, మేకప్‌లు కూడాను. ఇక్కడ ఆధునిక హంగులు, సంప్రదాయాల మేళవింపులు కూడా ఉంటున్నాయి. ముహూర్తం ఫిక్స్ అయిందంటే చాలు, వధూ వరులు, వారి కుటుంబ సభ్యులు జరగబోయే వేడుకను ఎలా సెలబ్రేట్ చేయాలనే దాని గురించే ఆలోచిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ఉన్నంతలో గ్రాండ్‌గా చేయాలని కలలు గంటారు. ఈ నేపథ్యంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటంతో ‘బ్రైడల్ మేకప్’ ట్రెండ్ ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. పెళ్లి రోజు ఎలా రెడీ అవ్వాలి? ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? ఏ మేకప్ సెట్ అవుతుంది? అనే విషయాలన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పెళ్లి కూతురు ముస్తాబు కూడా ఇప్పుడొక ఉపాధి పరిశ్రమగా మారుతోంది అంటున్నారు నిపుణులు.
ట్రెండీగా.. ట్రెడీషనల్‌గా
పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి వధూ వరుల ఆనందానికి అంతు ఉండదని చెప్తారు. ఇటు అమ్మాయి, అటు అబ్బాయి ఆ రోజు ఎలాంటి దస్తులు వేసుకోవాలి? ఎక్కడ షాపింగ్ చేయాలి? అని ఆలోచిస్తారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వారి కుటుంబాలు ఓ వైపు సంప్రదాయాలను, మరో వైపు ఆధునిక పోకడలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా అలంకరణ ఎలా ఉండాలనేది కూడా వధూ వరులు ముందుగానే ఓ నిర్ణయానికి రావాలని భావిస్తుంటారు. పెళ్లి పందిరిలో అటు సంప్రదాయం, ఇటు ట్రెండీ స్టయిల్‌ను బ్యాలెన్స్ చేయాలని భావిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ్టి పెళ్లిళ్లు అలంకరణలు, ఆధునిక, సంప్రదాయాల కొత్త కలయికతో అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
డ్రెస్సింగ్, మేకప్
ముఖ్యంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం బ్రైడల్ మేకప్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. డ్రెస్సింగ్, మేకప్‌పై వంటి విషయాలపై యువతులు ఫోకస్ పెడుతున్నారు. కొందరు ఓన్‌గా మేకప్ ప్లాన్ చేసుకుంటుంటే.. మరి కొందరు, బ్యుటీషియన్లను, ఫ్యాషన్ డిజైనర్లను సంప్రదిస్తుంటారు. పెళ్లి కూతురును చేసినప్పటి నుంచి పీఠల మీదకు చేరే వరకు ఏం చేయాలనే విషయంలో ముందుగానే ఓ క్లారిటీకి వస్తారు. తమకు సెట్ అయ్యే కలర్ చీరలు, డ్రెస్సులు, వాటికి మ్యాచ్ అయ్యే ఆభరణాలు, అలాగే మెహందీ డిజైన్లు, కాళ్లకు పారాణి.. ఇలా అనేక విషయాల్లో వధువు అలంకరణకే ఇప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
అందంగా కనిపించాలని..
పెళ్లిరోజు తాము అందంగా కనిపించాలని, ఫొటోల్లో చక్కగా రావాలని ప్రతీ పెళ్లి కూతురు భావిస్తుంది. ఇక ఇటీవల చాలా మంది యువతులు పెళ్లి తేదీ సమీపిస్తున్న క్రమంలో తమ అందం పెంచుకోవడానికి ఏ క్రీములు వాడాలి? ఎటువంటి లోషన్లు బెట్టర్ అని కూడా గూగుల్ సెర్చ్ చేస్తున్నారట. కానీ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అందంగా కనిపించాలనే ఆరాటంలో, హడా విడిలో తమ స్కిన్‌కు సెట్ అవ్వని క్రీములు, లోషన్లు వాడితే అలర్జీలు, ముఖంపై ర్యాషెస్ రావొచ్చు. అందుకే కొన్ని విషయాల్లో పెద్దలు లేదా నిపుణుల సూచనలు తప్పని సరి. అందుకే చాలామంది బ్యుటీషియన్లను, డెర్మటాలజిస్టులను సంప్రదిస్తుంటారు.
చర్మసౌందర్యాన్ని పెంచే విటమిన్ ఇ
పెళ్లి కూతురు అలంకరణలో అనేక అంశాలు ఉంటాయి. అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్లు కూడా ఉంటాయి. ప్రధానంగా ఇ విటమిన్ పాత్ర ఎంతో ముఖ్యమైందట. ఇది చర్మానికి, జుట్టుకు చాలా అవసరం. హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ముఖ వర్ఛస్సును పెంచుతుంది. ఇక ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో, క్యాన్సర్ కారకాలను నివారించడంలో ఉపయోగపడతాయి. కాబట్టి అవసరమైతే పెళ్లికి రెండు నెలల ముందు నుంచి కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు నిపుణులు, స్కిన్ స్పెషలిస్టుల సలహా మేరకు సిప్లిమెంట్లు తీసుకోవచ్చు. గుడ్లు, వాల్ నట్స్, చేపలు, అవిసెగింజలు, ఆలివ్స్, రెడ్ మీట్, సీఫుడ్స్, అవొకాడా, గుమ్మడి వంటి వాటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఆహారాలు తీసుకోవడం కూడా బ్రైడల్ అందాన్ని పెంచుతాయి.
విటమిన్ బితో మొటిమలు మాయం
విటమిన్ బి బాడీలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల మొటిమలు, నల్లబడటం వంటి సమస్యలు తలెత్తవు. నాన్‌వెజ్, ముఖ్యంగా కాలేయం, గుడ్లు, పాలు, తృణ ధన్యాలు, చికెన్, పెరుగు వంటి వాటిలో విటమిన్ బి ఉంటుంది. బయోటిన్ కూడా జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే పోషకాహారం కూడా అందమైన చర్మానికి, పొడవైన జుట్టుకు చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
పెదవులు, కళ్ల అందం కోసం
బ్రైడల్ మేకప్‌లో కళ్లు, పెదవుల అలంకరణ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ రోజుల్లో డ్రెస్సింగ్‌తోపాటు కళ్ల మేకప్, లిప్ స్టిక్స్ కూడా ట్రెండీగా, స్టయిలిష్‌గా ఉండాలని కోరుకుంటున్నారు చాలామంది. కనురెప్పల వెనుక ఉండే మేకప్, పెదవుల లిప్ స్టిక్‌లకు, ధరించే డ్రెస్సింగ్‌కు మ్యాచ్ అయ్యేలా కూడా చూసుకుంటున్నారు. అయితే ఎక్కువమంది అమ్మాయిలు రెడ్, వాయిలెట్, ముదురు గోధుమ, పింక్ కలర్లను అలంకరణలో ఇష్టపడుతున్నారట. చీరలు, డ్రెస్సులతోపాటు వాటికి మ్యాచ్ అయ్యే ఐబ్రోస్, లిప్ స్టిక్స్ వాడుతుంటారు పలువురు. ఇక కళ్ల మేకప్ విషయానికి వస్తే అట్రాక్షన్ ఉట్టిపడే స్మోకీ ఐ స్టయిల్‌ను ఆధునిక వధువులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.