ప్రకృతి రక్షకులకు 'గ్రీన్ జాబ్స్'!
దిశ, ఫీచర్స్ : పర్యావరణ మార్పు.. ప్రకృతి, జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నది కాదనలేని సత్యం.
దిశ, ఫీచర్స్ : పర్యావరణ మార్పు.. ప్రకృతి, జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నది కాదనలేని సత్యం. అడవుల నిర్మూలన, బొగ్గు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తరహా ఇంధనాల వాడకంతో ఏటా విడుదలవుతున్న బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌తో భూమి వేడెక్కుతోంది. ప్లాస్టిక్ వాడకం ద్వారా మనమే చేతులారా ప్రకృతిని కలుషితం చేస్తుండటంతో ముప్పు ఎదుర్కొంటున్నమన్నది తెలియంది కాదు. పర్యావరణానికి జరుగుతున్న నష్టం, ప్రమాదం గురించి పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు తరుచుగా హెచ్చరించినా సరే కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలతో సహా భారత్ కూడా 'క్లైమేట్ చేంజ్'ను ఎదుర్కోనేందుకు స్థిరమైన ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. అంతేకాదు పర్యావరణ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం, వాటిని వేగంగా అమలు చేస్తున్న విధానాల వల్ల పెద్ద సంఖ్యలో 'గ్రీన్ జాబ్స్' వస్తాయని పేర్కొన్నాడు. ఇంతకీ 'గ్రీన్ జాబ్స్' అంటే ఏమిటి? ఎవరు అర్హులు? అవకాశాలున్నాయి? ఏ కోర్సులు చదవాలి? ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
భారతీయ కంపెనీలు 'క్లైమేట్ యాక్షన్'లో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను ఎక్కువగా నియమించుకుంటున్నట్లు ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 2022 నాటికి ఎన్విరాన్‌మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG), సస్టైనబిలిటీ వంటి వర్టికల్స్‌లో జాబ్ పోస్టింగ్స్ 2019 ఏప్రిల్‌తో పోలిస్తే మనదేశంలో 468 శాతం పెరిగినట్లు జాబ్ పోర్టల్ ఇండీడ్ పేర్కొంది. ఇక 74 శాతం మంది ఉద్యోగార్థులు వాతావరణ మార్పులను పరిష్కరించడంలో సాయపడే గ్రీన్ జాబ్‌పై ఆసక్తి కలిగి ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఇంటర్నెట్-బేస్డ్ మార్కెట్ రీసెర్చ్ 'యూగవ్' అధ్యయనం పేర్కొంది. జూన్ 2021లో జరిగిన ఈ సర్వేలో కెనడా, ఘనా, ఇండియా, పాకిస్థాన్, యూకే, యూఎస్‌లలో నివసించే 18 నుంచి 35ఏళ్ల వయస్సు గల యువతీయువకులు పాల్గొన్నారు. సస్టైనబిలిటీ జాబ్ మార్కెట్‌లో ఇతర ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే ఇండియా ఇప్పటికే అత్యధిక వృద్ధిని సాధించి రెండో స్థానంలో నిలిచింది.
ఉద్యోగావకాశాలు :
ప్లానెట్ హెల్త్ రక్షించడం సహా పర్యావరణ సంక్షేమానికి దోహదపడే ఉద్యోగాలే 'గ్రీన్ జాబ్స్'. ఆయా సంస్థల కార్బన్ పాదముద్రను తగ్గించేందుకు సమర్థవంతంగా కార్యకలాపాలు రూపొందించడం ద్వారా ఈ ఉద్యోగులు సహాయపడతారు. అదేవిధంగా పునరుత్పాదక ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, హరిత రవాణా, పట్టణ వ్యవసాయం వంటి అంశాలతో సహా ఆర్థిక రంగాల ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో ఈ ఉద్యోగార్థులు పరిశ్రమిస్తారు. రీసెంట్ డేటా ప్రకారం ఈ స్పేస్‌లో గత మూడేళ్ల కాలంగా సస్టైనబిలిటీ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ మేనేజర్, సస్టైనబిలిటీ కన్సల్టెంట్ అండ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బీఎఫ్‌ఎస్ఐ, కన్సల్టింగ్ రంగాలు రీసెర్చ్ ఈఎస్‌జీ(ఎన్విరాన్‌మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్)లను అత్యధికంగా నియమించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్, ఐటీ, ఎడ్యుకేషన్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు కూడా 'గ్రీన్ జాబ్స్' ఆఫర్ చేస్తున్నాయి.
వరల్డ్ వైడ్‌గా ప్రోత్సాహం :
ప్రపంచవ్యాప్తంగా కూడా 'గ్రీన్ జాబ్స్' రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పలు ఆర్గనైజేషన్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫిడరేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం, ఇంటర్నేషనల్ ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్ కలిసి 2008లో గ్రీన్ జాబ్స్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించాయి. ఇది 'గ్రీన్ జాబ్స్'లో పనిచేసే వ్యక్తులకు మెరుగైన ప్లేస్‌మెంట్స్, శిక్షణ, అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు యునైటెడ్ కింగ్‌డమ్ 2030 నాటికి దాదాపు 694,000 గ్రీన్ ఉద్యోగాలను కల్పిస్తుందని సమాచారం. వచ్చే దశాబ్దం నాటికి భారతదేశం హరిత ఆర్థిక వ్యవస్థకు వెళ్లడం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు 3 మిలియన్ ఉద్యోగాలు సృష్టిస్తుందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) పేర్కొంది. పునరుత్పాదక ఇంధన రంగం 2017లో దాదాపు 47,000 కొత్త ఉద్యోగాలను సృష్టించిందని, కేవలం ఏడాది వ్యవధిలోనే 12% వృద్ధిని సాధించిందని ఐఎస్‌వో తెలిపింది.
స్కిల్ కౌన్సిల్ :
'స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్'ను 2015 అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది గ్రీన్ జాబ్ స్కిల్స్‌కు సంబంధించి వ్యక్తులకు అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే విధంగా వ్యర్థాలు, కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం, వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా మద్దతు ఇవ్వడం వంటి సేవలను విస్తరిస్తోంది.
టాప్ కాలేజీల్లో కోర్సులు :
యూనివర్సిటీలు కూడా క్లైమేట్ చేంజ్‌కు సంబంధించిన పలు సబ్జెక్ట్‌లపై కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన ఐఐటీ, ఐఐఎమ్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీఈఆర్ఐ(TERI) ఎస్ఐయూ(SIU), ఎక్స్ఐఎమ్‌బీ(XIMB), ఆశోక యూనివర్సిటీలు పర్యావరణ విద్యకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, గ్రీన్ ఎకానమీ, సస్టైనబుల్ ప్రొడక్ట్స్, గ్రీన్ మార్కెటింగ్, గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఇవే కాదు ఎన్విరాన్మెంటల్ లా, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ స్పెషలైజింగ్ ఇన్ క్లైమేట్ టెక్నాలజీస్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ మేనెజ్‌మెంట్, క్లైమేట్ సైన్స్ అండ్ పాలసీ, వేస్ట్ మేనెజ్‌మెంట్, రీనెవబుల్ ఎనర్జీ వంటి పలురకాల కోర్సులు అందిస్తున్నాయి.