Special Story: మోడుబారుతున్న పల్లెలు.. పార్ట్ టైం జాబ్‌లా వ్యవసాయం

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అని మహాత్మాగాంధీ ఇచ్చిన నినాదం తెలంగాణలో పూర్తిగా కనుమరుగు కానున్నది.

Update: 2024-09-22 12:13 GMT

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అని మహాత్మాగాంధీ ఇచ్చిన నినాదం తెలంగాణలో పూర్తిగా కనుమరుగు కానున్నది. రానున్న రోజుల్లో పల్లెలన్నీ ఖాళీ కాబోతున్నాయి. ప్రధానమైన రహదారికి కొద్ది దూరంలో ఉండే గ్రామాల ప్రజలు.. ఉన్న ఇండ్లను వదిలేసి రోడ్డును ఆనుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. దీంతో అసలు ఊరు ఖాళీ చేసిన ఇళ్ల మొండిగోడలు మినహా మనిషి అన్నవారే కనిపించకుండా పోయే పరిస్థితి కనిపించనున్నది. నిజానికి దేశ జనాభాలో 80 శాతం వ్యవసాయదారులే. వీరిలో రైతులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. కానీ, ఉన్న ఊళ్లో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటం.. నగర జీవనశైలి, పిల్లల చదువులు, ఉపాధిమార్గాలు వెతుక్కుంటూ పల్లెవాసులు నగరాలకు తరలుతున్నారు. ఊళ్లో ఏం ఉన్నది? అనుకుంటూ పట్టణాలు, నగరాలకు వచ్చి.. వాచ్ మెన్, అడ్డా కూలీలుగా అవతారమెత్తుతున్నారు. సొంతూళ్లో కూర్చుని గంజి తాగడం కంటే నగరాల్లో పరిగెత్తుతూ పాలు తాగడం మంచిది అన్న అభిప్రాయం అందరిలో కలుగుతున్నది. పల్లె వాతావరణం కనుమరుగు అయ్యేందుకు మరెంతో కాలం లేదన్నది మాత్రం కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవం.. పల్లెలు కన్నీరు పెడుతున్న పరిస్థితులపై ప్రత్యేక కథనం..

- శ్రీనివాస్ బొల్లబత్తిని

వ్యవసాయంపై తగ్గుతున్న ఆసక్తి

గతంలో వ్యవసాయానికి మనుషుల కొరత ఉండేదికాదు. నేడు భూమి కౌలుకు ఇవ్వడం పెరిగింది కానీ, గతంలో ఎవరికివారే పొలం చేసుకునేవారు. దీంతో పొలం పనులకు మనుషులు అవసరం అయితే, ఊళ్లో నలుగురైదుగురిని అడిగితే కనీసం ఇద్దరు ముగ్గురన్నా వచ్చేవారు. మళ్లీ వాళ్లకు ఏదైనా అవసరం వస్తే వీళ్లు సాయపడేవారు. దీంతో యంత్రాలతో అవసరం లేకుండా అందరూ సమిష్టిగా పనులు చేసుకునేవారు. ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి వ్యవసాయ పనికి యంత్రాలు రావడంతో మనుషులతో పని అవసరమే లేకుండాపోయింది. పైగా మానవ సంబంధాలు కూడా తగ్గిపోవడంతో ఆర్థికంగా భారమే అయినా.. యంత్రాలపై ఆధారపడటం పెరిగిపోయింది. అదే సమయంలో వ్యవసాయం చేసే కుటుంబాల సంఖ్య చాలా తగ్గుతున్నది. ప్రస్తుత తరంలో ఊళ్లలో వ్యవసాయం చేసే వారిలో 25ఏండ్లలోపువారు ఒక్కరు కూడా ఉండటం సందేహమే. అంతగా వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి తగ్గిపోయింది. అందరూ చదువుకుని ఉద్యోగాలు చేసుకోవడమే మంచిది అన్న భావనలో ఉన్నారు. ఫలితంగా రైతులు కూడా తమ పిల్లలను వ్యవసాయం వైపు ప్రోత్సహించడం లేదు. ఉన్న భూమిని కౌలుకు ఇవ్వడమో లేకపోతే అమ్మేసి పట్టణాల్లో ఉంటూ పిల్లలను చదివించుకుంటూ చిన్నాచితక పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు.

వ్యవసాయ పనిముట్ల ఆనవాళ్లేవి?

60, 70 దశకాల్లో వాడిన వ్యవసాయ పనిముట్లు 90వ దశకం వరకు కూడా ప్రతి గ్రామంలో నిత్యావసరాలుగానే ఉండేవి. కానీ, 2024నాటికి ఆ పనిముట్ల ఆనవాళ్లు కూడా కనిపించకుండాపోయాయి. వాటిని ఈ తరం వారు ప్రత్యక్షంగా చూడటం దాదాపుగా అసాధ్యమే. బావిలో బిందెలు పడితే తీసే పాతాళగరిగెలు ఇప్పటితరానికి తెలిసే అవకాశమే లేదు. అంతెందుకు అసలు బావులు వాటికి గిరకలు కూడా ఇప్పటికి తరానికి వింతైన విషయాలే మరి. నిజానికి నాటి సామాజిక జీవన విధానం ఎంతో ఆదర్శంగా ఉండేది. పల్లె ప్రజలు ప్రతి విషయంలోనూ ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకునేవారో.. ఆపతికి, సోపతికి ఎలా కలిసిపోయేవాళ్లే అప్పటి వాళ్లకే బాగా తెలుసు. అయితే.. పరిస్థితులు పూర్తిగా మారిపోయి రోజురోజుకూ పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి. పిల్లల చదువు నిమిత్తం కొందరు.. ఉపాధి లేక మరికొందరు పట్టణాల బాట పడుతున్నారు. తాజాగా.. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

సర్వే నివేదిక ఇలా..

కేంద్ర వైద్యారోగ్య శాఖ ‘హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23’ని ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2011 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణలో గ్రామీణ జనాభా -7.84 శాతం తగ్గింది అదేసమయంలో పట్టణ జనాభా 34.05 శాతం పెరిగిందని వెల్లడించింది. పల్లెల్లో జనాభా 2011లో 2,15,85,313 ఉండగా 2023లో 1,98,92,000కి తగ్గిపోయింది. 2011లో పట్టణ జనాభా 1,36,08,665 ఉండగా.. 2023కు అది 1,82,43,000 పెరిగింది. జనసాంద్రత అంకెలు చూస్తే పల్లెలన్నీ అవసానదశలోనే ఉన్నాయన్న భావన కలుగుతుంది. తెలంగాణలో ఒక చదరపు కిలోమీటరుకు 386మంది ఉంటే.. పల్లెల్లో 210మందే అదే పట్టణాల్లో 4884మంది ఉన్నారు. ఏపీలో 2011లో జనాభా మొత్తం 4,93,86,799 ఉంటే 2023నాటికి 5,32,17,000కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 2011లో 3,47,76,389 మంది ఉంటే పట్టణాల్లో 1,46,10,410 మంది ఉన్నారు. 2023లో గ్రామీణ ప్రాంతాల్లో 3,37,00,000 మంది ఉంటే పట్టణాల్లో 1,95,17,000 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పల్లెలు అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నాయనడానికి ఇది నిదర్శనం. ఏపీలో చదరపు కిలోమీటరుకు మొత్తం 327మంది ఉంటే పట్టణాల్లో 4738మంది ఉంటే పల్లెల్లో 212మంది ఉన్నారు.

వలసలకు కారణాలు..

పల్లెల్లోని రైతులు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తట్టుకోలేకపోతున్నారు. అతివృష్టి వచ్చినా.. అనావృష్టి వచ్చినా వ్యవసాయం కకావికలం అయిపోతున్నది. వ్యవసాయంపై ఆధారపడిన వేలమంది రైతులు గ్రామాలు వదిలేసి ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వలస వెళ్లిపోతున్నారు. అది బెంగుళూరు అయినా కేరళ అయినా హైదరాబాద్ అయినా.. కేవలం బతకటానికే బయలుదేరుతున్నారు. తెలంగాణ నుంచి వలసలు 1930 నుంచే ప్రారంభమయ్యాయి. అయితే.. 1970 నుంచి జరిగిన అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరిగిన మార్పులు, చమురు ధరలు పెరగడం అంతర్జాతీయంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పలు వలసలను మరింత ప్రోత్సహించాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్, కరీంనగర్‌తోపాటు కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ధర్మపురి, నిజామాబాద్‌తోపాటు ఆర్మూర్, కామారెడ్డి, కమ్మర్‌పల్లి వంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కూలీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. దాదాపు పది లక్షల మంది ఇప్పుడు తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్నారు.

తగ్గిపోతున్న ఆహార ఉత్పత్తులు

రైతులు పల్లెలను వదిలి వెళ్తుండడంతో వ్యవసాయం చేసే వారి సంఖ్య కూడా తగ్గుతున్నది. దీంతో లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి సామాన్యుడు బతకలేని పరిస్థితికి వచ్చింది. పూర్వం రైతులు వరి, పెసర, కంది సజ్జలు, నువ్వులు, ఉలవలు, రాగులు, మినుములు పజ్జొన్నలు, ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు, మక్కజొన్న, బుడ్డ శనగలు, అలసంద, గోధుమ తదితర పంటలు సాగు చేసేవారు. ఈ సంప్రదాయ వ్యవసాయం వల్ల పల్లెల్లో గ్రామీణ స్వయంపోషక విధానం ఉండేది. కానీ.. ఇప్పుడు చిరుధాన్యాలు, ఆరుతడి పంటల సాగు తగ్గిపోయింది. దీంతో మనం చిరుధాన్యాలు, పప్పు దినుసులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పెరుగుతున్న హాఫ్ ఫార్మర్స్

మరోవైపు.. రాష్ట్రంలో హాఫ్ ఫార్మర్స్ సంస్కృతి చాలా వరకు పెరిగిపోతున్నది. అంటే.. పిల్లల చదువు నిమిత్తం లేదా ఉపాధి నిమిత్తం పెద్దపెద్ద నగరాలకు వలస వచ్చిన రైతులు.. తమ పల్లెల్లోని వ్యవసాయాన్ని కొందరు అలాగే కొనసాగిస్తున్నారు. అయితే.. వారంలో వారు ఐదు రోజులు సిటీల్లో ఉంటే.. మరో రెండు రోజులు పల్లెలకు వెళ్లి వ్యవసాయం చూసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఉన్న భూమిని అమ్ముకోలేక.. కౌలుకు ఇచ్చేస్తున్నారు. సొంత భూమిని చూసుకునేందుకు మాత్రం ఎప్పుడో వీలు చిక్కినప్పుడల్లా గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. రైతులు సొంతూరిలో ఉంటే వరి వంటి ప్రధాన సాగుతోపాటు చెలకలు పెరడులో ఉద్యానపంటలు వేసేవారు. బర్రెలు, ఆవులను పోషించేవారు. దీంతో కూరగాయలు, పాల ఉత్పత్తులకు పల్లెల్లో లోటు లేకుండా ఉండేది. కానీ, ఇప్పుడు వ్యవసాయమే పార్ట్ టైమ్ ఉద్యోగంగా మారడంతో ఉద్యానపంటలు, పాడిపోషణలకు అవకాశమే లేకుండా పోతున్నది.. ఫలితంగానే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

కార్పొరేట్ కబ్జాలోకి వ్యవసాయం!

ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని.. రైతులకు లబ్ధిచేకూర్చే పథకాలు తీసుకురాకపోతే భవిష్యత్తులో వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకోవడం మానివేశాయి. భవిష్యత్తులో ఇదే కొనసాగితే రైతుల భూములు కార్పొరేట్ కంపెనీలు గంపగుత్తగా భూముల్ని ఆక్రమించి.. వ్యవసాయాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. రంగురంగుల ప్యాకెట్లలో ఉత్పత్తులను ఆకర్షణీయంగా కనిపించేలా చేసి దేశప్రజలను దోచుకుంటాయి. పరిస్థితి అక్కడిదాకా రాకుండా ప్రభుత్వాలే అప్రమత్తం కావాలి. రైతును కాపాడేలా చట్టాలు తేవడమే కాకుండా వారికి అవగాహన కల్పించేలా వ్యవస్థలు పనిచేయాలి.


Similar News