calorie obsession : అందం, ఆరోగ్యంపై శ్రద్ధతో కేలరీల లెక్కింపు.. యువతలో వ్యసనంగా మారుతున్న అతి జాగ్రత్తలు..
మనుషులుగా మనమందరం అనేక విషయాల్లో బెటర్‌గా ఉండాలని భావిస్తుంటాం. అందుకోసం అనుసరించదగిన బెస్ట్ వెర్షన్ కోసం అన్వేషిస్తుంటాం. అనుకున్నది సాధించడానికి అవసరమైన అలవాట్లను ఏర్పర్చుకుంటాం.
దిశ, ఫీచర్స్ : మనుషులుగా మనమందరం అనేక విషయాల్లో బెటర్‌గా ఉండాలని భావిస్తుంటాం. అందుకోసం అనుసరించదగిన బెస్ట్ వెర్షన్ కోసం అన్వేషిస్తుంటాం. అనుకున్నది సాధించడానికి అవసరమైన అలవాట్లను ఏర్పర్చుకుంటాం. లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. అయితే ఇవన్నీ పరిమితికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే మేలు జరుగుతుంది. లేకపోతే వ్యసనంగా మారవచ్చు. ఇటీవల యువతలో పెరగిపోతున్న ‘కేలరీ అబ్సెషన్స్’ అటువంటి రిస్కునే పెంచుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందంగా, ఆరోగ్యంగా, స్లిమ్‌గా ఉండాలనే ఆలోచనతో చివరికి కేలరీలను లెక్కించి తినడం ఒక రుగ్మతగా మారుతోంది. క్రమంగా యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్, పోషకాహార లోపాలకు దారితీస్తోంది.
బాడీ ఇమేజింగ్ ఇష్యూస్
ఇటీవల పెరుగుతున్న బాడీ ఇమేజింగ్ ఇష్యూస్ కూడా కేలరీల అబ్సెషన్‌కు కారణం అవుతున్నాయి. వీటివల్ల ప్రభావితం అయ్యేవారు తామ శరీర ఆకృతిని అందంగా మార్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆహారాల విషయంలో అతి శ్రద్ధ కనబరుస్తున్నారు. అధిక బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి ఏయే ఆహారాలు తీసుకోవాలి? ఎందులో ఎన్ని కేలరీలు ఉంటాయి? అని లెక్కించి మరీ ఆహార నియమాలు పాటించడం అసలుకే ఎసరు తెస్తోంది. నిజంగానే కేలరీలు తగ్గినప్పుడో, అధికమైనప్పుడో కొంతకాలం ఇటువంటి శ్రద్ధ పనికి వస్తుంది. కానీ నిరంతరం అదే పాటిస్తే సమతుల్యత లోపించి మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కేలరీ అబ్సెషన్ లక్షణాలు
కేలరీలు తీసుకోవడం పట్ల హైపర్ అబ్సెషన్‌ను ఎదుర్కొంటున్న వ్యక్తులు తరచుగా ఆహార వినియోగానికి సంబంధించి అధిక శ్రద్ధ చూపుతారు. తాము తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో, స్నాక్స్‌లో, భోజనంలో కేలరీలను కచ్చితంగా లెక్కింలే వింత ప్రవర్తనను ప్రదర్శిస్తారు. పానీయాలు, ఇతర ఆహార ఎంపికల విషయంలో తరచూ ఆందోళన చెందుతుంటారు. ఒక్కరోజు కేలరీలు లేని ఆహారం లేదా అధిక కేలరీలు తీసుకున్నా తీసుకున్నామని భావించినా ఆ రోజంతా అపరాధభావంతో ఉంటారు. తమ ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని ఆందోళన చెందుతుంటారు. ఆహార పరిమితులను పాటించడం, కంపల్సరీ వ్యాయామం చేయడం, కేలరీలను బర్న్ చేయడం, కేలరీలను లెక్కించడం వంటి అనేక విషయాల్లో అతి ధోరణితో ఉంటారు.
దుష్ప్రభావాలు
కేలరీలను లెక్కించడం సాధారణంగా మంచి అలవాటుగా పరిగణించబడుతుంది. కానీ ఇది వ్యసనంగా మారినప్పుడు లేదా లిమిట్ దాటినప్పుడు మాత్రం సదరు వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కేలరీలను ట్రాక్ చేయడంలో ఎక్కువగా నిమగ్నమై ఉండే వ్యక్తులు మానసిక ఆందోళనతో అలసిపోతారు. అధిక బరువు తగ్గడంలో విఫలం అవుతారు. దీంతో ఆందోళన, అపరాధ భావం, స్ట్రెస్ లెవల్స్ మరింత పెరుగుతాయి. కాలక్రమేణా కేలరీలపై అతి శ్రద్ధ ఆర్థోరెక్సియా లేదా ఈటింగ్ డిజార్డర్‌కు దారితీస్తుంది. ఒక పద్ధతికి ఫిక్స్ అయి ఉండటంవల్ల చివరికి పోషకాల లోపాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కండరాల నష్టం, జీవక్రియలో ప్రతికూల మార్పులు, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, జుట్టు రాలడం, ఎముకల బలహీనత వంటి సమస్యలకు దారితీస్తాయి.
పరిష్కారం ఏమిటి?
కెలరీ అబ్సెషన్‌ను అధిగమించాలంటే వాటిపై ఉన్న అతి శ్రద్ధను వదులుకోవాలి. కేలరీల విషయంలో జాగ్రత్తలు కూడా అవసరమే కానీ, అతి జాగ్రత్తలే కొంప ముంచుతాయి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. కొన్నిసార్లు మారిన పరిస్థితులు, శారీరక అవసరాలు, ఫిజికల్ యాక్టివిటీస్ కెలరీల్లో హెచ్చు తగ్గులను డిమాండ్ చేస్తాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేలరీలు తీసుకునే విషయంలో అప్పటికే ఫిక్స్ అయి ఉన్న పద్ధతినే ఫాలో అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. కేలరీలు లెక్కించడాన్ని, పరిగణించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవద్దు. ఆహారం తీసుకునే సందర్భంలో ఇటువంటి ఆలోచనలను డైవర్ట్ చేయాలి. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు తీసుకోవాలి. మైండ్ ఫుల్‌నెస్‌గా ఉంటూ సమతుల్య భోజన పద్ధతులు అనుసరిస్తే చాలు.