హవా మహల్‌కి ఆ పేరు ఎలా వచ్చింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా.. ?

భారత దేశం అనేక చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది.

Update: 2024-06-16 09:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత దేశం అనేక చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయ వారసత్వానికి ఇవి ప్రసిద్ధి. ఒక్కో పురాతన కట్టడానికి ఒక్కో చరిత్ర ఉంది. ముఖ్యంగా రాజస్థాన్‌లో నిర్మితమైన చారిత్రక కట్టడాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని ఒక్కసారి చూస్తే చాలు ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సందే.

ఇక పోతే రాజస్థాన్ రాజధాని జైపూర్. దీనిని పింక్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడికి భారతీయులే కాకుండా విదేశీయులు కూడా వస్తుంటారు. జైపూర్‌లో హవా మహల్ చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని చూడటానికి ప్రజలు చాలా దూరం నుంచి వస్తుంటారు. ఇంతకీ ఈ కట్టడానికి హవా మహల్‌ అని పేరు ఎందుకు వచ్చింది చాలా మందికి తెలియదు. మరి ఆ పేరు వెనక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హవా మహల్..

జైపూర్‌లోని హవా మహల్ నగరంలోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ హవా మహల్ ని ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అని కూడా పిలుస్తారు. ఈ హవా మహల్‌లో అనేక కిటికీలు ఉన్నాయి. దీంతో మహల్ లో నిత్యం గాలి వీస్తూనే ఉంటుంది. అందుకే ఈ భవనానికి హవా మహల్ అని పేరు పెట్టారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని జుంఝును నగరాన్ని స్థాపించిన మహారాజా సవాయి జై సింగ్ మనవడు మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ 1799లో ఈ కట్టడాన్ని నిర్మించారు. అతను ఖేత్రీ మహల్ విశిష్ట నిర్మాణాన్ని చూసి ప్రేరేపనపొందాడు. దాంతో అతను ఈ గొప్ప, చారిత్రాత్మక ప్యాలెస్‌ని నిర్మించాడు. ఈ భవనాన్ని లాల్ చంద్ ఉస్తాద్ రూపొందించారు. భవనం ఐదు - అంతస్తుల వెలుపలి భాగం తేనెగూడులాగా కనిపిస్తుంది. భవనానికి ఉండే 953 చిన్న కిటికీలను జరోఖాస్ అని పిలుస్తారు.

పునాది లేకుండా నిర్మాణం..

ఇంత పెద్ద కట్టడాన్ని పునాదులు లేకుండా నిర్మించారట. హవా మహల్ 87 డిగ్రీల కోణంలో వంగి ఉండే వక్ర నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ కారణంగా, ఈ భవనం శతాబ్దాలుగా ఎటువంటి పునాది లేకుండా నిలబడి ఉంది.


Similar News