ఇతరులతో మిమ్మల్ని పోల్చుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్టే..!

మీరు జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకుంటున్నారా?

Update: 2023-01-08 08:39 GMT

దిశ, ఫీచర్స్ : '' మీరు జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకుంటున్నారా? చదువు, ఉద్యోగం, మరే ఇతర రంగంలో అయినా సరే. ఫలానా విధంగా రాణించాలని కలలు గంటున్నరా? అయితే మీరు ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. అదేమిటంటే.. మీ లక్ష్యాన్ని చేరే క్రమంలో ఎన్నడూ ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరులను అనుసరించవద్దు. మీ పరిస్థితిని బట్టి మీరు ఎలా ఎదగాలో, ఏ విధంగా సక్సెస్ సాధించాలో నిర్ణయించుకొని ముందుకు సాగాలి'' అంటున్నారు మానసిక నిపుణులు. అలాగని మీరు మీ చుట్టుపక్కలగానీ, సమాజంలో గానీ విజేతలను ఆదర్శంగా తీసుకోవద్దని మాత్రం అర్థం చేసుకుంటే ఇక్కడ తప్పులో కాలేసినట్టే. పుస్తకాల నుంచి, సమాజంలో విజేతల నుంచి, ఆదర్శనాయకుల జీవితాల నుంచి, లేదా సక్సెస్ సాధించిన స్నేహితుల నుంచి ఎవరైనా స్ఫూర్తి పొందవచ్చు. వారి విజయాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకొని మీ పద్ధతిలో మీరు లక్ష్యం దిశగా పయనించవచ్చు. కానీ ఇతరులు ఏ మార్గాన్నయితే అనుసరించారో అచ్చం అలాంటి మార్గాన్నే మీరూ అనుసరించాలనుకుంటారే.. అదీ పొరపాటు ఆలోచన అంటున్నారు సైకాలజిస్టు వీరేందర్ జీ. ఉదాహరణకు ఒక వ్యక్తి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామానికి కారులో 15 నిమిషాల్లో చేరుతాడనుకుందాం. సైకిల్ తొక్కుతున్న వ్యక్తి కూడా అతన్ని ఆదర్శంగా తీసుకుని 10 కిలో మీటర్లు 15 నిమిషాల్లో చేరాలి అనుకుంటే మాత్రం సాధ్యమా? ఒకవేళ గట్టిగా నిర్ణయించుకుని ప్రయత్నించినా కొంతసేపు స్పీడ్‌గా సైకిల్ తొక్కాక అలసిపోవడమో, పడిపోవడమో జరుగుతుంది. అలాగే సైకిల్ తొక్కే వ్యక్తితో పోల్చుకుంటూ ఎన్నడూ సైకిల్ తొక్కే అలవాటు లేని వ్యక్తి కూడా సైకిల్ తొక్కడంలో స్పీడు అందుకున్న విజేతను అనుసరిస్తూ పోటీ పడగలడా? అస్సలు కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి అనుసరించే పద్ధతి వారు అనుసరిస్తుంటారు. ఎవరి అవసరాన్ని బట్టివారు, ఎవరి పరిస్థితిని బట్టి వారు ప్రయత్నిస్తుంటారు. పరిస్థితులు కూడా అందుకు సహకరిస్తే విజేతలుగా నిలుస్తుంటారు. దాని వెనుక వ్యక్తుల కష్టం కూడా ఉంటుంది. అంతే తప్ప ఒకరు అనుసరించిన మార్గాన్నే అనుసరించడంవల్లో, వారితో పోల్చుకుంటూ వారిలాగే చేయడంవల్లో విజయం వరించదు అంటున్నాయి ఆధునిక అధ్యయన కర్తలు.

సమాజంలో భిన్నమైన వ్యక్తులు ఉంటారు. భిన్నమైన ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. లక్ష్యాలు కూడా భిన్నమైనవిగా ఉంటాయి. అయితే ఆయా వ్యక్తులు తమ తమ కలలు నెరవేర్చుకునే అవకాశాలు బోలెడన్ని ఉంటాయి. శోధించి సాధించాలి కానీ పోల్చుకోవడం, అనుసరించడం తగదు. చదువులో రాణించాలన్న కోరితో ఒక ధనవంతుడు ఎంతైనా ఖర్చుపెట్టి అనుకున్నది సాధించవచ్చు. అలాగే నిరుపేద కూడా సమాజం, ప్రభుత్వం కల్పించిన అవకాశాలను వినియోగించుకుని కష్టపడి చదివి విజేతగా నిలవొచ్చు. వీరిలో ఎవరు అనుసరించే మార్గం వారికే సొంతం తప్ప ఒకరిలా మరొకరు సేమ్ టు సేమ్ విజయం సాధించే ప్రయత్నం చేయరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఏదైనా సాధించాలనుకుంటారో అది మీకే ప్రత్యేకం. ఇతరులతో పోలికవద్దు. మక్కీకి మక్కీ అనుసరణ వద్దు అనేది నిపుణులు చెప్తున్నమాట.

డిగ్రీ పూర్తిచేసి అర్హత సాధించిన ఒక విద్యార్థి పీహెచ్ డీ కోసం దరఖాస్తు చేశాడు. అది తెలుసుకున్న మరో విద్యార్థికి ఇంట్రెస్ట్ లేకపోయినా.. తనకు నచ్చని సబ్జెక్టే అయినా తన స్నేహితుడు దేనికోసమైతే దరఖాస్తు చేశాడో, దానికే ఇతను కూడా చేశాడు. అంటే ఇక్కడ గుడ్డిగా అనుసరించాడు తప్ప సొంత ఆలోచనలేదు. ఇలా చేసేవారు రకరకాల కారణాలు చెప్తుండవచ్చు. తన స్నేహితుడు ఏదైనా చేస్తే మంచిదే చేస్తాడు అనే ఆలోచన కావచ్చు. లేదా అతనిలాగా తను కూడా సాధించాలనే ధోరణి కావచ్చు. ఏదైతేనేం ఇలా అనుకోవడం, అనుసరించడం మాత్రం తప్పు అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ అర్జున్. స్నేహితుడు ఒక మార్గాన్ని అనుసరిస్తే అదే మార్గాన్ని ఇష్టం లేకపోయినా అనుసరించడంవల్ల ఒరిగేదేమీ ఉండదు ఓటమి తప్ప అంటున్నారు పలువురు మానసిక నిపుణులు. అందుకే మీ సొంత ఆలోచనతో..మీరున్న పరిస్థితినిబట్టి ఏ లక్ష్యాన్ని ఎంచుకోవాలో, ఎలా సాధించుకోవాలో నిర్ణయించుకోండి తప్ప, ఇతరులతో పోల్చుకొని కాదు అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News