Health: బ్రేక్‌ఫాస్ట్ చేసుకునేందుకు టైం లేదా? దీన్ని ట్రై చేయండి.. రుచి, ఆరోగ్యం మీ సొంతం!
ఆధునిక ఉరుకుల పరుగుల జీవన శైలిలో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు.
దిశ, వెబ్ డెస్క్: ఆధునిక ఉరుకుల పరుగుల జీవన శైలిలో (Lifestyle) చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను (Breakfast) మానేస్తుంటారు. కానీ, ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అల్పాహారం తినకపోవడం వల్ల డయాబెటీస్, క్యాన్సర్, మైగ్రెన్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఉదయం మనం తీసుకునే ఆహారమే రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచేందుకు సాయపడుతుంది. మరీ ముఖ్యంగా ఉదయం 8 గంటల లోపే బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. మరీ అల్పాహారం రోజులో ముఖ్యమైన ఆహారం కాబట్టి ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. అయితే, ఈ బిజీ షెడ్యూల్‌లో తినడానికికే టైం లేదు.. అలాంటిది పోషకాలతో కూడిన ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే కష్టమే అనుకునేవారి కోసం పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా ఆరోగ్యకరమైన రుచికరమైన పోషకాలతో కూడిన అల్పాహారం రెసిపీని షేర్ చేశారు.
పూజా మల్హోత్రా షేర్ చేసిన రెసిపీ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందుకోసం ఆమె చియా సీడ్స్, యోగర్ట్, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ను వినియోగించారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో చేస్తాయి. చియా సీడ్స్‌లో ఫైబర్, ఓమెగా-3, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఎంపిక. అలాగే, యోగర్ట్‌లో విటమిన్ D, B2, B12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పండ్లు, డ్రై ఫ్రూట్స్ కూడా శరీరానికి కావాల్సిన పూర్తి పోషకాలను అందిస్తాయి.
ఎలా తయారు చేసుకోవాలంటే..
* ఒక కప్పు తక్కువ కొవ్వు కలిగిన యోగర్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్‌ను నానబెట్టాలి.
* అందులోనే కావాల్సిన డ్రై ఫ్రూట్స్‌ను వేసి కలపాలి.
* అనంతరం 3-4 గంటలపాటు ఫ్రీడ్జ్‌లో పెట్టుకోవాలి. మిశ్రమం చిక్కగా అనిపిస్తే, కొద్దిగా పాలు కలుపుకోవచ్చు. స్వీటెనర్‌గా తేనె, బెల్లం వాడుకోవాలి.
* తర్వాత తాజా తరిగిన కావాల్సిన పండ్లు టాపింగ్‌గా వేసి తినాలి.
* ఈ బౌల్ ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్, నిపుణుల సలహా మేరకు అందించటం జరిగింది. పరిగణలోకి తీసుకునే ముందు పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవటం మంచింది.