భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన నినాదాలు..

దిశ, ఫీచర్స్ : 'వందేమాతరం.. ఇంక్విలాబ్ జిందాబాద్.. జైహింద్.. స్వరాజ్యం నా జన్మ హక్కు'.. ఒకటా రెండా భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన ఇలాంటి నినాదాలెన్నో..Latest Telugu News

Update: 2022-08-15 03:37 GMT

దిశ, ఫీచర్స్ : 'వందేమాతరం.. ఇంక్విలాబ్ జిందాబాద్.. జైహింద్.. స్వరాజ్యం నా జన్మ హక్కు'.. ఒకటా రెండా భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన ఇలాంటి నినాదాలెన్నో. ప్రజల్లో పోరాటస్ఫూర్తిని చల్లారనివ్వని నిప్పు కణికలు మరెన్నో. ఇప్పుడంటే ఇలాంటి స్లోగన్స్ ఆగస్టు 15 లేదా జనవరి 26కే పరిమితయ్యాయి కానీ.. స్వాతంత్య్ర సమరంలో నిత్య మంత్రాలుగా వెలుగొందాయి. బానిస సంకెళ్లను తెంచమన్నాయి. శత్రువుకు ఎదురొడ్డి పోరాడమన్నాయి. స్వేచ్ఛా స్వాతంత్రాలను దక్కించుకోవాలనే ధైర్యాన్ని నూరిపోశాయి.

నేటి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన పలు ఉద్యమాల్లో అక్కడక్కడా వినిపిస్తు్న్నా.. ఈ తరానికి మాత్రం వాటి పుట్టు్క వెనకున్న ఆంతర్యం, రగిల్చిన స్ఫూర్తి గురించి తెలియదు. ఈ 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి స్వాతంత్య్ర సంగ్రామానికి ఊపిరిలూది, చరిత్ర పథంలో నిలిచిన భారతీయ నినాదాలపై స్పెషల్ స్టోరీ..

1. జైహింద్ - నేతాజీ సుభాష్ చంద్రబోస్

రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రదేశమైన జపాన్‌తో కలిసి పోరాడిన తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) సైనికులకు వందనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 'జై హింద్' నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. కానీ కొన్ని వివరణల ప్రకారం ఈ నినాదాన్ని వాస్తవంగా నేతాజీ రూపొందించలేదు. జర్మనీకి పై చదువుల నిమిత్తం వెళ్లిన హైదరాబాదీ కలెక్టర్ కుమారుడు జైన్-ఉల్ అబిదీన్ హసన్ ఈ పదాన్ని సృష్టించాడని ఒక పుస్తకం చెబుతోంది. అక్కడే బోస్‌ను కలుసుకున్న హసన్.. చివరకు తన చదువు వదిలేసి INAలో చేరాడు. అతనికి INA సోల్జర్స్‌కు మిలిటరీ గ్రీటింగ్స్ లేదా సెల్యూషన్‌కు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ఈ నినాదం కులం లేదా కమ్యూనిటీకి సంబంధించినది కాదు. అఖిలభారత ప్రాతిపదికన INA మొత్తానికి సంబంధించింది. జర్మనీలోని కొనిగ్స్‌బ్రక్ క్యాంప్‌లో ఉన్నప్పుడు హసన్‌కు ఈ 'జై హింద్' ఆలోచన వచ్చింది.

2. మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను - నేతాజీ

1944న జులై 4న మయన్మార్‌లో నేతాజీ చేసిన ప్రసంగం ఈ నినాదానికి మూలం. స్వాతంత్య్రం సాధనకు హింసా మార్గం తప్పదన్న తన ఫిలాసఫీని ఈవిధంగా నొక్కిచెప్పాడు. 'మిత్రులారా! విముక్తి యుద్ధంలో నా సహచరులారా! ఈ రోజు నేను మీ నుంచి ఒక విషయం కోరుతున్నాను. 'తుమ్ ముఝే ఖూన్ దో, మెయిన్ తుమ్హే ఆజాదీ దూంగా'(మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను) అంటూ ప్రసంగాన్ని ముగించాడు.

3. వందేమాతరం - బంకించంద్ర ఛటర్జీ

ఈ పదం మాతృభూమి పట్ల వ్యక్తీకరించబడిన గౌరవ భావాన్ని సూచిస్తుంది. 1870లో బెంగాలీ నవలా రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన పాట జాతీయ స్థాయిలో ఆదరణ పొందింది. అయితే కొంతమంది ఈ పాటను మతపరమైన విభజనకు సంకేతంగా కూడా చూస్తారు. బెంగాలీలో 'వందేమాతరం' పేరుతో రాసిన ఈ గీతం 1882లో 'ఆనందమఠం' నవల ప్రచురించబడే వరకు ప్రజాక్షేత్రంలో ప్రవేశపెట్టబడలేదు. ఆ నవలలో భామమైన ఈ పాటు స్వాతంత్య్రోద్యమ సమయంలో వ్యక్తీకరించబడిన భావాల్లో అనతి కాలంలోనే అగ్రగామిగా మారింది. నిజానికి 1770 ప్రారంభంలో ఈ నవల బెంగాల్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫకీర్-సన్యాసి తిరుగుబాటు నేపథ్యంలో వచ్చింది.

4 'ఇంక్విలాబ్ జిందాబాద్' - మౌలానా హస్రత్ మోహాని

'ఇంక్విలాబ్ జిందాబాద్(విప్లవం చిరకాలం వర్థిల్లాలి)' స్లోగన్‌ను తొలిసారిగా 1921లో మౌలానా హస్రత్ మోహాని ఉపయోగించారు. విప్లవ ఉర్దూ కవిగా గుర్తింపు పొందిన మోహాని.. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుల్లో ఒకడిగా ఉండి భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నాడు. అంతకుముందు 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం లేదా 'పూర్ణ స్వరాజ్' డిమాండ్‌ లేవనెత్తారు. వలసవాదంతో పాటు సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలనే అతని కోరికే 'ఇంక్విలాబ్‌ జిందాబాద్' నినాదానికి ప్రేరణ కలిగించింది. 1920 మధ్యకాలం నుంచి ఈ నినాదం భగత్ సింగ్, అతని నౌజవాన్ భారత్ సభ సహా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)కు యుద్ధభేరిగా మారింది.

5. సర్ఫరోషి కి తమన్నా - బిస్మిల్ అజిమాబాది

1921లో అమృత్‌సర్‌లో చోటుచేసుకున్న జలియన్‌వాలా బాగ్ మారణకాండ తర్వాత బిహార్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కవి బిస్మిల్ అజిమాబాది(రామ్ ప్రసాద్ బిస్మిల్ కాదు) రాసిన కవితలోని మొదటి పంక్తి ఇది. అయితే మరొక విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ద్వారా ఈ పంక్తులు ప్రాచుర్యం పొందాయి. ఇతను కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాడు. ఈ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్‌‌లో భారతీయ యోధుల కోసం ఆయుధాలు కొనుగోలు చేసేందుకు బ్రిటిషర్ల గూడ్స్, డబ్బుతో నిండిన రైలును దోచుకున్నారు.

6. 'డూ ఆర్ డై' - గాంధీజీ

1942లో రెండో ప్రపంచ యుద్ధ ప్రకటన తర్వాత తమ యుద్ధ ప్రయత్నాలకు భారతీయుల సహకారాన్ని పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వం స్టాఫోర్డ్ క్రిప్స్ మిషన్‌ను భారత్‌కు పంపింది. ఇది ఇంగ్లాండ్ రాజుకు విధేయత చూపవలసిన 'డొమినియన్ హోదా'ను మాత్రమే వాగ్దానం చేసింది. ఈ చర్చలు విఫలమవడంతో స్వాతంత్య్రం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరముందని గాంధీజీకి అర్థమైంది. దీంతో 1942 ఆగష్టు 8న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదాన్(ఆగస్టు క్రాంతి మైదాన్)లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. సమావేశం ముగిసిన తర్వాత వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించిన గాంధీజీ 'డూ ఆర్ డై' నినాదాన్ని వినిపించాడు.

7. 'క్విట్ ఇండియా'- యూసుఫ్ మెహెరల్లీ

గాంధీజీ 'క్విట్ ఇండియా' ఉద్యమానికి పిలుపునిచ్చినపుడు ముంబై మేయర్‌గా కూడా పనిచేసిన సోషలిస్ట్, ట్రేడ్ యూనియన్‌వాది యూసుఫ్ మెహెరాలీ ఈ నినాదాన్ని రూపొందించారు. అంతకుముందు కొన్నేళ్ల కిందటే 1928లో సైమన్ కమిషన్‌ను నిరసిస్తూ 'సైమన్ గో బ్యాక్' అనే నినాదాన్ని కూడా ఆయనే రూపొందించారు. ఈ కమిషన్ భారత రాజ్యాంగ సంస్కరణపై పని చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇందులో భారతీయులు ఎవరూ లేకపోవడంతో దీని పట్ల వ్యతిరేకత పుట్టింది. ఇక కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడైన మెహెరల్లీ.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 

స్వతంత్ర పోరులో.. కీలక పాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్  


Similar News