Divorce Reasons : ఓర్నీ.. విడాకులా.. చాక్లెట్లా..! డివోర్స్ కోసం మరీ ఇన్ని వింతలా!!
ఒకసారి పెళ్లి చేసుకుంటే భార్యా భర్తలు జీవితాంతం కలిసుంటారని అందరూ అనుకుంటారు. పెళ్లి నూరేళ్ల పంట అని కూడా పెద్దలు అంటుంటారు. అయితే అందరి విషయంలోనూ అలాగే జరుగుతుందనే గ్యారెంటీ ఇప్పుడేం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దిశ, ఫీచర్స్ : ఒకసారి పెళ్లి చేసుకుంటే భార్యా భర్తలు జీవితాంతం కలిసుంటారని అందరూ అనుకుంటారు. పెళ్లి నూరేళ్ల పంట అని కూడా పెద్దలు అంటుంటారు. అయితే అందరి విషయంలోనూ అలాగే జరుగుతుందనే గ్యారెంటీ ఇప్పుడేం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూరేళ్లు ఏమోగానీ.. కనీసం మూడేండ్లు కూడా కలిసి కాపురం చేయని సబంధాలు చాలానే ఉంటున్నాయని చెప్తున్నారు. పైగా కొందరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మరీ వింతగా ఉంటున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాగీ తినలేకపోతున్నానంటూ..
తరచూ వివాదాల కారణంగా.. ఇక కలిసి ఉండటం సాధ్యం కాదు అనే నిర్ణయానికి వస్తే గానీ దాదాపు ఎవరూ విడాకులు కోరుకోరు. కానీ కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా కాదు. చాలా విచిత్రమైన కారణంతో తన భార్య నుంచి విడాకులు కోరాడు. ఏంటంటే.. ఆమె సరిగ్గా వంట చేయడం లేదని, రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మ్యాగీనే చేసి పెడుతోందని, అది తినలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తనకు డివోర్స్ కావాలని కోర్టులో కేస్ ఫైల్ చేశాడట. ఫైనల్లీ వారిద్దరూ విడాకులు తీసేసుకున్నారు.
పరీక్షలకు ప్రిపేర్ అయిన పాపానికి!
ఎవరైనా పెళ్లి తర్వాత కూడా తన పార్ట్నర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయి జాబ్ కొట్టేస్తానంటే చాలా సంతోషిస్తారు. భోపాల్‌కు చెందిన ఓ మహిళ మాత్రం అలా కాదు. పైగా తన భర్త పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం ఆమెకు నచ్చలేదట. దీంతో ఆమె 2019లో తన భాగస్వామి యూపీఎస్సీ పరీక్షలకోసం చదువుకుంటూ బిజీ అయిపోతున్నాడని, తనతో ఎక్కువ సమయం గడపడం లేదని విడాకులు కోరింది. ఈ విషయం భోపాల్ లీగల్ సర్వీస్ అథారిటీ కౌన్సెలింగ్ సమయంలో వెలుగులోకి రాగా అందరూ ఆశ్చర్యపోయారు.
లడ్డూ మాత్రమే తినాలంటూ టార్చర్..
లడ్డూ కావాలా నాయనా.. ఈ యాడ్ ఎంత ఫేమస్ అయిపోయిందో తెలుసు కదా. అయినా లడ్డూ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి మాత్రం అది నచ్చదట. పైగా అతనొక వింత సమస్యను ఎదుర్కొన్నాడు. రోజూ భార్య తనను లడ్డూ తినాలని టార్చర్ పెడుతోందని, తనకు విడాకులు కావాలని 2019లో కేస్ ఫైల్ చేశాడు. అది కూడా తన భార్య ఎవరో ఒక తాంత్రికుడిని నమ్మి ఇలా చేస్తోందని, అతని మాటలు విని తనకు రోజూ ఉదయం సాయంత్రం తప్పకుండా నాలుగు లడ్డూలు తప్ప వేరే పదార్థాలేవి తిననివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టులో ఈ వ్యక్తి వాదన విని చివరికి అక్కడున్న లాయర్లు, జడ్జి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి విడాకులు మంజూరయ్యాయి.
స్నానం చేయడం లేదని..
ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ మహిళ పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరింది. అందుకు ఆమె పేర్కొన్న కారణం ఏంటంటే.. తన భర్త రోజూ స్నానం చేయడం లేదని, నెలకు ఒకసారే చేస్తాడని, అయితే వారానికి ఒకసారి గంగాజలం తలపై చల్లుకుంటాడని వాపోయింది. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ అధికారులకు ఇదే విషయం తెలిపింది. శుభ్రత పాటించనందున అతని వద్ద చెడు వాసన వస్తోందని, అందుకే డివోర్స్ కావాలని కోరింది. కాగా ఈ విషయాన్ని ఆమె భర్త కూడా అంగీకరించాడట. ఈ సంఘటన ఇటీవలే జరగడం విశేషం.
ప్రేమ ఎక్కువైందని..
ఏ స్త్రీ అయినా భర్త తనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటుంది. కానీ యూపీలోని సంభల్ జిల్లాకు చెందిన ఓ మహిళ మాత్రం అది భరించలేకపోయింది. తన భర్త తనను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని షరియత్ కోర్టును ఆశ్రయించగా.. ఇది విన్నవారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఎక్కువ ప్రేమించడం అనే కారణంతో డివోర్స్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పిందట. ఇలా రకరకాల వింత కారణాలతో విడాకులు కోరుతున్న వార్తలు ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పిచ్చి పది రకాలు అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.