Dizziness : అకస్మాత్తుగా తల తిరుగుతోందా?.. నిపుణుల ప్రకారం ప్రైమరీ రీజన్స్ ఇవే..

నిద్ర లేవగానే సడెన్‌గా తల తిరిగినట్లు అనిపిస్తోందా?.. అయితే వెంటనే ఆందోళన పడవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Update: 2024-08-04 07:07 GMT

దిశ, ఫీచర్స్ : నిద్ర లేవగానే సడెన్‌గా తల తిరిగినట్లు అనిపిస్తోందా?.. బిజీ వర్కులో నిమగ్నమైపోయి ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి క్షణం పాటు పరిసరాలన్నీ గిర్రున తిరిగి ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతోందా?.. అయితే తమకు ఏదో జరుగుతుందని వెంటనే ఆందోళన పడవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తల, కళ్లు తిరగడం అనే సిచ్యువేషన్‌ను చాలామంది ఎదుర్కొంటున్నారని, అందుకు ప్రత్యేక కారణాలు ఉంటాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* తరచుగా మానసిక ఒత్తిడికి గురికావడం, ఎక్కువసేపు ఎండలో లేదా పొల్యూషన్ కలిగిన వాతావరణంలో తిరగడం, సరైన నిద్రలేకపోవడం వంటి సమస్యలవల్ల అకస్మాత్తుగానే తల లేదా కళ్లు తిరగడానికి కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

* అలాగే రక్తపోటు ఎక్కువైనా లేదా తక్కువైనా కూడా తల, కండ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఈ సందర్భంగా రక్త ప్రసరణలో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా తల తిరగడం, కండ్లు మసకబారడం వంటివి జరగవచ్చునిని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

* బాడీ డీహైడ్రేటెడ్‌గా మారే పరిస్థితి ఎదురైనా, తగినంతగా నీరు తాగకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా లేదా తగ్గినా తల లేదా కళ్లు తిరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియాగా పేర్కొంటారు. ప్రధానంగా డయాబెటిక్ పేషెంట్లలో ఈ ప్రాబ్లం ఎక్కువగా తలెత్తే చాన్స్ ఉంటుంది. ఒక్కసారిగా ఎనర్జీ కోల్పోయి చెమటలు పట్టడం, తీవ్రమైన అలసట, చేతులు, కాళ్లు వణకడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

* తల, కళ్లు తిరగడానికి మరొక కారణం రక్తహీనత. ఈ సమస్యను మహిళలు, బాలికలు ఎక్కువగా ఎదుర్కొంటుంటారని నిపుణులు చెప్తున్నారు. శరీరంలో ఐరన్ లోపించడంవల్ల ఇలా జరుగుతుంది. అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే చెవి ఇన్ఫెక్షన్, మైగ్రేన్, వర్టిగో వంటి ఆరోగ్యపరమైన కారణాలు కూడా తల, కళ్లు తిరగడానికి కారణం అవుతాయి. అయితే ఇవేవీ పరిష్కారం లేని హెల్త్ ఇష్యూస్ మాత్రం కావని నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు అవి సహజంగానే తగ్గిపోతాయని, తరచుగా అదే సమస్య రిపీట్ అయితే మాత్రం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యపరమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు వైద్యులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News