Health Tips: ఇండ్లల్లో పెంచే కుక్కలు, పిల్లులతో జాగ్రత్త.. వాటితో సావాసం ఈ వ్యాధికి కారణం కావచ్చు

Health Tips: ఇండ్లల్లో పెంచే కుక్కలు, పిల్లులతో జాగ్రత్త.. వాటితో సావాసం ఈ వ్యాధికి కారణం కావచ్చు

Update: 2024-10-01 09:18 GMT

దిశ, ఫీచర్స్ : కుక్క కరిస్తే మాత్రమే రేబిస్ వ్యాధి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది పిల్లులు, రేబిస్ వైరస్ సోకిన కుందేళ్లు, ఇతర జంతువులు నోటితో కరిచినా, వాటి గోళ్లు మనుషుల శరీరంపై గీసుకుపోయినా వ్యాపిస్తుందని జంతువైద్య నిపుణులు చెప్తున్నారు. నిజానికి రేబిస్ ఒక భయంకర వ్యాధిగా చెప్పవచ్చు. ఎందుకంటే వరల్డ్ సర్వే డేటా ప్రకారం ఇది ప్రపంచ వ్యాప్తంగా వందశాతం మరణాలతో ముడిపడి ఉంది. అందుకే జంతు ప్రేమికులు తగిన శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కేరింగ్ ముఖ్యం

చాలా మంది పెంపుడు జంతువులను తమ కుటుంబంలో ఒక భాగంగా భావిస్తారు. ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా ‘పెట్ డాగ్ పేరెంటల్ కల్చర్’ బాగా పెరిగిపోతోందని కూడా పలువురు పేర్కొంటున్నారు. అయితే కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ఇంకా ఏ జంతువులైనా సరే వాటి యజమానులు చాలా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా వాటికి టీకాలు వేయించడం, ప్రవర్తనలో మార్పులు గమనిస్తే జంతు వైద్యుల వద్దకు తీసుకెళ్లడం చేయాలి. ఎందుకంటే పెంపుడు జంతువులు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

జంతువుల ఇంటరాక్ట్‌తో రేబిస్ 

ముఖ్యంగా జంతువులను బయటకు వదిలినప్పుడో, యజమానులు గమనించనప్పుడో అవి తమ తోటి ఇతర జంతువులతో ఇంటరాక్ట్ అవుతుంటాయి. సరదాగా ఆటలాడే సందర్భంలో పరస్పరం గోళ్లతో గీరుకోవడం, పళ్లతో కొరకడం వంటివి జంతువుల మధ్య సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో అవతలి జంతువులకు రేబిస్ వైరస్ సోకి ఉండి ఉంటే గనుక వీటికి సోకి ఉంటుంది. కానీ యజమానులు గమనించే అవకాశం తక్కువ. అందుకే పెట్‌డాగ్స్‌ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు సంభవిస్తే వెంటనే జాగ్రత్త పడాలని నిపుణులు చెప్తున్నారు.

నాడీ వ్యవస్థపై ప్రభావం

రేబిస్ సోకిన జంతువులు ప్రారంభంలో వింతగా ప్రవర్తిస్తుంటాయి. సరదాగా అలా చేస్తున్నాయని భావిస్తే వాటి కాటుకు గురికావచ్చు. అవి చేతిగోళ్లతో యజమానులను లేదా వాటితో ఆడుకునే పిల్లలను గాయపర్చవచ్చు. అలాంటప్పుడు అనుకోకుండా రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ వ్యాధి నేరుగా మానవ మెదడుపై, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫీవర్, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, వికారం, నీళ్లను చూస్తే అసహ్యం లేదా భయం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువుల కాటుకు గురైనప్పుడు ఈ లక్షణాలు గుర్తిస్తే గనుక వెంటనే అలర్ట్ అవ్వాలని, వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయడం బెటర్

రేబిస్‌తో ఉన్న కుక్క లేదా ఇతర జంతువు కాటువేస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఆలోగా కుక్క లేదా పిల్లి అది ఏం జంతువైనా సరే కరిచినప్పుడు గాట్లు పడితే ఆ భాగాన్ని కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు ప్రవహించే నీటిలో లేదా వాటర్ ట్యాప్ ఆన్ చేసి డిటర్జంట్‌ సోప్‌తో శుభ్ర పర్చాలని జంతు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇలా చేస్తే జంతువుల లాలాజలంలో ఉన్న రేబిస్ క్రిములు గాయపడిన భాగం నుంచి తొలగిపోతాయి. దీనివల్ల వైరస్ సోకే ముప్పును అడ్డుకున్నవారవుతారు. ఆ తర్వాత వెంటనే దగ్గరలో ఉండే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. అయితే పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలు, పిల్లుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 


Similar News