Hair Fall : బట్టతల సమస్య పురుషుల్లోనే ఎందుకు వస్తుంది?.. అసలు కారణం అదేనా!
ప్రస్తుతం చాలామంది పురుషులను మానసికంగా ఇబ్బంది పెడుతున్న వాటిలో బట్టతల సమస్య ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య పురుషుల్లోనే ఎక్కువ అని చెప్తుంటారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం చాలామంది పురుషులను మానసికంగా ఇబ్బంది పెడుతున్న వాటిలో బట్టతల సమస్య ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య పురుషుల్లోనే ఎక్కువ అని చెప్తుంటారు. స్త్రీలలో కూడా జుట్టు రాలే సమస్య ఉంటున్నప్పటికీ.. బట్టతల సమస్య మాత్రం దాదాపు ఉండదు. అయితే ఇది కేవలం పురుషుల్లో మాత్రమే ఎందుకు వస్తుందనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిరూపించదగ్గ కచ్చితమైన పరిశోధనలైతే లేవు కానీ.. ఆరోగ్య నిపుణుల ప్రకారం పురుషుల్లో బట్టతల సమస్యలకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
* మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు జుట్టు రాలే సమస్యకు లేదా బట్టతల సమస్యకు కారణం అవుతున్నాయి. స్త్రీలలో కాకుండా పురుషుల్లోనే ఎందుకని ఈ ప్రాబ్లం ఉంటుందంటే.. సామాజిక, ఆర్థిక, కుటుంబ నిర్వహణ బాధ్యతల పరంగా ఎక్కువ టెన్షన్స్ పురుషులు అనుభవిస్తారట. దీంతో మెదడులో హార్మోన్ల విడుదలలో ఆటంకం, సమతుల్యత లోపించడం వంటివి జరుగుతాయని, దీనికి తోడు ఆల్కహాల్ అలవాటు కూడా బట్టతల సమస్యను మరింత పెంచేందుకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
* బట్టతల సమస్యకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతోపాటు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. వంశపారంపర్యంగా బట్టతల సమస్య వచ్చే చాన్స్ ఉంటుంది. అలాగే శరీరంలో తగినంత వాటర్ కంటెంట్ నిరంతరం లేకపోవడంవల్ల కూడా బట్టతల సమస్య వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల జుట్టు పొడిబారడం, రాలిపోవడం జరిగిపోతుంటాయి. కొందరు అధిక బరువు తగ్గడానికి డైట్ పాటిస్తుంటారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్ డి, సి, ఐరన్, జింక్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే కూడా జుట్టుకు తగిన పోషకాలు అందవు. దీంతో బట్టతల సమస్య రావచ్చు.
* పురుషుల్లోనే జుట్టు రాలే సమస్య కనిపించడానికి గల ప్రధాన కారణం హార్మోన్లు, విటమిన్ల లోపం, అనారోగ్యాలు, మానసిక రుగ్మతలు, టెన్షన్స్ వంటి వాటికి తోడుగా స్త్రీలతో పోలిస్తే జుట్టు సంరక్షణ విషయంలో అంత పట్టింపు ఉండదని, దీనికి తోడు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు బట్టతల రావడానికి ప్రేరణగా ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వంశపారంపర్యంగా వచ్చే బట్టతల సమస్యకైతే సొల్యూషన్ లేదనే చెప్పాలి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.