మీది ఓర్వలేకపోతున్న మనస్తత్వమా? అయితే ఇది మీ కోసమే..!

‘మా అక్క ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నేను వెళ్లి అక్కడే నెల రోజులున్నాను. వంట చేయడం మొదలు బట్టలు ఉతకడం వరకు అన్ని రకాలుగా సేవ చేశాను.

Update: 2023-02-17 11:03 GMT

దిశ, ఫీచర్స్ : 'మా అక్క ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నేను వెళ్లి అక్కడే నెల రోజులున్నాను. వంట చేయడం మొదలు బట్టలు ఉతకడం వరకు అన్ని రకాలుగా సేవ చేశాను. కానీ నా మొదటి డెలివరీ టైమ్‌లో మాత్రం ఎవరూ నాకు సహకరించలేదు. నా పనులన్నీ నేనే చేసుకున్నా' అంటూ తనకు ఎదురైన ఇబ్బందులను ఫ్రెండ్‌తో చెప్పుకొని వాపోయింది ఒక మహిళ. తమ గల్లీలో ఉండే ఒక మహిళ నాలుగు తులాల బంగారం కొనుగోలు చేయడంతో ఆ అదృష్టం తనకెక్కడిదంటూ బాధపడింది మరో మహిళ. తన ఫ్రెండ్ ఖరీదైన డ్రెస్ కొనలేకపోయింది కానీ తాను కొనగలిగానని సంతోషం వ్యక్తం చేసింది ఓ యువతి. ఇలా.. ఎదురింటివారు కారు కొన్నారు తాము కొనలేకపోయామని, ఫ్రెండ్స్ టూర్ వెళ్లారు తాను వెళ్లలేకపోయానని ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతుంటారు కొందరు మహిళలు. ఇలా ఇతరులతో పోల్చుకొని స్ఫూర్తి పొంది రిలాక్సయితే పర్లేదు కానీ గిల్టీగా ఫీలై తరచూ బాధపడటం మానసిక రుగ్మతకు దారి తీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ప్రతీ దానికి ఇతరులతో పోల్చుకోవడం అనేది మానవ సంబంధాలపై కూడా నెగెటివ్ ప్రభావం చూపుతుంది. కుటుంబాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమానురాగాల స్థానంలో ద్వేషాలకు కారణం కావచ్చు అని హెచ్చరిస్తున్నారు.

సంఘటనలు, సమస్యల ప్రభావం

మన సమాజంలో కొందరు మహిళలు తమను ఇతరులతో పోల్చుకుని నర్వస్ కావడం వంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తమకు ఎదురైన సంఘటనలు, బాధలు, ఇతర మహిళలకు కూడా అలాగే ఉన్నాయా? అని కూడా పోల్చి చూస్తుంటారు. ఒక మహిళ తాను వేధింపులు ఎదుర్కొంటున్నప్పుడు, తన చుట్టూ ఉండేవారు, లేదా బంధువుల్లో ఇంకెవరైనా కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారా? అని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంది. ఇతరులతో పోల్చుకొని తన పరిస్థితిపట్ల మరింత ఆందోళన చెందుతుంది. స్నేహితులతో పోలిస్తే తన జీవితం ఎలా ఉంది? స్నేహితుల భర్తల సంపాదనతో పోల్చినప్పుడు తమ సంపాదన ఎలా ఉంది? అని పోల్చుకుంటారు. ఇంకొందరు తమ బంధువుల ఇళ్లలోని సౌకర్యాలతో, తమ సౌకర్యాలను పోల్చుకొని సంతోషించడమో, బాధపడటమో చేస్తుంటారు. దీంతో సమయం వృథా కావడంతోపాటు మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

ఎదుటివారు బెట్టర్‌గా ఉంటే..

తమకంటే ఇతరులు బెటర్‌గా ఉండటాన్ని కొందరు మహిళలు తట్టుకోలేరు. వారి మాటలు, చేతల ద్వారా ఎదుటివారిని తక్కువ చేయాలని చూస్తుంటారు. ఒక మహిళ చదువుకొని ఉద్యోగం చేస్తుంటే.. చదువుకోకుండానో, లేదా చదువుకుని కూడా గృహిణిగానే ఉండే మరో మహిళ తన జీవితాన్ని, ఉద్యోగం చేసే మహిళతో పోల్చుకుని బాధపడుతుంది. అలాగే ఉద్యోగం చేసే మహిళ తాను గృహిణిగా ఇంటిపట్టే ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటుంది. అంతేగాని ఎవరి జీవితం వారిది. ఎవరిష్టం వారిది అని మాత్రం అనుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మరి కొందరైతే ఇతరులతో పోల్చుకొని ఈర్షపడుతుంటారు. తమకంటే బెటర్‌గా ఎదుగుతుంటే అటువంటి అవకాశం తమకు లేకుండా పోయిందని అసూయ చెందుతారు. అలాంటి వారిని ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటమో, చులకన చేయడమో, సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో వారిపట్ల వ్యతిరేక ప్రచారం చేయడమో చేస్తుంటారు. పోలిక అనేదిక ఇక్కడ క్రమంగా ఓర్వలేని గుణానికి దారి తీస్తుంది. క్రమంగా వ్యతిరేక ఆలోచనలతో మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెప్తున్నారు.

తక్కువ చేసి మాట్లాడటం తగదు

కొందరు మహిళలు భర్త ఆర్థిక సంపాదనపై ఆధారపడుతున్నప్పుడు, ఇండిపెండెంట్‌గా ఉన్న మరో మహిళతో పోల్చుకుని తమకు ఆ అవకాశం ఎక్కడిదని ఫీలవుతుంటారు. అయితే ఈ ఆలోచనలు ఎక్కవైతే మానసిక తీవ్రతకు దారి తీస్తుంది. అప్పుడు వారు ఉద్యోగం చేస్తు్న్న ఇతర మహిళలు సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్నారని, మగ రాయుడిలా జాబ్ చేస్తున్నారని నిందిస్తుంటారు. వారితో పోల్చినప్పుడు తాము బయటకు వెళ్లి సంపాదించాల్సిన అవసరం లేదని, తాము గొప్ప సంప్రదాయ వాదులమని, తమ భర్తలు తెచ్చి పెడతారని గొప్పలు చెప్పుకుంటుంటారు. తమను తాము ఆదర్శంగా ప్రకటించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగం చేసే కొందరు మహిళలు కూడా గృహిణులైన మహిళలపై లేదా తమ కాళ్లపై తాము నిలబడలేని పరిస్థితి ఉన్నవారితో కంపేర్ చేసుకుని.. తామేదో గొప్పవాళ్లమన్నట్లు ఫీలై పోతుంటారు. తమకంటే బలహీన పరిస్థితిలో ఉన్నవారిని, ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారిని చులకన చేస్తుంటారు. ఇది కూడా ఒక మానసిక రుగ్మతకు చెందిన పోలికగానే మారుతుందని నిపుణులు చెప్తున్నారు. అంటే పోలికలు తమను తీర్చిదిద్దుకునే కోణంలో కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టి సంతోషపడే మాదిరిగా ఉంటున్నాయన్న మాట.

ఇలా చుట్టుపక్కల వారితోనో, బంధువులతోనో, కుటుంబ సభ్యులతోనో పోల్చుకొని బాధపడేవారు తరుచూ తారసపడుతుంటారు. పెళ్లిళ్లయ్యాక అక్కాచెల్లెళ్లు తమ జీవితాలను పోల్చుకుంటుంటారు. ఇతరులతో పోల్చినప్పుడు తమ జీవితం బాగాలేదని బాధ పడటమో, ఎదుటివారిది బాగా లేనందుకు రిలాక్స్ అయ్యే మనస్తత్వమో కలిగి ఉంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు క్రమంగా మెంటల్ డిజార్డర్స్ బారినపడే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. పోలికలు బాధను కారణమవుతున్నప్పుడు.. అవి మానసిక వికాసాన్ని దెబ్బతీసి శారీరక అనారోగ్యాలకూ దారి తీయవచ్చు. అందుకే తామెలా ఉండాలో, సమాజంలో ఎలా మసలుకోవాలో అనేది ఎవరి పరిస్థితులను బట్టి వారు నిర్ణయించుకోవాలే తప్ప ఇతరులతో పోల్చుకోవద్దని మానసిక నిపుణులు చెప్తున్నారు.

Tags:    

Similar News