నార్మల్ డెలివరీ కావాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటించండి..
గర్భిణీ స్త్రీలు 9 నెలలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ దినచర్యను సక్రమంగా నిర్వహిస్తే ఆరోగ్యకరమైన గర్భధారణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దిశ, ఫీచర్స్ : గర్భిణీ స్త్రీలు 9 నెలలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ దినచర్యను సక్రమంగా నిర్వహిస్తే ఆరోగ్యకరమైన గర్భధారణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రసవ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా సాధారణ ప్రసవానికి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. అందుకే గర్భధారణ సమయంలో యోగా ఖచ్చితంగా చేయాలంటున్నారు. మరి ఆ యోగాసనాలు ఏంటి, ఏలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాణాయామం..
గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా మానసిక ఆందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతమైన గర్భం పొందాలంటే ప్రతి రోజూ ఉదయం కొన్ని నిమిషాల పాటు భ్రమరి, అనులోమ్-విలోమ్ వంటి ప్రాణాయామం చేయాలని చెబుతున్నారు. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
సీతాకోకచిలుక భంగిమ..
గర్భధారణ సమయంలో స్త్రీలు సీతాకోకచిలుక ఆసనం చేయడం చాలా ముఖ్యమట. ఈ ఆసనం తుంటి, తొడల కండరాలకు వశ్యతను అందిస్తుంది. పునరుత్పత్తి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరం, నడుము నొప్పి, అలసట వంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మలసానా..
మలసానాను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది గర్భధారణ సమయంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, మీ శరీరాన్ని ప్రసవానికి కూడా సిద్ధం చేస్తుంది. ఈ ఆసనం చేస్తున్నప్పుడు, వెన్నెముక, కడుపు, తొడలు, కటి ప్రాంతం కండరాలు సాగుతాయి.
శవాసనం..
ఈ ఆసనం చేస్తున్నప్పుడు శరీరం పూర్తిగా రిలాక్స్డ్ భంగిమలో ఉంటుంది. దీని కోసం యోగా మ్యాట్ పై హాయిగా పడుకోండి. మీ కాళ్ళు, చేతులను వదులుగా ఉంచండి. ఈ ఆసనం చేయడం ద్వారా ఒత్తిడి తొలగిపోతుంది. భౌతిక శరీరంలో విశ్రాంతి పొందడంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. గర్భధారణ సమయంలో అలసట, మానసిక కల్లోలం నుండి ఉపశమనం పొందడానికి ఈ యోగా ఆసనం ఉత్తమం.
నిపుణుల సలహా అవసరం..
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేయాలనుకుంటే ముందుగా నిపుణుల సలహా తీసుకుని ఎవరి పర్యవేక్షణలోనైనా ఆసనాలు వేయాలి. మొదటి మూడు నెలలు యోగాకు దూరంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో రోజూ వాకింగ్ చేయడం కూడా చాలా ప్రయోజనకరం. అయితే ఒకటిన్నర గంటల పాటు కంటిన్యూగా నడవడానికి బదులు గంటలో 10, 15 నిమిషాలు నడవాలని నిపుణుల అభిప్రాయం.
Read More..
వింత వ్యాధితో బాధపడుతున్న యువతి.. స్నానం చేసిందో అంతే సంగతి..