వింత ప్రవర్తన.. విపరీత ధోరణి.. ‘బైపోలార్ డిజార్డర్’ నుంచి బయటపడేదెలా?
అంతసేపు ప్రశాంతంగా ఉన్న ఒక వ్యక్తి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతున్నాడా? ఏ కారణమూ, సందర్భమూ లేకపోయినా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నాడా? అయితే అతను బైపోలార్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని అనుమానించవచ్చు అంటున్నారు నిపుణులు.
దిశ, ఫీచర్స్ : అంతసేపు ప్రశాంతంగా ఉన్న ఒక వ్యక్తి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతున్నాడా? ఏ కారణమూ, సందర్భమూ లేకపోయినా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నాడా? అయితే అతను బైపోలార్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని అనుమానించవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ తరహా రుగ్మత ప్రపంచ వ్యాప్తంగా పలువురిని వేధిస్తోందని, బాధితులను చూసుకోవడంలో సంరక్షకులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, బర్న్ అవుట్‌కు గురవుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
లక్షణాలు
అవసరం లేకపోయినా అధికంగా డబ్బులు ఖర్చు పెట్టడం, విపరీతమైన లైంగిక వాంఛలను ప్రదర్శించడం, తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం వంటివి బాధిత వ్యక్తిలో కనిపించే సాధారణ లక్షణాలుగా ఉంటాయి. దీంతోపాటు అప్పుడప్పుడూ పిచ్చిగా ప్రవర్తించడం, రాత్రిళ్లు నిద్రపోకపోవడం, అకస్మాత్తుగా డిప్రెషన్‌లోకి వెళ్లడం, ఒక్కోసారి స్పృహకోల్పోవడం జరుగుతుంటాయి. రోజుల తరబడి నిద్రలేకున్నా ఏమాత్రం అలసిపోయినట్లు కనిపించరు. పైగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం ప్రతీ వందమందిలో 20 నుంచి 30 శాతం వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి.
ఎందుకు వస్తుంది?
వైద్య నిపుణుల ప్రకారం.. మెదడులోని డొపమైన్ హార్మోన్లలో ఇంబ్యాలెన్స్ కారణంగా సంభవించే ఒక తీవ్రమైన మానసిక సమస్యే బైపోలార్ డిజార్డర్. ఈ సందర్భంలో బాధిత వ్యక్తుల మానసిక స్థితి లేదా ప్రవర్తన తీవ్రంగా మారుతుంది. బైపోలార్ డిజార్డర్ రెండవ దశను హైపోమానియాగా పేర్కొంటారు. ఎప్పుడూ నిరాశా నిస్పృహలతో బాధపడటం, కారణం లేకుండా ఏడవడం వంటివి ఈ దశలో కనిపిస్తాయి.
సంరక్షకుల్లో బర్న్ అవుట్
బైపోలార్ డిజార్డర్ బాధితులు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థితి ఉండవచ్చు. దీంతో వారిని చూసుకునే కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులు తీవ్రంగా అలిసిపోవడం బర్న్ అవుట్‌కు గురికావడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బయట పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఇంటర్నెట్ లేదా పుస్తకాల ద్వారా తగిన అవగాహన పెంచుకోవచ్చు.
సమస్యను వర్గీకరిస్తూ పరిష్కారం
బైపోలార్ డిజార్డర్ బాధితుల్లో లక్షణాలను, దశలను లేదా ఎపిసోడ్‌లను వర్గీకరించడం ద్వారా సంరక్షకులు వారిని సులభంగా ట్రీట్ చేయవచ్చునని నిపుణులు చెప్తున్నారు. మొదటిది మానిక్ ఎపిసోడ్ : ఈ దశలో బాధితుడిలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. వేగంగా మాట్లాడుతుంటారు. నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇక రెండవ దశ డిప్రెసివ్ ఎపిసోడ్ : ఈ దశలో రోగి బలహీనంగా కనిపిస్తారు. మానసిక స్థితి క్షీణిస్తుంది. ఏ విషయంలోనూ ఆసక్తి చూపరు. చివరి దశ మిశ్రమ ఎపిసోడ్‌లు : ఈ దశలో బాధితులు ఒకే సమయంలో అనేక విధంగా ప్రవర్తిస్తుంటారు. డిప్రెషన్, ఉన్మాదం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిపై అవగాహన ఉంటే సంరక్షకులు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇలా చేయడం బెటర్
లీజర్ వాకింగ్, కుకింగ్, మ్యూజిక్ వినడం, డైలీ యాక్టివిటీస్‌లో టైమ్ స్పెండ్ చేయడం వంటివి సంరక్షకుల్లో అలసటను తీరుస్తాయి. ఫారెన్ కంట్రీస్‌లో అయితే బాధితులను చూసుకోవడానికి కేర్ టేకర్లను పెడుతుంటారు. కానీ ఇండియా వంటి సంప్రదాయ దేశాల్లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 90 శాతం కంటే ఎక్కువ మంది రోగులు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. దీంతో కుటుంబంలో రోగిని చూసుకునేవారు ఇబ్బంది పడుతుంటారు.
నివారణ - చికిత్స
బైపోలార్ డిజార్డర్ ఒక మానసిక వ్యాధి కాబట్టి తప్పక నియంత్రించవచ్చు. బాధితుల్లో కొందరు సహజంగానే ఈ రుగ్మత నుంచి బయటపడుతుంటారు. అందుకోసం వారి మానసిక స్థితి మార్చేందుకు నివారణ చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు బాధితులు కోపంగా ఉంటే కూల్ చేసే వాతావరణం, సంభాషణ వంటివి అవసరం. దీంతోపాటు మెదడు కణాలలోని మూడ్ స్టెబిలైజర్‌ను కౌన్సెలింగ్ ఇవ్వడం, డొపమైన్‌ను సమతుల్యం చేసే చికిత్స అందించడం ద్వారా బైపోలార్ డిజార్డర్‌కు చెక్ పెట్టవచ్చు.