Migraine Headache : మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారా.. ఇలా ఉపశమనం పొందండి..
మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత రుగ్మత.
దిశ, ఫీచర్స్ : మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత రుగ్మత. ఇది కొంతమంది రోగులలో భరించలేని తలనొప్పిని కలిగిస్తుంది. తలనొప్పి కాకుండా వికారం, వాంతులు, నిద్రలో ఇబ్బంది వంటి అనేక ఇతర సమస్యలు మైగ్రేన్ లక్షణాలలో కనిపిస్తాయి. మైగ్రేన్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. మెదడులో జరిగే అసాధారణ కార్యకలాపాల వల్ల ఇది సంభవిస్తుందని చెబుతుంటారు నిపుణులు. ఇది నరాల ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
చాలా సందర్భాలలో మైగ్రేన్ సమస్యకు జన్యుపరమైన కారణం కనుగొన్నారని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా మైగ్రేన్‌కు శాశ్వత నివారణ లేదంటున్నారు. కానీ మంచి జీవనశైలి, సరైన ఆహారం, కొన్ని చర్యల ద్వారా ఈ సమస్య పెరగకుండా నిరోధించవచ్చు. మైగ్రేన్ సమస్యను నియంత్రించే అలాంటి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
ధ్యానం..
క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం. ఇది మైగ్రేన్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ఒత్తిడి, నిద్ర సమస్యలను కూడా నయం చేస్తుంది. మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.
అల్లం టీ..
మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనాన్ని అందించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అల్లంలో ఉన్నాయి.
లావెండర్ ఆయిల్‌తో ఆవిరి..
తలనొప్పి సమస్య నుండి ఉపశమనం కలిగించే అనేక లక్షణాలు లావెండర్ ఆయిల్ కలిగి ఉంటుంది. ఇందుకోసం నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం ద్వారా మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
కెఫిన్ వినియోగం..
తలనొప్పి విషయంలో బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ లేదా టీ వంటి కెఫిన్ తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కానీ పరిమిత పరిమాణంలో మాత్రమే తినండి.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.