Green Fish Fry : దసరా స్పెషల్.. పచ్చి చింత కాయలతో చేపల వేపుడు.. తింటే అస్సలు వదలరు!
Green Fish Fry : దసరా స్పెషల్.. పచ్చి చింత కాయలతో చేపల వేపుడు.. తింటే అస్సలు వదలరు!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కడ చూసినా దసరా పండుగ సందడి కనిపిస్తోంది. కొత్తబట్టల కొనుగోలు, సొంతూళ్లకు ప్రయాణాల గురించి పలువురు చర్చించుకుంటున్నారు. ఇంకొందరు ఈ పండక్కి ఎప్పుడూ చేసే ముర్కులు, సకినాలు, కారపు పూసలు వంటివి కాకుండా రోజుకో వెరైటీ వంటకాలేం చేద్దామని ఆలోచించే వారు కూడా ఉన్నారు. అలాంటి వారికో అద్భుతమైన రెసిపీ ఐడియా ఉందంటున్నారు పాకశాల నిపుణులు. ఏంటంటే.. పచ్చి చింతకాయలతో గ్రీన్ ఫిష్ ఫ్రై. నాన్ వెజ్ ప్రియులు దీనిని ఒక్కసారి తింటే అస్సలు వదలరు. అంత రుచిగా ఉంటుంది మరి!
నిజానికి చింతకాయలు, చేపలు ఇవి రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇక నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడేవారికైతే చేపల వేపుడు గుర్తుకొస్తేనే నోరూరుతుంది. కాబట్టి ఈ దసరా పండుగ సెలవుల్లో ఏదో ఒకరోజు దీనిని ట్రై చేసి రుచి చూసే అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం? కాబట్టి ఈ గ్రీన్ ఫిష్ ఫ్రైర రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం.
కావాల్సిన పదార్థాలు : ఐదు చేప ముక్కలు, నాలుగు పచ్చి చింతకాయలు, రెండు స్పూన్ల నూనె, ఒక పచ్చి మిర్చి, అర స్పూను జీలకర్ర, ఒక ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను పసుపు, ఒక స్పూను కారం.
తయారీ విధానం : ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఆరే వరకు పక్కన పెట్టాలి. తర్వాత పచ్చి చింతకాయలను తీసుకొని కడిగి వాటిపై చెక్కును తీసి వేయాలి. ఆ తర్వాత పచ్చి చింత కాయలను, ఉల్లిపాయ ముక్కలను, పచ్చి మిర్చిని జీలకర్రవేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి. అందులోనే ఉప్పు కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. అలా తీసుకున్న మిశ్రమంలో కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఇదంతా అయ్యాక పక్కన పెట్టుకున్న చేప ముక్కలకు, పచ్చి చింతకాయల మిశ్రమాన్ని పట్టించాలి. పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టి మ్యారినేట్ చేయాలి. నూనె గరం అయ్యాక మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇక అంతే.. పుల పుల్లగా, కారం కారంగా రుచికరమైన చింతకాయ చేపల వేపుడు రెడీ అయినట్లే. ఇక చింత కాయల్లో, చేపల్లో ఉండే విటమిన్లు, వివిధ పోషకాల కారణంగా ఈ చింతకాయ చేపల వేపుడు రెసిపీ తినడంవల్ల ఒత్తిడి, ఆందోళన, చర్మ సమస్యలు వంటివి దూరం అవుతాయి.