Current saving tips : ఎల్ఈడీ బల్బులు వాడితే నిజంగానే కరెంట్ బిల్లు తక్కువొస్తుందా?

కరెంట్ చార్జీలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని తగ్గించుకునే మార్గాలను అనుసరించేందుకు ప్రజలు మొగ్గు చూపుతుంటారు. ఇందులో భాగంగా అవసరం మేరకు మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వేస్తుంటారు.

Update: 2024-09-12 10:24 GMT

దిశ, ఫీచర్స్ : కరెంట్ చార్జీలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని తగ్గించుకునే మార్గాలను అనుసరించేందుకు ప్రజలు మొగ్గు చూపుతుంటారు. ఇందులో భాగంగా అవసరం మేరకు మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వేస్తుంటారు. రాత్రిళ్లు అన్ని గదుల్లో కాకుండా కేవలం తాము ఉండే హాల్లో మాత్రమే లైట్ వేస్తుంటారు. ఇక పడుకునే ముందు అయితే అన్నీ ఆఫ్ చేసేస్తుంటారు. ఇంకొందరు బిల్లు తక్కువ రావాలని ఎల్ఈడీ బల్బులు లేదా ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు వాడుతుంటారు. వీటివల్ల కరెంట్ బిల్లు చాలా తగ్గుతుందని భావిస్తారు. అయితే నిజంగానే తగ్గుతుందా?, నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

తక్కువ విద్యుత్ వినియోగం

మనం వాడే సాధారణ బల్బులకంటే ఎల్‌ఈడీ బల్బులు 60 నుంచి 80 శాతం వరకు తక్కువ విద్యుత్‌ను, ఎనర్జీని వినియోగించుకుంటాయని నిపుణులు చెప్తున్నారు. పైగా ఇవి ఎక్కువ వెలుతురు ఇస్తూ.. తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో మిగతా బల్బులకంటే కూడా గదివాతావరణాన్ని కాస్త చల్లగా ఉంచుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్‌పై తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. అంటే కరెంట్ బిల్లును ఎంతో కొంత ఆదాచేయడంతోపాటు కాంతి, వేడి కాలుష్యాలను కొంతమేర నివారిస్తాయి. అందుకే సాధారణ బల్బులకంటే ఎల్ఈడీ బల్బులే మంచిదని విద్యుత్ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ రెండింటిలో ఏది బెటర్?

ఎల్ఈడీ బల్బులు విద్యుత్ ఆదాకు మంచిది. అయితే ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లతో పోల్చినప్పుడు రెండింటిలో ఏవి బెటర్ అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తుంటారు. ఈ రెండింటినీ ఒకే విధమైన టెక్నాలజీతో తయారు చేస్తారు. కానీ విద్యుత్‌ను వినియోగించుకొని కాంతిని వెదజల్లే సామర్థ్యం పరంగా చూసినప్పుడు కొన్ని తేడాలు ఉంటాయని నిపుణులు చెప్తు్న్నారు. ఏంటంటే.. ఎల్ఈడీ బల్బులు కంటే ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు కొంచెం ఎక్కువ కరెంట్‌ను వినియోగించుకుంటాయి. ఇక వెలుతురు పరంగా చూస్తే ట్యూబ్ లైట్లకంటే కూడా బల్బులు కొంచెం తక్కువ కాంతిని ఇస్తాయి. కొద్దిమొత్తంలోనే తేడా ఉంటుంది కాబట్టి మీ ఇంటి అవసరాన్ని బట్టి ఎల్ఈడీ బల్బు లేదా ట్యూబ్ లైట్ ఈ రెండింటిలో ఏది వాడినా సాధారణ బల్బులు, ట్యూబ్‌లైట్లకంటే కూడా తక్కువ కరెంటు వినియోగించుకుంటాయని, తద్వారా కరెంటు బిల్లు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 


Similar News