నిర్ణయం బ్రెయిన్‌దే..!! ఏం ఆలోచించాలో డిసైడ్ చేస్తున్న మెదడు
మీరు బస్సులో వెళ్తున్నారు. కిటికీ పక్కన కూర్చొని బయటికి చూస్తున్నారు.
దిశ, ఫీచర్స్: మీరు బస్సులో వెళ్తున్నారు. కిటికీ పక్కన కూర్చొని బయటికి చూస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణం చల్లగా ఉంది. ఇది చూస్తూ ఉండగానే మీ మదిలో ఠక్కున మరో ఆలోచన మెదిలింది. మీరు చిన్నప్పుడు ఇలాంటి వెదర్‌ను చూసినప్పుడు గ్రామంలో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. ఆ తర్వాత వర్షం వచ్చింది. వానలో తడుస్తూ కేరింతలు కొడుతున్నారు. ఎంత ఆనందమో కదూ.. ఇలా బస్సులో వెళ్తున్న మీలో ఏవేవో ఆలోచనలు మెదులుతున్నాయి. మీ జీవితంలో ఎప్పుడో జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. కారణం.. మెదడు పనితీరు. ఏ సందర్భానికి ఎటువంటి ఆలోచన రావాలో, ఎటువంటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలో నియంత్రించే అద్భుత శక్తి మానవ మెదడుకు ఉంటుంది. అందుకే ఆయా సంఘటనలు, దృశ్యాలు, స్పర్శలు గతంలో జరిగిన ఆ తరహా జ్ఞాపకాలను వెంటనే గుర్తుచేస్తుంది మెదడు.
డీఫాల్ట్ మోడ్ నెట్ వర్క్
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన మెదడులో అంతర్లీనంగా ఉండే 'డీఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్' పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే ఆలోచనలను మెదడులోని ఆ భాగం నియంత్రిస్తుంది. ఒక సంఘటన, దృశ్యం లేదా స్పర్శ ఆధారంగా మనం గతంలో అనుభవించిన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడంలో దోహదపడుతుందని 2000 సంవత్సరం ప్రారంభంలో మార్కస్ చైర్చెల్ అనే న్యూరాలజిస్టు అతని పరిశోధనలో కనుగొన్నాడు. ఊహల్లో తేలియాడటం, పగటి కలలు కనడం, గత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం లేదా భవిష్యత్తు గురించి ఊహించుకోవడం అనేవి మానవ మెదడులో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉండే 'డీఫాల్ట్ మోడ్ నెట్ వర్క్' ద్వారానే జరుగుతుంది. ఆ సందర్భంలో మెదడులోని ఇతర ఆలోచనలు ముఖ్యమైనవి కానప్పుడు వాటి ఆలోచన తాలూకు నెట్ వర్క్ డౌన్ అయి, మెదడులో అంతర్లీనంగా ఉండే డీఫాల్ట్ నెట్‌వర్క్ (default mode network) ఆన్ అవుతుంది. ఈ స్థితిలో వ్యక్తులు చేయడానికి ఇతర కార్యకలాపాలు లేని కారణంగా మెదడు రకరకాల ఆలోచనలను గుర్తుకు తెస్తుంది. బ్రెయిన్‌లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల తాలూకు నెట్‌వర్క్‌లు పనిచేయని కారణంగా అప్పుడు 'ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ నెట్‌వర్క్' ప్రాంతాలు ఊహించుకోవడానికి, జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి దోహదం చేస్తాయి.
మెదడుపై ప్రభావాలు
జీవితంలో కొన్ని అనుభవాలు, సంఘటనలు మనల్ని బాగా ప్రభావితం చేస్తాయి. కొన్ని మనస్సును హత్తుకుంటే.. మరికొన్ని తీవ్రమైన బాధను కలిగిస్తాయి. ఇలాంటివన్నీ మన మెదడులో నిక్షిప్తమై పోతాయి. మనస్సుకు నచ్చి, మనల్ని ఆకర్షించడం ద్వారా మధుర జ్ఞాపకాలుగా, తీపి గుర్తులుగా మెదడులోని ప్రత్యేక భాగంలో నిక్షిప్తమై పోతాయి. కొన్ని బాధను కలిగించే చేదు జ్ఞాపకాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తే అవి కూడా మెదడులో నిక్షిప్తమై పోతాయి. మైండ్ రిలాక్స్‌గా ఉన్నప్పుడో, లేక సేమ్ స్విచ్యువేషన్ ఎదురైనప్పుడో గతంలో ప్రభావితం చేసిన విషయాలు మనకు గుర్తుకువస్తాయి. అప్పటికప్పుడు మనలో క్రియేటివిటీని కూడా కలిగిస్తాయి. ఆయా భౌతిక, సామాజిక, వాతావరణ పరిస్థితులలో ఎలా స్పందించాలనే సంకేతాలను మెదడు అందించంవల్ల మనం దానిని అనుసరిస్తాం. అంటే మెదడు జ్ఞాపకాలను ఒక క్రమపద్ధతిలో నిల్వ చేసుకుంటుందన్నమాట.
పరిస్థితులను బట్టి సమాచారం
కళ్లు, ముక్కు, నోరు, శరీరంలోని ఇతర ఇంద్రియాలు కూడా ఆయా పరిస్థితుల్లో ప్రభావితమైనప్పుడు మెదడు సందర్భోచితంగా వాటి సమాచారాన్ని సేకరించి, నమోదు చేసుకుంటుంది. ఒక క్రమ పద్ధతిలో సమాచారం మెదడులోకి అనుసంధానించబడుతుంది. అది పరిస్థితులను బట్టి వ్యక్తిని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు మనం ఒక మంచి వాసనను ఆస్వాదించినప్పుడు అది మన మెదడులో బలంగా నాటుకుపోతుంది. ఒక అందమైన ఫొటోను చూసినప్పుడు ఆ భావన కూడా మన మెదడులో నిలిచిపోతుంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడైనా అలాంటి వాసన గ్రహిస్తే లేదా అటువంటి ఫొటోను చూస్తే గతంలో నిక్షిప్తమై ఉన్న సమాచారం ఆధారంగా వెంటనే గుర్తించగలుగుతాం అన్నమాట. మనకు తెలియకుండానే మన మెదడు అనేక రకాల సమాచారాన్ని సందర్భోచితంగా గ్రహించి అవసరమైనప్పుడు అందించి మనల్ని నడిపిస్తుంది.
ఆలోచనలు, నియంత్రణ
డీఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ ద్వారా పుట్టుకొచ్చిన ఆలోచనలు, జ్ఞాపకాలు సృజనాత్మకతకు దోహదపడతాయి. కొన్ని చెడు సంఘటనలు చూసినప్పుడు అవి చెడు ప్రభావాలుగా మెదడులో నిక్షిప్తమై ఉండటంతోపాటు మంచి-చెడు ఆలోచనలు మనలో మిళితమై ఉంటాయి. దీంతో చెడు ఆలోచనల జోలికి పోవద్దని, చెడు చేయొద్దనే సంకేతాలను మెదడు అందజేస్తుంది. చెడు ఆలోచనల నుంచి బయటపడేందుకు మార్గం చూపుతుంది. ఆందోళన, భయం, అవమానం వంటి భావాలకు లోనైనప్పుడు వాటిని గుర్తుంచుకోవడమే కాకుండా అలాంటి బాధాకరమైన జ్ఞాపకాలు, సంఘటనల నుంచి మనల్ని రక్షించేలా పనిచేస్తుంది. ఇలా మంచి-చెడు ప్రభావాలను సందర్భోచితంగా నియంత్రిస్తూ మనల్ని నడిపించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మన మెదడు.