Health : స్ట్రెస్ రిలీఫ్ ఫుడ్స్ ఇవే

విద్యార్థుల వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నాయ్. అయితే స్టూడెంట్స్‌కు ఎగ్జామ్ టైప్ ఎప్పుడూ కష్టతరమైనదే కాగా అధికంగా ఒత్తిడిని అనుభవిస్తుంటారు

Update: 2023-02-16 05:25 GMT

దిశ, ఫీచర్స్: విద్యార్థుల వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నాయ్. అయితే స్టూడెంట్స్‌కు ఎగ్జామ్ టైప్ ఎప్పుడూ కష్టతరమైనదే కాగా అధికంగా ఒత్తిడిని అనుభవిస్తుంటారు. దీంతో కొన్నిసార్లు అనారోగ్యం పాలవుతుంటారు. కాబట్టి పిల్లల్లో ఎగ్జామ్ స్ట్రెస్‌ను అదుపులో ఉంచేందుకు.. ఏకాగ్రత మెరుగుపరిచేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. మంచి పోషకాహారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని సూచిస్తూ.. ఇందుకు సంబంధించిన టిప్స్ అందిస్తున్నారు.

పిల్లలే కాదు పెద్దల్లో కూడా సరైన ఆహారం మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న పిల్లల మానసిక సామర్థ్యంపై ఆహార వినియోగం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఐరన్ డెఫిషియెన్సీ డోపమైన్ ట్రాన్స్‌మిషన్‌కు అంతరాయం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చిన్నారుల తెలివితేటలను దెబ్బతీస్తుంది. ఈ క్రమంలోనే విటమిన్ E, థయామిన్, విటమిన్ B, జింక్, అయోడిన్‌తో సహా పిల్లల అభిజ్ఞా సామర్థ్యం, మానసిక దృష్టిని మెరుగుపరచడానికి అనేక ఖనిజాలు, విటమిన్లు సూచించబడ్డాయి.

1. కార్బోహైడ్రేట్స్

అన్ని పిండి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం కాదు. కాబట్టి తృణధాన్యాలతో కూడిన బ్రెడ్, బ్రౌన్ రైస్, క్వినోవా, గోధుమ వంటి గ్రెయిన్స్‌తో కూడిన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లను పిల్లల ఆహారంలో చేర్చండి. వీటిలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉన్నందున నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చిలగడదుంప, గుమ్మడికాయ, పొట్లకాయ వంటి స్టార్చీ వెజిటెబుల్స్‌ను కూడా రోజువారీ ఆహారం(కార్బ్ వినియోగం)లో చేర్చండి. అయితే ప్రతీది మితంగా ఉండేలా చూసుకోండి.

2. కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి..

ఎందుకంటే వీటిలో అనేక పోషకాలు నిండి ఉంటాయి . ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ప్రయోజనం చేకూరుస్తాయి. కాబట్టి పిల్లల ఆహారంలో కచ్చితంగా అన్ని రకాల కూరగాయలను చేర్చాలని సూచిస్తున్నారు డైటీషియన్స్. అయితే పిండిపదార్థాలు లేని కూరగాయలను ఎక్కువగా చేర్చడానికి ప్రయత్నించాలని, బంగాళాదుంపలను నివారించాలని సూచిస్తున్నారు.

3. ఒమేగా-3

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడతాయి. పిల్లలు వారానికి కనీసం రెండుసార్లు ఒమేగా-3-రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సీఫుడ్( చేపలు వంటి)లో ఒమేగా-3 అధికంగా ఉంటుందని తెలిపిన నిపుణులు.. చేపలు, చికెన్, ట్యూనా, టర్కీ, రెడ్ మీట్ వంటి తక్కువ కొవ్వు మాంసాలను విద్యార్థుల భోజనంలో తప్పనిసరిగా చేర్చాలంటున్నారు.

4. పెరుగు

పెరుగు.. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. పరీక్షా సమయంలో పిల్లల్లో పొట్టకు సంబంధించిన రుగ్మతలను నివారించడానికి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పెరుగు అనేది ప్రోబయోటిక్. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో సెరోటోనిన్(ఒత్తిడిని నియంత్రించే ఆహ్లాదకరమైన హార్మోన్) స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే పరీక్షలకు ముందు 'దహీ-షక్కర్'ను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5. సమతుల్యతను కాపాడుకోండి

కార్బోహైడ్రేట్లు ఎప్పుడూ చెడ్డగా పరిగణించబడుతున్నప్పటికీ.. అమైనో ఆమ్లాలతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పిల్లలకు వారి అవగాహన, తార్కికం, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని డైటీషియన్ చెప్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల అభిజ్ఞా, మేధో పనితీరు పెరుగుతుందని పలు అధ్యయనాలు సూచించాయని అంటున్నారు. అందుకే విద్యార్థులు తమ భోజనంలో కనీసం అర ప్లేట్ కూరగాయలు, క్వార్టర్ ప్లేట్ పిండి పదార్థాలు, సహేతుకమైన పరిమాణంలో ప్రొటీన్‌లను తప్పనిసరిగా చేర్చాలని సలహాలిస్తున్నారు. 

Tags:    

Similar News