వాతావరణం చల్లబడితే చెవిలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

వేసవి కాలమే అయినా తుఫాన్ కారణంగా రెండుమూడు రోజులుగా వాతావరణం చల్లబడింది.

Update: 2023-03-19 13:31 GMT

దిశ, ఫీచర్స్:  వేసవి కాలమే అయినా తుఫాన్ కారణంగా రెండుమూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. మధ్య మధ్యలో వర్షం కురుస్తోంది. చల్లటి వెదర్‌వల్ల కొందరిలో చెవినొప్పి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుందని చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య తలెత్తినవారిలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గర గర వంటివి కూడా ఉండవచ్చు. బస్సుల్లో, బైకుల మీద వెళ్తున్నప్పుడు చల్లటి గాలి చెవిలోకి పోవడంవల్ల కూడా సమస్య తీవ్రమవుతుంది. గాలి చెవిలోకి చేరడం కారణంగా నొప్పి కలగడం, చెవిపోటు రావడం జరుగుతూ ఉంటాయి. చెవిలో ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు కూడా లోపలి భాగంలో ఎర్రటి కురుపులు ఏర్పడి ఎక్కువగా నొప్పిని కలిగిస్తాయి.

ఇన్ఫెక్షన్స్

వెదర్ చల్లబడినప్పుడు లేదా వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చెవిలోకి నీళ్లు అధికంగా పోయినప్పుడు పిల్లల్లో, పెద్దల్లో చెవి ఇన్ ఫెక్షన్ కలగవచ్చు. చాలాసార్లు జలుబు ఉన్నవారిలో ఇవి తలెత్తుతుంటాయి. చెవిని గొంతుతో కలిపే యుస్టాచియన్ ట్యూబ్ ద్వారా బ్యాక్టీరియా చెవికి వెళ్లడం ద్వారా ఈ సమస్య ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల చెవినుంచి ద్రవంలాంటిది కారుతూ దుర్వాసన వెదజల్లుంది.

ముక్కు దిబ్బడ, సైనస్

ముక్కులో ఇబ్బందిగా అనిపించడం, లేదా మూసుకు పోయిన ఫీలింగ్ కలుగుతుంది. గొంతును, చెవిని కలిపే యుస్టాచియన్ ట్యూబ్‌లో చిక్కటి ద్రవం లాంటి పదార్థం పేరుకుపోవడంవల్ల ఇలా జరుగుతుంది. చెవి పోటు వస్తుంది. అంతేగాక జలుబు, దగ్గు, తుమ్ముల కారణంగా చెవి లోపలి భాగంలో, సిరల్లో ఒత్తిడి కలిగి చెవిపోటు లేదా నొప్పి కలుగవచ్చు. అందుకే దగ్గు, జలుబు వంటివి ఐదారు రోజులకు మించి తగ్గకుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్.

వాతావరణ మార్పుల కారణంగా చాలామందిని బాధించే సమస్యల్లో సైనస్ ఒకటి. ఇది ఉన్నవారిలో అలర్జీలవల్ల తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఫలితంగా చెవిలో నొప్పి ప్రారంభం కావచ్చు.


నరాలపై ప్రభావం

వర్షం కురిసినప్పుడు వీచే చలిగాలులు చెవిని తాకి, చెవి రంద్రంలోకి ప్రవేశించడంవల్ల లోపలి భాగంలోని సున్నితమైన నరాలు ప్రభావితం అవుతాయి. అందుకే తుఫానులు, చల్లటి గాలులు వీస్తున్నప్పుడు చాలామంది చెవి సమస్యను ఎదుర్కోవడం కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో బయటకు వెళ్లేవారు చెవులను మూసి ఉంచే చర్యలు తీసుకోవాలి. వెచ్చటి రుమాలు కట్టుకోవడమో, క్యాప్ పెట్టుకోవడమో చేయాలి. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఈఎన్టీ నిపుణులు.

Tags:    

Similar News