తులసి మొక్కలు ఎన్ని రకాలో తెలుసా..
హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి హిందూ మహిళ ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకుని పూజలు చేస్తారు.
దిశ, వెబ్‌డెస్క్: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి హిందూ మహిళ ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకుని పూజలు చేస్తారు. ప్రతినిత్యం తులసి మొక్కకు నీరు పోసి, దీప ధూప నైవేద్యాలను భక్తిశ్రద్దలతో సమర్పిస్తారు. అంతే కాదు కార్తీక పౌర్ణమి నాడు తులసి కళ్యాణం కూడా జరిపిస్తారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. నిత్యం తులసి పూజ చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందని, కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. అయితే మహిళలు శ్రద్దగా పూజించే తులసి మొక్కలు ఒకటి కాదు రెండు కాదు ఐదు రకాల మొక్కలు ఉన్నాయంట. అసలు ఆ మొక్కల పేర్లు ఏంటి అవి ఎలా ఉంటాయి, ఏ మొక్కకు ఎంత ప్రాముఖ్యత.. వాటి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
నిమ్మ తులసి..
బహుశా ఈ నిమ్మతులసి పేరు చాలా వరకు ఎవరూ విని ఉండరు. ఈ ఆకులు నీలం రంగులో ఉంటాయి. ఈ మొక్క ఆకులను ఆహారం నాణ్యతగా ఉంచడానికి, టీ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిమ్మపండులాగే దీని ఆకులు కూడా పుల్లగా ఉంటాయి. రామ తులసి, కృష్ణ తులసి లాగా ఈ తులసిని పూజించరు.
అటవీ తులసి..
అటవీ తులసి ఎక్కువగా అడవుల్లో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ తులసి మొక్క ఆకులు ఔషధ గుణం కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీని ఆకులు కూడా పెద్దగా ఉంటాయి. ఈ మొక్క ఆకులను కూడా పూజకు ఉపయోగించరు. దీనికి పూజలు చేయరు.
ఆఫ్రికన్ బాసిల్..
ఈ తులసి ఆఫ్రికాలో దేశంలో కనిపిస్తుంది. అడవి తులసి లాగా ఆఫ్రికన్ తులసి ఆకులు కూడా పెద్దవిగా ఉంటాయి. ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయట.ఈ మొక్కను కూడా పూజలో ఉపయోగించరు. దీన్ని ఎక్కువగా ఆఫ్రికన్లు ఉపయోగిస్తారు.
రామ తులసి..
రామ తులసి ఇది మన అందరికీ తెలిసిన మొక్క. దీన్ని శుద్ధ తులసి అని కూడా పిలుస్తారు. ఈ రామతులసి మొక్క ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండి మంచి సువాసనను వెదజల్లుతాయి. హిందువులు ఈ మొక్కను తులసిగా భావించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అలాగే ఆయుర్వేదంలో ఈ మొక్క అత్యంత ఔషధ గుణాలు ఉన్నదిగా పేర్కొన్నారు.
కృష్ణ తులసి..
కృష్ణ తులసి ఈ తులసిని శ్యామ్ తులసి అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను కృష్ణ తులసిగా పూజిస్తారు. దీని ఆకులు నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉంటాయి. ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను హోమియోపతి, ఆయుర్వేద మందులలో కూడా వినియోగిస్తారు.