Health Tips : మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా?.. ఇక మీరు చేయాల్సింది ఇదే!

కాసేపటి తర్వాత వర్షం వచ్చే అవకాశం ఉందని మనం ముందుగానే గెస్ చేస్తాం. ఎందుకంటే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వాతావరణం చల్లబడుతుంది. గాలులు వీస్తుంటాయి.

Update: 2024-08-24 08:41 GMT

దిశ, ఫీచర్స్ : కాసేపటి తర్వాత వర్షం వచ్చే అవకాశం ఉందని మనం ముందుగానే గెస్ చేస్తాం. ఎందుకంటే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వాతావరణం చల్లబడుతుంది. గాలులు వీస్తుంటాయి. అంటే ఈ సంకేతాలను బట్టి అలర్ట్ అవుతాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మెదడు మనకు సూచనలు పంపుతుంది. అలాగే మనం బాగా అలసిపోయినప్పుడో, మానసిక ఒత్తిడికి లోనైనప్పుడో, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నప్పుడో కూడా శరీరం అందుకు సంబంధించిన సిగ్నల్స్‌ను ముందుగానే పంపుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వాటిని బట్టి జాగ్రత్త పడాలంటున్నారు. అయితే మనం లాంగ్ బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు బాడీ ఎలాంటి సిగ్నల్స్ పంపుతుందో ఇప్పుడు చూద్దాం.

కొన్నిసార్లు వివిధ పనుల్లో బిజీ అయిపోతుంటాం. పని ఒత్తిడి కారణంగా త్వరగా అలసిపోతుంటాం. ఆ సమయంలో కాసేపు రెస్టు తీసుకుంటే.. మళ్లీ రీ ఫ్రెష్ అవుతాం. తిరిగి వర్క్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. ఇదంతా శరీరంలో జరిగే ప్రక్రియలకు సంబంధించిన సంకేతాలు లేదా లక్షణాలుగా పేర్కొంటున్నారు నిపుణులు. అయితే చాలా మంది తీవ్రమైన అలసట, తలనొప్పి, కళ్ల మసకబారడం వంటి బాడీ సిగ్నల్స్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల మరింత స్ట్రెస్ పెరగడం, క్రమంగా మెంటల్ యాంగ్జైటీ, ఆ తర్వాత కూడా నెగ్లెక్ట్ చేస్తే డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.

అలాగే ఇమ్యూనిటీ పవర్ తగ్గడం కారణంగా అనారోగ్యాలకు గురికావచ్చు. కాబట్టి శరీరంలో కనిపించే హెల్త్ పరమైన ప్రారంభ సంకేతాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తే శారీరక సంకేతాలు లేదా లక్షణాలు ఎలా ఉంటాయో సూచిస్తున్నారు. వీటిని గుర్తించడం ద్వారా మనం ముందుగానే అలర్ట్ కావచ్చునని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే మీకు వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ అవసరమని సూచిస్తున్నారు.

శ్వాసలో ఇబ్బందులు : ఎక్కువగా టెన్షన్‌కు గురైనప్పుడు లేదా వర్క్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అది ఇండైరెక్ట్‌గా లంగ్స్‌పై ఎఫెక్ట్ చూపుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ సందర్భంలో శ్వాస అందకపోవడం, రెస్పిరేషన్ రేట్‌లో అనుకోకుండా హెచ్చు తగ్గులు సంభవించడం కూడా కొందరిలో కనిపిస్తాయి. క్రమంగా ఇది ఆస్తమాకు దారితీస్తుంది. కాబట్టి మీ శరీరంలో ఈ విధమైన శ్వాస ప్రక్రియలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే పని నుంచి విశ్రాంతి, అలాగే హెల్త్ పరమైన జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి మరికొన్ని శారీరక లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఆహారపు అలవాట్లలో మార్పులు : రెస్ట్ లెస్‌గా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆకలిపై ప్రభావం చూపుతుంది. అంటే సమయం మించిపోతున్నా ఆకలి వేయకపోవడం లేదా అతిగా ఆకలి వేయడం, అలాగే తింటున్నప్పుడు చాలా తక్కువగా లేదా అతిగా తినడం వంటి లక్షణాలు కనిపిస్తే మీరు ఏదో అనారోగ్యం బారిన పడుతున్నట్లు లేదా మీకు దీర్ఘకాలిక విరామం అవసరం ఉందని మీ శరీరం సంకేతాలిస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతికూల ఆలోచనలు : రోజువారీ కార్యకలాపాల్లో మీరు అలసిపోవడంవల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో ఆందోళన, కుంగుబాటు పెరుగుతాయని, క్రమంగా అవి ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కండరాలపై ఒత్తిడి కూడా మెంటల్ హెల్త్‌ను ప్రభావితం చేస్తుంది. దీంతో అధిక ఆందోళన, అధిక రక్తపోటు వంటివి సంభవించవచ్చు. క్రమంగా ప్రతీ విషయంలో ఓవర్ థింకింగ్, ఓవర్‌గా రియాక్ట్ అవడం, ఎదుటి వ్యక్తులు ఏదైనా చిన్నగా మాట్లాడుకుంటే తన గురించే అని భ్రమ పడటం, అనుమానించడం వంటివి లక్షణాలు డెవలప్ అవుతాయి. కాబట్టి అతి ఆలోచనలు మీలో కనిపిస్తున్నాయంటే మీ శరీరానికి విశ్రాంతి చాలా అవసరం.

శక్తి హీనంగా అనిపించడం : మనం ఒక పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలంటే శారీరకంగా, మానసికంగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. కానీ ఉద్యోగం, వ్యాపారం లేదా వివిధ పనులవల్ల మానసిక ఒత్తిడికి గురైన సందర్భాల్లో అందుకు భిన్నమైన సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. శరీరం బలహీనంగా లేదా శక్తి హీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిద్రలేమి, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వంటివి కూడా జరగవచ్చు. మీ శరీరం ఈ సంకేతాలను పంపిందంటే వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణ క్రియలో మార్పులు : వర్క్‌లో పడి టైమ్‌కు తినకపోవడం, అలాగే పని ఒత్తిడి పెరగడం వంటివి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ప్రాబ్లం ఏర్పడ్డాక సమయానికి తిన్నా, సరిగ్గా తిన్నా ఒక్కోసారి మెటబాలిక్ సిస్టం పనితీరు మందగిస్తుంది. అట్లనే కడుపులో ఉబ్బరం, స్టమక్ పెయిన్, మలబద్ధకం, వాంతులు విరేచనాలు వంటివి లక్షణాలు కూడా సంభవించవచ్చు. కాబట్టి శరీరం అటువంటి సిగ్నల్ పంపితే మీ శరీరానికి రెస్ట్ అవసరం. ఆ తర్వాత సింప్టమ్స్‌ను బట్టి వైద్య నిపుణులను సంప్రదిస్తే తగిన సూచనలు ఇస్తారు. 

Tags:    

Similar News