Health Tips: అందుకే తాగొద్దు అని చెప్పేది.. కాఫీ, టీ తాగితే ఈ రెండు రోగాలు ఖాయం
Health Tips: మనలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: Health Tips: మనలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం కాఫీ లేదా టీ తాగకుంటే ఆరోజంతా ఏదో కోల్పోయినట్లు ఉంటారు. కొంతమంది రోజుకు ఐదారు సార్లు తాగుతుంటారు. ప్రతి రెండు గంటలకోసారి కాఫీ, టీ తాగే వారు కూడా ఉన్నారు. కానీ అతిగా కాఫీ, టీలు తాగితే మధుమేహం వస్తుందని చెబుతున్నారు వైద్యులు. అంతేకాదు అతిగా శీతల పానీయాలు తీసుకుంటే ఊబకాయం బారిన పడతారని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. వీటన్నింటికి కొనసాగింపుగా రోజుకు రెండుసార్లు చక్కెరతో టీ, కాఫీలు తాగితే డయాబెటిస్ తోపాటు ఊబకాయం వస్తుందని..శీతలపానీయాలు తీసుకుంటే ఊబయకాయం బోనస్ గా టైప్ 2 డయాబెటిస్ వస్తుందని హైదరాబాద్ లోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
టీ, కాఫీ, శీతలపానీయాల వినియోగంపై చాలా అధ్యయనాలున్నా తాము మరిన్ని సూక్ష్మ అంశాలను తెలుసుకునేందుకు రెండు సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసినట్లు తెలిపారు. వేర్వేరు జాతుల ఎలుకలను తీసుకుని కొన్నింటికి రోజుకు నాలుగైదు సార్లు చక్కెర కలిపిన 100 మిల్లీలీటర్ల టీ, కాఫీ, శీతలపానీయాలను ఇచ్చినట్లు చెప్పారు. మరికొన్నింటికి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇచ్చారు. వీటి రక్త నమూనాలను పరీక్షించారు. అన్ని ఎలుకల్లోనూ మధుమేహం, ఊబకాయ లక్షణాలు కనిపించాయి. ఈ ప్రయోగ ఫలితాలను అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసిన గ్లోబల్ డైటరీ డేటాబేస్ తో సరిపోల్చారు.
తమ పరిశోధనపత్రం ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ ప్రచురించినట్లు చెప్పారు. టీ, కాఫీ, శీతలపానీయాల్లో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం, కండరాలు, చిన్నపేగులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు తెలింది. టీ, కాఫీలను చక్కెర లేకుండా తాగేందుకు ప్రయాత్నించాలని చెబుతున్నారు. శీతల పానీయాలను అసలు తీసుకోకుండా ఉండటమే మేలు అని వివరించారు.