నూర్పుడి యంత్రంతో న‌యా ఏసీ.. పెళ్లిలో భ‌లే ఐడియా! (వీడియో)

నెటిజన్లు ఈ ఆవిష్కరణను మేధావి చ‌ర్య‌గా ప్ర‌శంసించారు. Desi Jugaad for AC with threshing machine in an Indian wedding.

Update: 2022-05-12 12:36 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇండియాలో ఎండ‌ల్లోనే పెళ్లిళ్ల ముహుర్తాలు ఎక్కువ‌గా ఉంటాయని అంద‌రికీ తెలుసు. అయితే, ప్ర‌తి ఏడాదీ పెరుగుతున్న ఎండ వేడితో పాటు పెళ్లి ఖ‌ర్చులు కూడా మండిపోతున్నాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌నవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో సింపుల్ మ్యారేజ్ ఫోటోల‌కు లైక్‌లు, లవ్ సింబ‌ళ్లు పంపుతూనే, ఇంట్లో పెళ్లి మాత్రం అప్పుచేసైనా అంగ‌రంగ వైభోగంగా జ‌రిపించాల‌నుకుంటారు. అయితే, స‌గ‌టు సామాన్యుడికి ఇంత‌లా క‌ష్ట‌మే గానీ, ఐడియాల‌కు కొదువేముంటుంది. అందుకే, బడ్జెట్‌లోనే సింపుల్‌ లైఫ్ హ్యాక్స్ ప్లాన్ చేస్తాడు. ఈ ఏడాది రికార్డు స్థాయి వేడిగాలుల మధ్య, ఉష్ణోగ్రత దాదాపు ప్రతిరోజూ 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరుగుతున్న త‌రుణంలో, ఓ వ్య‌క్తి పెళ్లికొచ్చే అతిథిల కోసం 'జుగాడ్‌ ఏసీ'ని ఏర్పాటు చేశారు.

ఈ వీడియోను ఐపిఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. "త్రెషర్ గాలితో బారాత్‌కు స్వాగతం. అద్భుతమైన ఆలోచన" అంటూ క్యాప్ష‌న్ పెట్టి, నూర్పిడి యంత్రంతో చేసిన‌ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను తెగ పొగిడేశారు. ఇక‌, చూసినోళ్ల‌కే ఇలా ఉంటే అనుభ‌వించినోళ్లు.. తెగ ఆనందప‌డ్డారు. ప్రవేశ ద్వారం ద‌గ్గ‌రున్న‌ 'జుగాడ్‌ ఏసీ' నుండి చల్లని గాలిని ఆస్వాదిస్తూ, సెల్ఫీల‌తో స‌ర‌దాగా గ‌డిపారు. ఈ త్రెషర్ యంత్రం కింద నీటి కుంట‌లా ఏర్పాటు చేయ‌డంతో ఇది చల్లని గాలిని, స‌న్న‌టి నీటిమంచును కూడా వెద‌జ‌ల్లింది. ట్రెండ్ సృష్టించే ఈ వీడియోకు 182k పైగా వీక్షణలు, 10k పైగా లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు ఈ ఆవిష్కరణను మేధావి చ‌ర్య‌గా ప్ర‌శంసించారు. 


Similar News