వికీపీడియాలో తొలి పోస్ట్ ఏంటి..? దానిని తెలుగులో ఎప్పుడు ప్రారంభించారో తెలుసా..?

ఒకానొకప్పుడు మనకు ఏదైనా సమాచారం కావాలంటే పుస్తకాలన్నింటినీ ముందర పెట్టుకుని పేజీలను తిరగేసేవాళ్లం.

Update: 2023-07-05 14:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఒకానొకప్పుడు మనకు ఏదైనా సమాచారం కావాలంటే పుస్తకాలన్నింటినీ ముందర పెట్టుకుని పేజీలను తిరగేసేవాళ్లం. కానీ కాలం మారింది. ప్రస్తుతం ఉన్న కాలంలో మనకు ఏదైనా సమాచారం కావాలంటే చేతిలో ఉన్న మొబైల్ లో సెర్చ్ చేస్తే చాలు. వికీపీడియా మనకు పూర్తి సమాచారాన్ని చేరవేస్తుంది. దీంతో మనకు తెలియని విషయాలను కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం. మరి మనకు ఇంత సమాచారాన్ని చేరవేసే వికీపీడియాని ఎవరు కనుగొన్నారు, అది ఎలా డెవలప్ అయ్యింది అన్న విషయాలు మాత్రం మనలో చలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

మొట్టమొదటగా వికీపీడియా ఇంగ్లిష్‌లో మొదలయ్యింది. జిమ్మీవేల్స్, లారీసాంగర్‌లు జనవరి 15, 2001న ఆంగ్ల వికీపీడియాను రూపొందించారు. ఆ తరువాత ఎన్నో భాషలలో వికీపీడియా ప్రారంభమయ్యింది. ఇకపోతే తెలుగు వికీపీడియా విషయానికొస్తే డిసెంబరు 10, 2003లో వెన్న నాగార్జున ఆవిష్కరించారు. 2003 డిసెంబరు ప్రారంభమైన వికీపీడియాలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా ఎవరూ రాయలేదు. దీంతో నాగార్జున కొన్ని తెలుగు సమాచార గ్రూప్‌లలో వికీపీడియా గురించి ప్రచారం చేశారు. దీంతో మంచి స్పందన వచ్చి సభ్యులు చేరడం ప్రారంభించారు. రావు వేమూరి, చావా కిరణ్‌, వైజాసత్య, మాకినేని ప్రదీపు, మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న కట్టామూర్తి వంటి ప్రముఖులు స్పందించి వికీపీడియాను ముందుకు నడిపించారు.

మొట్టమొదటి సారిగా వైజాసత్య కృషితో 2005లో జూలై మాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల గురించిన పూర్తి సమాచారం వికీలో అప్లోడ్ చేశారు. 2005 సెప్టెంబరులో ప్రదీప్ కృషితో మండలాలకు సంబంధించిన వ్యాసాలలో పట్లు చేర్చారు. ఆ తరువాత తెలుగు చలన చిత్రాలకు సంబంధించిన వ్యాసాలను కాజా సుధాకరబాబు (కాసుబాబు), చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ లు రాయడం ప్రారంభించారు. అలాగే వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలను రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు రాసి భద్రపరిచారు. ఆర్థికశాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను చంద్రకాంతరావు అందించారు. వంటకాల వ్యాసాలను టి.సుజాత నగరాలు రాయడం ప్రారంభించారు. విశ్వనాధ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలను బ్లాగేశ్వరుడు రాశారు. అహ్మద్ నిసార్ చిట్కాలు ప్రకటనల పై, దేవా, ఇస్లామ్ వివరాలను అందించేందుకు కృషి చేశారు. ఇక వికీపీడియా పేజీని వీవెన్ సుందరంగా రూపొందించారు.

ఈ వికీపీడియాలో ఎవరికి తెలిసిన సమాచారాన్ని వారు భద్రపరచొచ్చు. తెలుగు వికీపీడియా 2007-2009 కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అందరికీ ఎంతో అవసరమయ్యే సమాచారాన్ని అందరికీ అందిస్తూ ఆదరణ పొందింది. అలా ప్రజాదరణ పొందుతూ అక్టోబరు 2020 నాటికి 13,400 ఫొటోలను, 69,600 వ్యాసాలను భద్రపరుచుకుంది.

Read More:   భారత దేశంలో మొట్టమొదటగా ప్రసారమైన సీరియల్ ఏదో తెలుసా..?

Tags:    

Similar News