పురుషుల సరసం.. తట్టుకోలేకపోతున్న స్త్రీలు

పురుషులు స్త్రీలతో మాట్లాడే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది.

Update: 2023-05-08 14:49 GMT

దిశ, ఫీచర్స్ : పురుషులు స్త్రీలతో మాట్లాడే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. కొందరు సరదాగా మాట్లాడితే.. మరికొందరు సరసం ఆడినట్లుగా.. ఇంకొందరు అవసరం మేరకు మాత్రమే మాట్లాడొచ్చు. అయితే కాస్త చనువు తీసుకుని మాట్లాడే సందర్భాల్లో కంఫర్ట్‌గా ఫీల్ కానీ మహిళలకు చెడు ఉద్దేశంగా కనిపిస్తాయి. మగాళ్లలో అలాంటి దురుద్దేశం లేకుండా సహజంగా ప్రవర్తించినా తప్పుగా, అనుమానాస్పదంగానే అనిపిస్తుంది.

ఉదాహరణకు ఒక అమ్మాయిని ‘మీరు అందంగా ఉన్నారు. మీ డ్రెస్ బాగుంది. మీరు నవ్వితే మస్త్ ఉంటారు’ అనడం వెనుక ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోయినప్పటికీ చాలామంది మహిళలు పురుషులను అనుమానించడమో, వారికి దూరంగా జరగడమో, మరోసారి పలకరించకపోవడమో చేస్తుంటారు. అయితే ఇందులో స్త్రీల తప్పు కూడా లేదని.. ఇలా ప్రవర్తించేందుకు చాలా కారణాలున్నాయని వివరిస్తున్నారు నిపుణులు.

సాంప్రదాయం.. అనుభవం.. ఆలోచన..

తమతో పురుషులు మాట్లాడుతున్నప్పుడు, కామెంట్ చేస్తున్నప్పుడు వారిని అనుమానించే మహిళలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అప్పుడున్న సామాజిక పరిస్థితుల ప్రభావం, గత అనుభవాలు, పురుషులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పే కుటుంబ సంప్రదాయం.. ఆటోమేటిక్‌గా స్త్రీలలో కొన్ని భయాలు, ఆందోళనలను కలిగిస్తాయి. బయటకు చెప్పకపోయినా సరే మనసులో మాత్రం అప్రమత్తంగా ఉండాలనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. అందుకే పురుషులందరూ పితృస్వామ్య భావజాలంతో, పురుషాధిక్యత ధోరణితో ఉండరని తెలిసినా సరే.. ఒక పురుషుడు స్త్రీపట్ల తన భావాలు వ్యక్తం చేస్తున్నప్పుడు నిష్కల్మషంగా మాట్లాడుతున్నా అందులో మరో కోణాన్ని చూడటం సాధారణం. ఇది జాగ్రత్తలో భాగమేనని, మహిళలను అర్థం చేసుకునే విశాల దృక్పథం ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ట్రామా బేస్డ్ రియాక్షన్ మాత్రమే కానీ పురుషులను కించపరిచే ఉద్దేశం కాదని చెప్తున్నారు.

సమస్యకు కారణమయ్యే పురుషులదే తప్పు..

ఒక మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు విండ్‌షీల్డ్ రిపేర్‌మెన్ వస్తే తాను ఎలా ఉండేదో రెడ్డిట్(Reddit)లో షేర్ చేసింది. ఒకసారి విండ్‌షీల్డ్ రిపేర్ చేసిన వ్యక్తి పని అయిపోయాక విషయం తెలియజేసే ఉద్దేశంతో సదరు మహిళ ఉన్న గది తలుపు తట్టాడు. ఆమె డోర్ తీశాక అతను గౌరవప్రదంగా కొంత వెనక్కి వెళ్లి, తను చేసిన రిపేర్ గురించి వివరించడం ప్రారంభించాడు. అతను మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా కొంచెం దగ్గరగా వచ్చి ఆమెకు ప్రెట్టీ లేడీ అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చాడు. అతనికి చెడు ఉద్దేశం ఏదీ లేనప్పటికీ ఆ వ్యక్తి అలా అనగానే అది ప్రమాదకరమైన సిచ్యువేషన్‌గా భావించింది సదరు మహిళ.

అతను కూడా చెడ్డవాడు కాదని ఆమెకు తెలిసినప్పటికీ వెంటనే అలర్ట్ అయి, అతనితో మాటలు కట్ చేసింది. కారణం ‘పురుషుడు అలా మాట్లాడుతున్నాడంటే ఏమో చెప్పలేం’ అనే అనుమానం. అంతేగాక అతను వేరేలా ప్రవర్తిస్తే ఇంట్లో, చుట్టుపక్కల కూడా కాపాడేందుకు ఎవరూ లేరు కాబట్టి సేఫ్ కాదని గ్రహించింది. అంటే.. ఇక్కడ అతని మాటలు ఆమెను భిన్నంగా ప్రభావితం చేశాయి. ఇలా చేయడానికి కారణం సమాజంలో ప్రాబ్లమేటిక్‌గా ఉన్న పురుషుల వల్ల ఏర్పడిన అనుభవపూర్వక లేదా అవగాహనపరమైన నాలెడ్జ్ మాత్రమే స్త్రీలను అలర్ట్ చేస్తుంది.

సందేహాలు ఎందుకు?

పరిచయం ఉన్నా లేకున్నా క్లోజ్‌గా మాట్లాడుతున్నప్పుడు పురుషులందరినీ ఎందుకని ఒకే దృష్టితో చూస్తారని మానసిక నిపుణులు ప్రశ్నించగా.. ఒకప్పుడు ట్యాక్సీ డ్రైవర్ నుంచి ఎలా తప్పించుకోవలసి వచ్చిందో ఆ మహిళ వివరించింది. అప్పటి నుంచి ఆ పరిస్థితి భయానక జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పింది. అందుకే తనతో మాట్లాడే పురుషుడు మంచి వ్యక్తి అని తెలిసినా అతన్ని అనుమానించింది. పురుషుల సమస్యాత్మకమైన చూపులు (Problematic gaze), వెంబడించడం, వెరైటీగా పిలవడం (cat-calling), దాడి చేయడం, మానిప్యులేట్ చేయడం వంటి అనేక చెడు అనుభవాలు స్త్రీలను జీవితాంతం బాధిస్తాయి. అలాంటి అనుభవాలు, అవగాహన, సమాచార వ్యాప్తి వల్ల ఇతర స్త్రీలు కూడా అప్రమత్తతో తమను తాము సేఫ్ జోన్‌లో ఉండేలా ఒక అభిప్రాయాన్ని, భావజాలాన్ని ఏర్పర్చుకోవడం చేస్తుంటారు.

వింత ప్రవర్తనల వెనుక ఉద్దేశాలు

ఒక పురుషుడు బార్‌లో తన వద్దకు వచ్చిన ప్రతిసారీ, అతను మరింత డ్రింక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అక్కడుండే డ్యాన్సర్, రిసెప్షనిస్ట్ అనుకోవడం సహజం. అలాగే ఒక పురుషుడు తనను అనుసరించిన ప్రతిసారీ, అతను తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? అని ఆ పరిస్థితిలో చిక్కుకున్న మహిళ అనుకోవడం సహజం. అంతేకాదు కొందరు మహిళలు ఫోన్ నెంబర్ అడిగినా, వారు పడేసుకున్న పర్సు తిరిగి ఇవ్వడానికి వెళ్లినా పురుషులను అనుమానిస్తారు. అలర్ట్ అవుతుంటారు. ఇలాంటి ప్రవర్తన, హెచ్చరికలు నేర్పింది సమాజంలో నెలకొన్ని పితృస్వామ్య భావజాలమే.

ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు చులకన చేయబడుతున్నంత కాలం, అసమాన ధోరణి పోయినంత కాలం మహిళలు అప్రమత్తంగా ఉండకుండా ఉండలేరు. ఈ అలర్ట్‌నెస్‌లో భాగంగా భయాలు, పురుషులపట్ల అనుమానపు చూపులు కూడా ఉంటూనే ఉంటాయి. సమాజం బాగుపడటానికి, స్త్రీలలో సందేహాలు, భయం తగ్గడానికి ఇంకా సమయం పట్టవచ్చు. అప్పటి వరకు పురుషులను అవమానించే ప్రవర్తనే తమకు సురక్షితమైన, సౌకర్యవంతమైనదిగా భావించడాన్ని అర్థం చేసుకోవాలి తప్ప, తప్పు పట్టలేమని సామాజిక కోణంలో ఆలోచించిన వారికి అర్థం అవుతుంది.

Also Read:

జాయింట్ ఎకౌంట్ ఉన్న దంపతుల మధ్యే ప్రేమ ఎక్కువ.. 

Tags:    

Similar News