స్మార్ట్ వాచ్‌లు రక్తపోటును ఎలా కొలుస్తాయి.? ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సాధారణంగా మనం బిపీని కొలవడానికి సిగ్మోమ్యానోమీటర్‌ను ఉపయోగిస్తామనే విషయం అందరికీ తెలిసిందే.
దిశ, ఫీచర్స్: సాధారణంగా మనం బిపీని కొలవడానికి సిగ్మోమ్యానోమీటర్‌ను ఉపయోగిస్తామనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం బిపీని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు బీపీ మిషిన్‌లో ఉండే కఫ్‌ని చేతికి చుట్టి అనంతరం అందులో గాలిని నింపుతారు అలా నింపడం వల్ల చేతుల్లోని నరాలపై ఒత్తిడి పడి.. శరీరంలో ప్రవహిస్తున్న రక్తం వేగాన్ని అంచనా వేస్తుంది. అలా సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు రీడింగ్‌లను మీటర్‌లో చూపిస్తుంది.
అలాగే వైద్యులు రక్త ప్రవాహంలో వచ్చే మార్పులు, శబ్ధాలను గమనించేందుకు స్టెతస్కోప్ లేదా ఎలక్ట్రానిక్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంటారు. వీటి ఆధారంగా సదరు వ్యక్తి రక్తపోటు ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా ప్రస్తుత కాలంలో డాక్టర్స్ దగ్గరకు వెళ్లకుండా మనం పెట్టుకున్న స్మార్ట్ వాచ్‌లలోనే బీపీని తెలుసుకుంటున్నారు. ఇక స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీలు సైతం ఇలాంటి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అలా కొన్ని సందర్భాల్లో స్మార్ట్ వాచ్‌లో వచ్చిన అలర్ట్స్ ఆధారంగా వ్యక్తుల ప్రాణాలు నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అయితే అసలు ఈ స్మార్ట్ వాచ్‌లు బీపీని ఎలా గుర్తిస్తాయన్న సందేహం మనలో ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇంతకీ స్మార్ట్ వాచ్ బీపీని ఎలా గుర్తిస్తుంది. ఇందులో ఉపయోగించే టెక్నాలజీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సహజంగా రక్తపోటును అంచనా వేయడానికి స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లు ఫోటోప్లెథిస్మోగ్రఫీ (PPG) అని పిలిచే సెన్సార్‌లను ఉపయోగిస్తున్నారు. వీటి సహాయంతో రక్తపోటును అంచనా వేయొచ్చు. పీపీజీ అనేది రక్త ప్రవాహాన్ని కాంతి ద్వారా అంచనా వేస్తుంది. స్మార్ట్ వాచ్ అడుగున లైట్ ఉండడానికి కారణం ఇదే.
స్మార్ట్‌వాచ్‌లోని సెన్సార్‌లు చర్మంలోకి కాంతిని విడుదల చేస్తాయి. ఇవి మణికట్టులోని రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని కొలుస్తాయి. రక్తనాళాలలో ప్రవహిస్తున్న రక్తప్రవాహంలో మార్పులను విశ్లేషించడం ద్వారా రక్తపోటును అంచనా వేస్తాయి.
అయితే స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లలో చూపించే రక్తపోటు కొలతల్లో 100 శాతం నిజం ఉంటుందా.? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌వాచ్‌లలో వచ్చే రీడింగ్స్‌ను గుడ్డిగా నమ్మలేమని, కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించాలని అంటున్నారు నిపుణులు.