Kanchan Janga: అల్లంత దూరాన ఎత్తైన కొండపై.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న కాంచన్ జంగా
Kanchan Janga: అల్లంత దూరాన ఎత్తైన కొండపై..! ట్రెక్కర్‌లను ఆకట్టుకుంటున్న కాంచన్ జంగా!
దిశ, ఫీచర్స్ : కాంచన్ జంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఇది మూడవది. హిమాలయాల్లోని పర్వత సమూహాల్లో ఉంది. ఎవరెస్టు, కేటూ రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. శిఖరమే కాకుండా కాంచన్ జంగ నేషనల్ పార్కు కూడా ప్రపంచ పర్యాటకులను, ట్రెకర్‌లను ఆకట్టుకుంటుంది. ఇక్కడి ఎత్తైన పర్వతలోయలు చూసేందుకు జనాలు ఇష్టపడతారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో అనేకమంది ఇక్కడికి వస్తుంటారు.
ఎత్తైన పర్వత సానువులు, పక్షులు, జంతువులు, అందమైన పచ్చికలు కాంచన్ జంగా పర్వత పరిసరాల్లో ఆకట్టుకుంటాయి. అందుకే ట్రెకర్స్ సహా టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపుతారని పర్యాటక నిపుణులు చెప్తున్నారు. ఇక ట్రెక్కింగ్ సమయంలో వెంటనే గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతో కాకుండా, ఇక్కడి వాతావరణాన్ని కూడా ఆస్వాదించాలని చాలా మంది భావిస్తుంటారు. అక్కడికి వెళ్లే దారిలో రోడోడెండ్రాన్ పూల మొక్కలు, ఓక్ చెట్లు, అనేక ఔషధ మొక్కలు ఉంటాయి. వీటితోపాటు అందమైన సరస్సులు, హిమానీ నదాలు ఆకట్టుకుంటాయి.
కాంచన్ జంగా శిఖరమే కాకుండా ఇక్కడి నేషనల్ పార్కులో జింకలు, హిమాలయన్ తార్‌లు, అడవి కుక్కలు, నీలిరంగు గొర్రెలు, మంచు చిరుతలు, ఎర్రటి పాండాలు, నల్లటి ఎలుగు బంటులు, అడవి గాడిదలు, దున్నలు వంటివి ఆ పరిసరాల్లో విహరిస్తూ కనిపిస్తాయి. ఇక్కడి పరిసరాల్లో రకరకాల పక్షుల కిలకిల రావాలు వింటే మధురమైన సంగీతాన్ని ఆస్వాదించిన అనుభూతి కలుగుతుందని చెప్తుంటారు. అయితే కాంచన్ జంగా పరిసరాలకు, పార్కులకు ఎవరైనా వెళ్లి చూడవచ్చు కానీ.. శిఖరాన్ని చేరడానికి మాత్రం మౌంటనియరింగ్‌లో శిక్షణ పొందిన ట్రెకర్లు మాత్రమే చేరుగలరని నిపుణులు చెప్తున్నారు. ట్రెక్కింగ్ చేయకపోయినా పరిసర ప్రాంతాల్లోంచి అల్లంత దూరానా నిల్చొని పర్వతం వైపు చూస్తే కలిగే అనుభూతే వేరు అంటున్నారు నిపుణులు. ఇక కాంచన్ జంగా పర్వతంలోని కొంత భాగం నేపాల్లో కూడా ఉంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరవచ్చునని పర్యాటక నిపుణులు చెప్తున్నారు.