మగవారికి గర్భనిరోధక మాత్రలు.. త్వరలో హ్యూమన్ ట్రయల్స్

బర్త్ కంట్రోల్ అనేది ఆడ, మగ ఇద్దరి బాధ్యత.

Update: 2023-02-17 12:38 GMT

దిశ, ఫీచర్స్: బర్త్ కంట్రోల్ అనేది ఆడ, మగ ఇద్దరి బాధ్యత. కాగా 1960ల నుంచే మహిళల గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని విప్లవాత్మకంగా మార్చాయి. ఈ క్రమంలోనే ఇప్పటికీ మగవారికి కాంట్రాసెప్టివ్ పిల్స్ లేకపోవడంపై దీర్ఘకాలికంగా విమర్శలు వస్తున్నాయి. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు దీనిపై పని చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు విజయవంతమైనట్లు ప్రకటించారు. మగవారి గర్భనిరోధక మాత్ర ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్లు తెలుపుతూ.. దీన్ని 'గేమ్ ఛేంజర్' గా అభివర్ణించారు.


వెయిల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకులు 'TDI-11861' అనే ఇన్హిబిటర్ ఒక మోతాదు ఎలుకలలో రెండున్నర గంటల వరకు స్పెర్మ్‌ను నిశ్చలంగా ఉంచుతుందని కనుగొన్నారు. తమ ప్రయోగాల్లో మగ ఎలుకలు సాధారణ సంభోగం ప్రవర్తనను చూపించాయని, మెడిసిన్ తీసుకున్న తర్వాత 52 వేర్వేరు ఆడ ఎలుకలతో సంభోగం జరిగినా అవేవీ గర్భం దాల్చలేదని తెలిపారు.


సోల్యుబుల్ అడెనైల్ సైక్లేస్ (sAC) అనే ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా ఇలా జరుగుతుందని వివరించారు. అయితే మూడు గంటల తర్వాత ఎలుకలలోని స్పెర్మ్ చలనశీలతను తిరిగి పొందడం ప్రారంభించిందని, 24 గంటల్లో స్పెర్మ్ దాదాపు అన్ని సాధారణ కదలికలు పునరుద్ధరించబడతాయని పేర్కొన్న శాస్త్రవేత్తలు.. ఇక ఈ మాత్ర తీసుకున్న 30 నిమిషాల నుంచి గంటలోపు పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. అంటే పురుషులు సెక్స్‌కు కొద్దిసేపటి ముందు తీసుకోగల మాత్రకు మార్గం సుగమం అయిందని, త్వరలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News