creative life: జీవితాన్ని అద్భుతంగా మల్చుకోవడం మీ చేతుల్లోనే.. ఈ ఐడియాలు చాలు!
లైఫ్ అంటే ఏమిటి?.. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?.. ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరూ ఒక్కోసమాధానం చెప్తుంటారు.
దిశ, ఫీచర్స్ : లైఫ్ అంటే ఏమిటి?.. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?.. ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరూ ఒక్కోసమాధానం చెప్తుంటారు. కొందరు డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటామని భావిస్తే, మరికొందరు డబ్బే సర్వస్వం కాదంటారు. ఇంకొందరు మానవ సంబంధాలు ముఖ్యం అంటుంటారు. ఎవరు ఏం చెప్పినా ఫైనల్లీ జీవితాన్ని తమకు నచ్చినట్లు మల్చుకోవడమే ప్రజల ఉద్దేశంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
నిజానికి జీవితాన్ని అద్భుతంగా మల్చుకోవాలంటే.. ఫలాన విషయం మాత్రమే ముఖ్యం అనుకోవడానికి లేదు. జాబ్, వర్క్, టైమ్, మనీ, రిలేషన్‌షిప్స్ ఇలా సమాజంలోని అన్ని పరిస్థితులు, అన్ని అవసరాలు ఏదో మీ జీవితాన్ని మలుపు తిప్పడంలో కీ రోల్ పోషిస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఏ సందర్భంలో ఏది అవసరమో, ఎలా మసలుకోవాలో తెలుసుకుంటూ, ఆచరిస్తూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. అలాంటి ప్రయత్నమే జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. అలాంటి మరి కొన్ని అంశాల గురించి చర్చిద్దాం.
ప్రతిరోజూ నేర్చుకోండి
నాకు అన్నీ తెలుసు, జీవితానికి అసలైన అర్థం ఇదే.. అనుకునే వాళ్లెవ్వరూ నిజానికి ఆనందంగా, అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వారి ఆలోచనలు అంత వరకే పరిమితం చేస్తుంటారు. ఒక దగ్గర ఆగిపోవడంతో చివరికి నష్టపోతారు. అలా కాకుండా ఎంత తెలిసినా తెలియనివి ఉంటాయని గ్రహిస్తూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ అనుభవాల ద్వారా, అవగాహన ద్వారా, పరిశీలన ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. వాటిలో వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి ఏది అవసరమో గుర్తిస్తూ.. ఆచరిస్తూ పోతే అదే మీ జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా మార్చేస్తుందని నిపుణులు అంటున్నారు.
నైపుణ్యాల ముఖ్యం
నేర్చుకోవడం ఒకే విషయానికి పరిమితం కాదు, అనేక రూపాల్లో, అనేక కోణాల్లో ఉంటుంది. సమాజం ద్వారా, కుటుంబం ద్వారా, పరిస్థితుల ద్వారా, పరిణామాల ద్వారా.. ఇలా ప్రతీది మనకు ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది. కాకపోతే కొంచెం థింక్ చేస్తే గ్రహించగలుగుతాం. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉడాలి. పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవడం, ఉన్నతి స్థితికి చేరుకునే మార్గాలు అన్వేషించడం చేయాలి. రోజువారీ వ్యాయామాలు, వర్క్ షాప్‌లు, సమావేశాలు, వివిధ సందర్భాలు కూడా మీరు ఆనందంగా ఉండటానికి హెల్ప్ అవుతాయి.
బీ గ్రేట్ ఫుల్
సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మారాలంటే.. మీకు సహకరించిన సమాజం పట్ల, వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల కృతజ్ఞతగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇలాంటి గ్రాటిట్యూడ్ మీలో పాజిటివిటీ పెంచుతుంది. అందుకే ఈ క్షణం నుంచే మీరు గ్రేట్ ఫుల్‌గా ఉండగలిగే విషయాలను గుర్తించండి. అవసరమైతే వాటిని నోట్ చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. నిరాశ కలిగినప్పుడు, కోపంగా అనిపించినప్పుడు, ఒత్తిడిగా ఫీలైనప్పుడు వాటిని మరోసారి గుర్తు చేసుకోండి. ఆ మరు క్షణమే మీ మానసిక స్థితి మారిపోతుంది. సానుకూల ఆలోచనలతో సక్సెస్ వైపు అడుగులేస్తారు. ఆనందం మీ సొంతం అవుతుంది.
సేవా భావం
గొప్పగా ఉండటమంటే.. ఎక్కువ డబ్బు, పెద్ద పెద్ద హోదాలు కాదు.. మీ ఆలోచనలు, ఆచరణ ఆదర్శంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉండగలిగితే అదే గొప్ప అంటారు నిపుణులు. ఆ విధంగా జీవితాన్ని మల్చుకోవడంలో సేవా గుణం లేదా సేవా భావం కీలకపాత్ర పోషిస్తుంది. మీరు చేసేది చిన్న పనే కావచ్చు. మాట పరంగా, డబ్బు పరంగా, సేవా పరంగా దాని రూపమేదైనా ఇతరులకు చేసే సాయం మీకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. జీవితాన్ని అద్భుతంగా మల్చుకోవడంలో సహాయపడుతుంది.
డిజిటల్ డిటాక్స్
ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం కూడా జీవితాలను ప్రభావితం చేస్తోంది. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ఒక అవసరంగా మారిపోయాయి. అలాగనీ దానిని దూరంగా పెట్టలేం. మరీ అడిక్ట్ అయినా నష్టమే. ఈ విషయంలో మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే ఆనందంగా ఉండగలుగుతారని, మానసిక, శారీరక ఆరోగ్యానికి ఈ పద్ధతి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో ఎదగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా వినియోగించుకోగలగాలి. అలాగే అవసరం అయినప్పుడు వాటిని పక్కన పెట్టగలగాలి. దీనివల్ల టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ బ్యాలెన్స్ చేయడం కూడా అలవాటు అవుతుంది.
ఇష్టంగా చేయండి
లైఫ్‌ను అద్భుతంగా మల్చుకోవడంలో మీకు ఉపయోగ పడే మరో విషయం ‘ఇష్టం’. అవును ఇష్టంగా చేసే ఏ పనైనా, అది ఎంత కష్టమైనదైనా కష్టం అనిపించదు. పైగా జీవితాన్ని అద్భుతంగా మల్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో వర్క్ చేస్తున్నా ఇష్టంగా చేస్తే ఆసక్తి పెరుగుతుంది. కెరియర్‌లో అయినా, గోల్ సాధించడంలో అయినా ఇది ముఖ్యం. కంఫర్ట్ జోన్ అనే ఫ్రోజెన్ థాట్స్ నుంచి మీరు బయటపడగలిగితే అద్భుతమైన, ఆనందకరమైన జీవితాన్ని సెట్ చేసుకోగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.